Telidevara Bhanumurthy: బీఆర్‌ఎస్‌ అంటే ఏంది?

14 Oct, 2022 11:44 IST|Sakshi

అట్లుంటది

ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్కు జవాబ్‌ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్‌ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు.

జమానా బదల్‌ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్‌ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్‌ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు.

‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్‌ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు.
‘మల్ల టీఆర్‌ఎస్‌ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు.

‘టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. 
‘గది వీఆర్‌ఎస్‌ అయితదా?’

‘కేటీఆర్‌ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్కు వీఆర్‌ఎస్‌ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’.

‘కేసీఆర్‌ ఏం జేసిండు?’
‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్‌ ముక్యమంత్రి నితీశ్‌ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్‌ యాదవ్‌ను గుడ్క కేసీఆర్‌ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్‌ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్‌ఎస్‌ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్‌ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్‌ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్‌ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’.

‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’
‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్‌ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’

‘ఇంకేం జేసిండు?’
‘పట్నంల బిహార్‌ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్‌ మార్కాన్‌ నన్నడు. కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టి బెడ్తె టీఆర్‌ఎస్‌ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్‌ కీ నేతా కేసీఆర్‌ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్‌ టీఆర్‌ఎస్‌ లీడర్‌ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్‌ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్‌ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్‌ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్‌ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్కు జవాబ్‌ జెప్పకుంటివా అంటె నీ మోటర్‌ బిరక్‌ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా)

‘బీఆర్‌ఎస్‌ అంటె బిరండి, రమ్ము, స్కాచ్‌ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు.
సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు.  (క్లిక్ చేయండి: చల్నేదో బాల్‌ కిషన్‌)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు