Telidevara Bhanumurthy: చల్నేదో బాల్‌ కిషన్‌

24 Sep, 2022 16:15 IST|Sakshi

కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్‌ దమ్‌ పండ్లనే అమ్ముకుంటున్నరు. 
ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్‌ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్‌ మార్‌ కాన్‌ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు.

గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న.
కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు.

‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్‌ఎస్‌ మోటర్‌ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్‌ఎస్‌ మోటార్‌ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు.
‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’

‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’.
‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’

‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’
‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్‌ఎస్‌ మోటర్‌ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’

‘‘మొన్న 17 తారీకు పరేడ్‌ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్‌ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్‌ హోం మంత్రి అమిత్‌ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్‌ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్‌ గొట్టిండు’’.

‘‘ఇంతకుముందు కేసీఆర్‌ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’
‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్‌ ఇయ్యాల బీజేపీ సెట్‌ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్‌ 17 తారీకు పబ్లిక్‌ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్‌ స్పీచ్‌ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు.

‘‘హుజూరాబాద్‌ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’
‘‘అవ్‌ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!)

‘‘అమిత్‌ షాను బీజేపోల్లు అబినవ సర్దార్‌ పటేల్‌ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్‌ అని అంటున్నడే’’
‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్‌ షా సర్దార్‌ వల్లభాయ్‌ పటేలైతడా? కేసీఆర్‌ యాడనన్న అంబేడ్కర్‌ అయితడా?’’ అని మా తాత అడిగిండు.

బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా)

తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్‌ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్‌ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్‌ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా!

- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు