చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు?

27 Jan, 2023 12:45 IST|Sakshi

అట్లుంటది

పొద్దు మీకింది. ఎప్పటి తీర్గనే చౌరస్తల ఉన్న పాన్‌ డబ్బ కాడ్కి బోయిన. పాన్‌ డబ్బ మా అడ్డ. దినాం పొద్దు మీకంగనే మా దోస్తు లందరు గాడ జమైతరు. నాత్రి తొమ్మిది గొట్టె దాంక ముచ్చట బెడ్తం. నేను బోకముందు మా దోస్తులు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు.

‘‘మొన్న ఓటర్ల దినాన మా వాడ కట్టు ఓటర్లు మీటింగ్‌ బెట్టిండ్రు’’ అని యాద్గిరి అన్నడు.
‘‘మీటింగ్‌ బెట్టి ఏం జేసిండ్రు’’ అని సత్నారి అడిగిండు.

‘‘తీర్మానాలు జేసిండ్రు’’
‘‘గయేంటియో జర జెప్పు’’
‘‘గ్యాస్‌ బండ దర బెంచిండ్రు. బస్‌ చార్జిలు బెంచిండ్రు. కరెంటు చార్జిలు గుడ్క బెంచిండ్రు. మనం గుడ్క ఓటు దర బెంచాలె. ఓటును అగ్వ దరకు అమ్మే సవాల్‌ లేదు. ఉద్దెర నడ్వదు. అంత నగతే. గిట్ల నగతిస్తె గట్ల ఓటేస్త మనాలె. గుండు గుత్త ఓట్ల కోసం కుల పెద్దకు రూపాయ లిచ్చినమని లీడర్లు జెప్తె నమ్మొద్దు. ఓటరు అంటె ఎవడు. దేవునసుంటోడు. దేవునికి ఏ తీర్గ పూజలు జేస్తరో గదే తీర్గ లీడర్లు ఓటర్కు పూజలు జెయ్యాలె’’ అని యాద్గిరి ఇంకేమొ జెప్పబోతుంటె ఇస్తారి అడ్డం దల్గి –

‘‘నోటుకు ఓటు గాకుంట ఇంకేమన్న తీర్మానాలు జేసిండ్రా?’’ అని అడిగిండు.
‘‘చేసిండ్రు. ఓటు ఏసెతంద్కు బోయెటోల్లని మోటర్ల దీస్క బోవాలె. లైన్ల శానసేపు నిలబడే పనిబడ్తె కాల్లు నొవ్వకుంట తలా ఒక కుర్సి ఏసి కూసుండ బెట్టాలె. ఎండ దాకకుంట షామియానాలు ఎయ్యాలె. షామియాన ఏసేటి మోక లేకుంటె తలకొక ఛత్రి బట్టే సౌలత్‌ బెట్టాలె. ఎండ కాలంల ఓట్లేసే పని బడ్తె సల్లటి సోడలు తాపియ్యాలె. గదే సలికాలమైతె ఛాయ్, కాఫి ఇయ్యాలె’’ అని యాద్గిరి జెప్పిండు.

‘‘కూట్లె రాయి దీయనోడు ఏట్లె రాయెట్ల దీస్తడు అని బీఆర్‌ఎస్‌ లీడర్లు అంటుంటరు. గని గాల్లే గురువింద ఇత్తు అసుంటోల్లన్న సంగతిని యాది మరుస్తున్నరు’’ అని ఇస్తారి అన్నడు.
‘‘గా సంగతేందో జెర జెప్పు’’ అని సత్నారి అన్నడు. 

‘‘హుజూరాబాద్‌ బై ఎలచ్చన్ల ముంగట దలిత బందు పద్కం బెట్టిండ్రు. ఎట్లన్న జేసి గెల్వాలని గా నియోజక వర్గంల అమలు జేసిండ్రు. వాసాల మర్రిల 75 మంది దళితులకు గీ పద్కం కింద తలా పది లచ్చల రూపాయ లిచ్చిండ్రు. అటెంకల నియోజక వర్గంకు 500 మందికి దలిత బందు పద్కం కింద తలా పది లచ్చలు ఇస్తమన్నరు. మల్ల గిప్పుడు 200 మందికే ఇస్తమంటున్నరు. బడ్జెట్‌ బెట్టి యాడాదైంది. గని పోయిన పది నెలలల్ల ఒక్కడంటె ఒక్క నికి గుడ్క ఈ పద్కం కింద రూపాయలియ్య లేదు. బీఆర్‌ఎస్‌ సర్కారొస్తె దేసమంత దలిత బందు పద్కం బెడ్త మని కేసీఆర్‌ అన్నడు. రాస్ట్రంలనే అమలు జెయ్యనోడు దేసంల అమలెట్ల జేస్తడు’’ అని ఇస్తారి అన్నడు.

‘‘హాత్‌ సే హాత్‌ యాత్ర సంగతేంది?’’
‘‘వొచ్చె నెల ఆరో తారీకు కెల్లి రాస్ట్రంల హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర జేస్తమని కాంగ్రెస్‌ లీడర్లు అంటున్నరు. ముందుగాల చబ్బీస్‌ జన్వరి కెల్లి గీ పాదయాత్ర జేద్దామను కున్నరు. రాహుల్‌ గాంది బారత్‌ జోడో పాదయాత్ర కశ్మిర్లకు బోయింది. గని జమ్ముల చబ్బీస్‌ జన్వరి దినాన గాకుంట ముప్పై తారీకు రాహుల్‌ జెండ ఎగిరేస్తడట. బారత్‌ జోడో కతమైన చబ్బీస్‌ జన్వరి దినాన్నే హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర షురువు జేద్దామని కాంగ్రెస్‌ లీడర్లు అను కున్నరు. గని జమ్ముల రాహుల్‌ పబ్లిక్‌ మీటింగ్‌ వాయిద బడ బట్కె తెలంగానల పాదయాత్ర గుడ్క వాయిద బడ్డది. యథా లీడర్‌ తథా క్యాడర్‌.’’

‘‘హాత్‌ సే హాత్‌ జోడో అంటె చెయ్యితోని చెయ్యి గల్పుడు. చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు. కుస్తి పట్టేటి ముంగట గల్పుతరు. చెయ్యి తోని చెయ్యి గల్పుడు అంటె చెయ్యిచ్చుడు. గీ రొండిట్ల ఏం జేస్తమని కాంగ్రెస్‌ జెప్తున్నది’’ అని సత్నారి అడిగిండు.

‘‘కోడి గుడ్డు మీద బూరు బీక్తున్నవు. పస్కలొచ్చినోనికి దునియంత పచ్చగనే కండ్ల బడ్తదట’’ అని ఇస్తారి అన్నడు.
‘‘గాంది బవన్కు వొచ్చేటి సవాల్‌ లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీనడ్మ గాంది బవన్కు వొచ్చిండు. రేవంత్‌ రెడ్డిని గల్సిండు. ఇద్దరం గల్సి హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర జేద్దామన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లప్పుడు కాంగ్రెస్‌ కిలాఫ్‌ మాట్లాడిన వెంకట్‌ రెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్‌ దీస్కోవాలెనని కొండా సురేక అంటున్నది. ముందుగాల్ల లీడర్‌ సే లీడర్‌ జోడో అయినంకనే హాత్‌ సే హాత్‌ జోడో అంటె బాగుంటది’’ అని సత్నారి అన్నడు.

‘‘ఆది శంకరాచార్య అందరి కన్న ఫస్టు కన్యాకుమారి కెల్లి కశ్మీర్‌ దాంక పాదయాత్ర జేసిండ్రు. మల్ల గిప్పుడు శంకరాచార్య తీర్గనే రాహుల్‌ గాంది గుడ్క కన్యాకుమారి కెల్లి కశ్మీర్‌ దాంక పాదయాత్ర జేసిండని కశ్మీర్‌ మాజి ముక్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ఒక్క తీర్గ తారీఫ్‌ జేసిండు. గాయిన శంకరాచార్య అనంగనే రాహుల్‌కు ముగ్గురు దేవులల్ల ఒక్కడైన శంకరుడు యాది కొచ్చిండు. యాదికి రాంగనే గాయిన చెయ్యి సూబెట్టిండు. బారత్‌ జోడో యాత్ర అనేటి తపస్సు జేసిన. చేసినంకనే మీకు అరచెయ్యి అంటె అభయ ముద్ర సూబెడ్తున్న అని రాహుల్‌ గాంది అన్నడు’’ అని యాద్గిరి జెప్పిండు. నాత్రి తొమ్మిది గొట్టినంక ఎవలింటికి గాల్లు బోయినం. (క్లిక్ చేయండి: మామా రాహుల్‌ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు