Telugu Children Books: మణిరత్నాలు ఈ పుస్తకాలు

12 Dec, 2022 13:12 IST|Sakshi

ఆడుతూ పాడుతూ కాలం గడిపే పిల్లలను అందమైన ఊహా లోకంలోనికి తీసుకెళ్ళేవి కథలు. కథలు వినడమన్నా, చదవడమన్నా పిల్లలకు చాలా ఇష్టం. భావి భారతాన్ని అందంగా ఆవిష్కరించేది బాల సాహిత్యం. నేటి పిల్లలలో నైతికత, సామాజిక భావం, మానవత్వం, సహృదయత, ఆధ్యా త్మికత, క్రమశిక్షణ వంటి సుగుణ లక్షణాలు అలవడాలంటే, వారి కల్మషం లేని మనసులను సాహిత్యం వైపునకు మరల్చాలి. అందుకు సరైన వేదిక బాల సాహిత్యం.   


పాఠ్యపుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే, కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అంశాలను, జీవన నైపుణ్యాలను అందిస్తాయి. సాహిత్యం ద్వారానే బాలలలో సంపూర్ణ వికాసం కలుగుతుందని వారికోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో సదా ముందుంటారు మణికొండ వేద కుమార్‌. వీరు ‘చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి’ ఛైర్మన్‌గా ఉంటూ, దాదాపు మూడు దశాబ్దాలుగా బాల వికాసం కోసం పనిచేస్తున్నారు. ‘బాల చెలిమి’ పత్రిక, ‘బాల చెలిమి’ గ్రంథాలయాలు, నెల నెలా ‘బాల చెలిమి ముచ్చట్లు’ నిర్వహిస్తూ బాల సాహి త్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు. తమ అకాడమీ ద్వారా పిల్లలు రాసిన అనేక పుస్తకాలను ముద్రించి, వారి రచనలు వెలుగులోకి తెస్తున్నారు.

వేదకుమార్‌ సంకల్పానికి, బాల సాహితీ వేత్తలు గరిపెళ్లి అశోక్, పత్తిపాక మోహన్‌ తోడయ్యారు. తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను సేకరించారు. గరిపెళ్లి అశోక్‌ రాష్ట్ర కన్వీనర్‌గా ఉంటూ, వివిధ జిల్లాల్లోని కన్వీనర్లను సమన్వయపరుస్తూ, ఉపాధ్యాయుల ద్వారా పిల్లలు రాసిన కథలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 కథలు రాగా, కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు పలుమార్లు కథలను పరిశీలించి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రచురణ కొరకు కథలను ఎంపిక చేశారు. ( క్లిక్ చేయండి: Writers Meet 2022.. కొత్త రచయితల గట్టి వాగ్దానం)

2020 జనవరి 29న హైదరాబాద్‌లో పది జిల్లాల బడిపిల్లల కథలను బాలల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అలాగే పిల్లల కోసం తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల బాల సాహిత్య రచయితలు రాసిన ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ ఉమ్మడి పది జిల్లాల పేరుతో పది సంకలనాలను అందమైన బొమ్మలతో వెలువరించడమనేది బాల సాహిత్యంలో చరిత్రాత్మక ఘట్టం. ఈ బాల సాహిత్య యాగం తెలంగాణకే పరిమితం కాకూడదని ఆంధ్రప్రదేశ్‌లోని బడి పిల్లల నుండీ కథల సేకరణ ప్రారంభించడం ముదావహం. (క్లిక్ చేయండి: GN Saibaba Poems.. ఒంటరి గానాలాపన)

– దుర్గమ్‌ భైతి 
ఉపాధ్యాయులు, సిద్దిపేట

మరిన్ని వార్తలు