Book Review: అనువాదం ఒక సవాలు

13 Jun, 2022 12:50 IST|Sakshi

‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్‌ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్‌ షార్ట్‌ స్టోరీస్‌ అఫ్‌ అవర్‌ టైమ్స్‌’కు ఓల్గా సంపాదకులు. హార్పర్‌ పెరెన్నియల్‌ వాళ్ళు ప్రచురించారు. 

‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. 

ఈ సంకలనంలో సతీష్‌ చందర్‌ ‘డాగ్‌ ఫాదర్‌’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్‌ కుమార్‌ ‘జుమ్మే కి రాత్‌’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్‌.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్‌ ఆత్మ హత్య’,  కె.ఎన్‌. మల్లీశ్వరి  ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్‌ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్‌ ‘కొలిమి’, మహమ్మద్‌ ఖదీర్‌ బాబు ‘గెట్‌ పబ్లిష్డ్‌’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్‌సిలా’, జి.ఆర్‌.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్‌.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్‌’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి.   

పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి)

– కె. సునీతారాణి

మరిన్ని వార్తలు