గటు దిక్కు బోవద్దు గన్పతీ!

9 Sep, 2022 13:55 IST|Sakshi

కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది.

‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’
‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్‌హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’

‘‘గీపారి గట్లగాదమ్మా.’’
‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’
‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’
‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ 

గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’

‘‘తప్పి జారి గవి దినేవు!’’
‘‘ఎందుకు దినొద్దు?’’
‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ  పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’
‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’

‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’
‘‘ఎందుకు బోవద్దు నారదా!’’
‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్‌ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్‌ఎస్‌ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’
‘‘చాక్‌ పీస్ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’
‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్‌ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్‌ఎస్‌ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’

‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’
‘‘రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’
‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’

‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’
‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’
‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్‌ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్‌నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’
‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’

‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్‌ రెడ్డి అంటడు.’’

‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’
‘‘అవ్‌. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’
‘‘వామ్మో!’’

‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు.

‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు