పద్యశిఖరం ఒరిగిపోయింది!

18 Jun, 2022 12:32 IST|Sakshi

పద్యం తెలుగువారి ఆస్తి. ఆ ఆస్తిని మరింత పెంచిన కొల్లా శ్రీకృష్ణారావు సోమవారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జీవితాన్ని సాహితీ సృజనలో గడిపిన కవితా తపస్వి మృతితో తెలుగు సాహిత్య లోకం... మరో పద్య కవితా శిఖరాన్ని కోల్పోయింది. 

గుంటూరు జిల్లా పెదకూరపాడులో మహాలక్ష్మి– సూరయ్య రైతు దంపతులకు జన్మించారు శ్రీకృష్ణారావు. బాల్యం నుండి కవిత్వం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు మహా కవులు గుర్రం జాషువా, ఏటుకూరి వెంకట నరసయ్యలను కవితా గురువులుగా ఎంచుకున్నారు. వారి నుంచి తెలుగు పద్యంలోని మెలకువలు గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం పద్య ‘శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను తెలుగు పద్య సింహాసనంపై కూర్చో బెట్టి పద్యానికి పట్టాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. విలువైన పద్య కావ్యాలు రాసి పచ్చి పసుపులు పండించారు. ‘కవి బ్రహ్మ’ ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుష జ్యోతి’ని వెలిగించారు. రైతు పక్షపాతిగా కర్షక సాహిత్యం వెలయించారు. జాషువాను గుండెలకు హత్తుకుని ‘మన కవి జాషువా’ పేరుతో విలువైన వ్యాస సంపుటిని రచించారు. ‘మఱుగు పడిన మహాకవి తురగా వెంకమరాజు’ అనే వీరి పరిశోధనాత్మక గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో పనికొచ్చే పుస్తకం. (క్లిక్‌: నిష్కర్ష విమర్శకుడు!)

‘కవిబ్రహ్మ ఏటుకూరి’ పేరుతో గురువుకు అక్షర దక్షిణ సమ ర్పించారు. ‘నా సాహితీ యాత్ర’ పేరుతో స్వీయ చరిత్రను పాఠక లోకా నికి బహుకరించారు. ఛందో బద్ధ పద్యంలాగే నడకలోనూ, నడతలోనూ... వడీ, వంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్ర వాణి’, ‘భావ వీణ’ పత్రికలను నడిపారు. అవిశ్రాంత అక్షర తపస్వికి నిండు మనస్సుతో నివాళులు. 

– డాక్టర్‌ బీరం సుందరరావు, చీరాల

మరిన్ని వార్తలు