కందికొండకు క్యాన్సర్‌.. ‘మనందరం అండగా నిలబడదాం’

18 Jun, 2021 14:39 IST|Sakshi

కందికొండ: మట్టిమనుషుల పాటల ఊట

సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్‌ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం.

ప్రొఫెసర్‌ అవ్వాలనే కోరికతో డబుల్‌ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ.

ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్‌ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి.  సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్‌డీ చేసి ఇటీవలే డాక్టరేట్‌ కూడ అందుకున్నారు.

తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు.


ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్‌తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది.

దాతలు గూగుల్‌ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్‌ 135510100174728 (అకౌంట్‌ నంబర్‌). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును.

- వరకుమార్‌ గుండెపంగు
ప్రముఖ కథా రచయిత
మొబైల్‌: 99485 41711 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు