బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా

15 Sep, 2022 15:21 IST|Sakshi

బోది చెట్టు కింది బుద్దుడు

యాల పొద్దుగాల. తుప్పర్లు బడ్తున్నయి. విజయవాడ కండ్లు దెరుస్తున్నది. సీపురు కట్ట బట్కోని సపాయోల్లు తొవ్వలు ఊక్తున్నరు. పాలపాకెట్లు అమ్మెటోల్లు పాలపాకిట్లు అమ్ముతున్నరు. బాసండ్లు తోమెతంద్కు పనిమన్సులు బోతున్నరు. వేరె గల్లి కెల్లి వొచ్చిన కుక్కను జూసి గల్లి కుక్కలు మొర్గుతున్నయి.

కొంతమంది లీడర్లు సుత గప్పుడే నిద్ర లేసిండ్రు. మోటర్ల ఎన్క గూసున్నోల్లు గూడ సీటు బెల్టు బెట్టు కోవాలని జెప్తున్నరు. మంత్రి కుర్సికి ఆకర్కి ముక్యమంత్రి కుర్సికి గుడ్క సీటు బెల్టు బెట్టుకుంటె మంచిగుంటదని లీడర్లు అన్కుంటున్నరు. గట్ల జేస్తె సచ్చెదాంక కుర్సిమీద గూసుండొచ్చు. ఎలచ్చన్లు, గిలచ్చన్లు లేకుండబోతె మజా చెయ్యొచ్చని గాల్లు జెప్తున్నరు.

తొమ్మిది గొట్టింది. తుప్పర్లు బందైనయి. మబ్బుల సాటుకెల్లి సూర్యుడెల్లిండు. పల్చటి ఎండ గొట్టబట్టింది. టీడీపీ లీడర్‌ యనమల రామకిష్నుడు కాఫి దాగిండు. ఆరాం కుర్సిల గూసోని పేపర్‌ సద్వబట్టిండు. ఏం కొంప మున్గిందేమొగని ఒక విలేకరి గాయిన తాన్కి బోయిండు.

‘నమస్తే సార్‌’ అని అన్నడు.
‘నమస్తే. ఏందివయా యాల పొద్దుగాలే వొచ్చినవ్‌’ అని యనమల అడిగిండు.

‘బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మా రాస్ట్రంల బెట్టుండ్రి అంటె మా రాస్ట్రంల బెట్టుండ్రనుకుంట పదిహేడు రాస్ట్రాలు దర్కాస్తు బెడ్తె మూడు రాస్ట్రాలల్ల బెట్టెతంద్కు పర్మిషన్‌ ఇచ్చిండ్రు. గా మూడు రాస్ట్రాలల్ల మన ఆంద్రప్రదేశ్‌ గూడ ఉన్నది గదా’.
‘అవ్‌ ఉన్నది’.
‘మన రాస్ట్రంల బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బెట్టొద్దని సంటర్కు కారటెందుకేసిండ్రు’.
‘గదిగిన బెడ్తె కాకినాడ కాడ రైతుల బత్కులే గాకుంట బెస్తోల్ల బత్కులు బండలైతయి. గాలి, నీల్లు కరాబైతయి’.

‘గవి కరాబ్‌ గాకుంట ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ బెడ్తరు. గది బెడ్తెనే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు పర్మిషనిస్తరు. గా పార్క్‌ తోని ఇర్వై వేల మందికి కొల్వులు దొరుక్తయి. గంతేగాకుంట గాదాంట్ల రోగాలు తక్వజేసేటి మందులు తయారు జేస్తరు’.

‘అన్ని రోగాలు తక్వ జేసేటి మందుండంగ గా మందుల్తోని పనేమున్నది. మందుగొడ్తె ముసలోడు గుడ్క మైకేల్‌ జాక్సన్‌ లెక్క డాన్సు జేస్తడు. కీసల పైసలేనోడు గూడ అమరావతి బూములు గొంటనంటడు. ఏబీసీడీలు రానోడు సుత అంగ్రేజిల మాడ్లాడ్తడు. మొన్నటిదాంక మా అయ్యన్న పాత్రున్కి విశాక డిస్టిలరి ఉండె. మా వియ్యంకునికి పి.ఎం.కె. డిస్టిలరి ఉన్నది. ఆదికేశవులు నాయుడికి శ్రీకిష్న డిస్టిలరి ఉన్నది. గివన్ని మా చెంద్రబాబు జమానకెల్లే నడుస్తున్నయి. గివన్ని ఉండంగ వేరె బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఎందుకు?

బ్రాంది తాగినోడు బ్రహ్మలోకమున కేగు
విస్కిగొట్టినోడు విష్ణువు చెంత జేరు
ఏమి తాగనోడు ఎడ్డోడు చెడ్డోడు
మందు భాగ్యశీల మరి మాటలేల’
అని యనమల పద్దెం బాడిండు.

‘వహ్వా! వహ్వా! క్యా ఖూబ్‌’ అన్కుంట విలేకరి బోయిండు.
ఒక దిక్కు గిట్లుంటె ఇంకో దిక్కు లోకేశ్, చెంద్రబాబు తాన్కి బోయిండు.
‘నాయినా! నాయినా!’ అని బిల్సిండు.
‘ఏం గావాలె బిడ్డా!’ అని చెంద్రబాబు అడిగిండు.

‘రాహుల్‌ గాంది బారత్‌ జోడో యాత్ర జేస్తుండే’.
‘గాయిన జేస్తె నీకేందిరా?’
‘నేను గూడ ఏపీ జోడో యాత్ర జేస్తనే’.
‘నువ్వు జేసుడెందుకు?’

‘రాహుల్‌ గాందిని అందరు పప్పు అంటరు. నన్ను గూడ పప్పనే అంటున్నరు. పెద్ద పప్పు పాదయాత్ర జేస్తుండంగ చిన్న పప్పు జెయ్యకుంటె ఏం బాగుంటదే’.
‘రాజకీయాలు ఎన్నడు నేర్సుకుంటవురా. చెట్టు మనది గాకున్నా పండ్లు మనమే దీస్కోవాలె. పంట మనం పండియ్యకున్నా పంటంత మనదే అనాలె’.
‘గదెట్లనే’.
‘వొచ్చెపారి బాలకిష్ననే ముక్యమంత్రి క్యాండేట్‌ అనాలె. మా కాక అన్కుంట జూనియర్‌ ఎన్టీఆర్‌ గాయిన దిక్కుకెల్లి ప్రచారం జేస్తడు. మల్లొక పారి టీడీపీ సర్కారొస్తది. బాలకిష్న ముక్యమంత్రి అయితడు’. (క్లిక్ చేయండి: గటు దిక్కు బోవద్దు గన్పతీ!)

‘మా మామ ముక్యమంత్రి అయితె నాకేం ఫాయిద?’
‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు బొడ్సి నేను ముక్యమంత్రిని గాలేదా? నా తీర్గనే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు బొడ్సి నువ్వు ముక్యమంత్రివి గావొచ్చు. షార్ట్‌కట్‌ ఉండంగ పాదయాత్రలు, గీదయాత్రలు మనకెంద్కు బిడ్డా’ అని చెంద్రబాబు అన్నడు.
దాంతోని లోకేశ్‌ బోది చెట్టు కింది బుద్దుడయ్యిండు.


- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు