మన తెలుగు పద్మాలు

26 Jan, 2022 03:39 IST|Sakshi

గణతంత్ర దినోత్సవం ముంగిట తెలుగు పద్మాలు నిండుగా వికసించాయి. తెలుగు కీర్తిని ఘనంగా చాటాయి. అనంతపురంలో పుట్టిన ఓ కుర్రాడు అంతర్జాతీయ యవనికపై తెలుగు కీర్తిబావుటాను రెపరెపలాడిస్తున్నాడు. కరోనా టీకాను అపర సంజీవనిగా అందించింది ఒక శాస్త్రవేత్తల జంట. కిన్నెరపై సొగసుగా పదనిసలు వాయిస్తూ జాతీయ స్థాయిలో అబ్బురపరుస్తున్నాడో అడవి బిడ్డ. మనిషి ఎలా జీవించాలి అంటూ ప్రపంచం నలుమూలలా తెలుగు మాటలను వ్యాపింపజేస్తున్నాడు ఒక ఆధ్యాత్మిక వేత్త. ఇలా చెప్తూ పోతే ఎన్నో పద్మాలు... ఎన్నో ప్రత్యేకతలు... 

టీకా మేకర్స్‌
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలన్న దృఢ సంకల్పమే వ్యవసాయంలో పట్టభద్రుడైన కృష్ణ ఎల్లాను శాస్త్రవేత్తను చేసింది. తమిళనాడులోని తిరుత్తణిలో 1969లో జన్మించిన ఆయన బెంగ ళూరులోని యూని వర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌లో డిగ్రీ విద్య నభ్యసించారు. సౌత్‌ కరోలినా యూనివర్సి టీలో కొంతకాలం బోధన చేపట్టారు. ఆరోగ్య రంగం ఎదుర్కొం టున్న సవాళ్లకు పరిష్కారాలు కనుక్కోవాలన్న లక్ష్యంతో భార్య సుచిత్రతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 1996లో భారత్‌ బయోటెక్‌ను స్థాపించిన ఈ దంపతులు వ్యాక్సిన్ల తయారీలో తమదైన ముద్ర వేశారు.

ఇప్పటివరకూ 116 అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ టీకాలను సరఫరా చేశారు. మానవాళికి సవాలు విసిరిన సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ నియంత్రణకు అందరికంటే ముందుగా టీకా ప్రయ త్నాలు మొదలుపెట్టింది ఈ దంపతులే. అట్లా కోవాగ్జిన్‌ దేశీయ టీకాగా ఆవిర్భవించింది. శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా కృష్ణ ఎల్లా ఎదుగుదల వెనుక ఉన్న శక్తి ఆయన భార్య సుచిత్రా ఎల్లా. హైదరాబాద్లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం నుంచి పేటెంట్‌ చట్టాల్లో పీజీ డిప్లొమా చేశారు. నిజానికి సుచిత్రా అభ్యర్థన మేరకే కృష్ణ భారత్‌ తిరిగి వచ్చారు. హైదరాబాద్‌ నగరంలో భారత్‌ బయోటెక్‌ ఏర్పాటుకు ఆమె కారణమయ్యారు. 

నటనా షావుకారు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తమిళనాడు నుంచి ‘షావుకారు’ జానకిని పద్మశ్రీకి ఎంపిక చేశారు. 1931 డిసెంబరు 12న రాజ మండ్రిలో టి. వెంకోజీరావు, శచీదేవి దంపతులకు జన్మించారామె. అసలు పేరు శంకరమంచి జానకి. తన 11వ  ఏటనే రేడియో నాటికల ద్వారా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత అనేక రంగస్థల నాటకాల్లో నటిం చారు. మామూలుగా పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్‌ అయి పోతుంది అంటారు. ఇల్లాలంటే ఇంటి బాధ్యతలు చూసుకోవాలని అనుకునే రోజుల్లో పెళ్లి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ‘రక్షరేఖ’లో చంద్రిక పాత్ర చేశారు. అయితే 1950లో ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’తో ప్రసిద్ధి చెందారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత శంకరమంచి జానకి కాస్తా ‘షావుకారు’ జానకిగా మారిపోయారు. 

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ వంటి హీరోలకు జోడీగా నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400  చిత్రాల్లో నటించారు. ‘డాక్టర్‌ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాలు చేశారు. క్యారెక్టర్‌ నటిగా మారాక  ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సంసారం ఒక చదరంగం’ లాంటి చిత్రాల్లో కథకు కీలకంగా నిలిచే పాత్రలు చేశారు. 90 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తుండటం విశేషం. తమిళంలో రెండేళ్ల క్రితం తన 400వ సినిమాగా ‘బిస్కోత్‌’లో నటించారు. తెలుగులో ఆమె చేసిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ విడుదలకు సిద్ధంగా ఉంది.

జీవితమే మెట్లుగా...
కొంతకాలం క్రితం వరకు కిన్నెర వాద్యమంటే పెద్దగా తెలియదు. కానీ, సామాజిక మాధ్యమాల ప్రాభవంతో అలాంటి ఓ వాయిద్యముందనీ, దాన్ని సొంత తెలివితో ఓ అడవి బిడ్డ 12 మెట్లతో రూపొందించాడనీ, అతని పేరు మొగులయ్య అన్న విషయం వెలుగు చూసింది. నాగర్‌కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగిన దర్శనం మొగులయ్య క్రమంగా కిన్నెర మొగులయ్యగా మారారు.

దీని మీద జానపదాలు, స్థానిక రాజులు, వీరుల గాథలను ఊరూరా తిరుగుతూ లయబద్ధంగా పాడతారు. తెలంగాణ ఆర్టీసీ ఆయన్ని తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ‘ప్రభుత్వం నా కళను గుర్తించి ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారానికి ఎంపిక చేయటం సంతోషంగా ఉంది. అంతరించిపోతున్న కిన్నెర కళను బతి కించేందుకు పనిచేస్తాను. ఆసక్తి ఉన్న వారికి కిన్నెర కళను నేర్పిస్తాను’ అన్నారు.

వైద్య నారాయణుడు
డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు భీమవరం యూఎస్‌సీఎం ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. 1961–66 కాలంలో విశాఖ పట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1970లో అదే కళాశాల నుంచి∙ఆర్థోపెడిక్‌ సర్జరీలో ఎం.ఎస్‌.(ఆర్థోపెడిక్స్‌) పూర్తి చేశారు. తరువాత జర్మనీ వెళ్ళి మైక్రోవాస్కులర్, హ్యాండ్‌ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు.  వచ్చాక ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గానూ, విశాఖ పట్నంలోని కింగ్‌ జార్జి ఆసుపత్రిలో సివిల్‌ సర్జన్‌ గానూ సేవలందించారు.

రాణీ చంద్రమణి దేవి హాస్పిటల్, రెహాబిలిటేషన్‌ సెంటర్‌కు సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ట్రామాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకూ 3 లక్షల వరకూ ఆపరేషన్లు చేశారు. ఒకే రోజు తన సిబ్బందితో విశాఖలో 325 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ‘సర్జరీ ఆన్‌ పోలియో డిజెబిలిటీ’, ‘ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ ఆర్థోపెడిక్స్‌’ పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

పటం కథల్లో దిట్ట 
సమ్మక్క–సారలమ్మ గద్దె వద్ద నిలబడి ఆ వనదేవతల పటం కథ చెప్తుంటే భక్తులు తన్మయత్వంలో మునిగిపోతారు. కథ పాతదే. కానీ చేతిలో కోయ డోలును వాయిస్తూ  అలాంటి డోలు ధరించిన ఇద్దరు వంతగాళ్లతో కలిసి కథను చెప్పే తీరు అబ్బురపరుస్తుంది. ఆ కథకుడే రామచంద్రయ్య.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన 60 ఏళ్ల గిరిజన కళాకారుడు.

కోయ, తెలుగు... రెండు భాషల్లోనూ పటం కథలు చెబుతారు. నిరక్షరాస్యుడైనప్పటికీ గిరిజన యోధులు, వన దేవతల గాథలన్నీ మస్తిష్కంలో నిక్షిప్తం. తండ్రి సకిని ముసలయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రామచంద్రయ్య  12 ఏళ్ల ప్రాయం నుంచే గిరిజన దేవుళ్ల చరిత్రలు చెప్పడం మొదలు పెట్టారు ‘కోయ భాషలో గిరిజన దేవతల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ కాలంలో ఎవరూ ముందుకురావడం లే’దని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను తండ్రి నుంచి నేర్చుకున్న కళను తన కుమారుడు  బాబూరావుకు నేర్పించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

నాదస్వరమే ఊపిరిగా...
భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో షేక్‌ అస్సాన్‌ సాహెబ్‌  నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఆయనను మరణాంతరం పద్మశ్రీ వరిం చింది. 1928 జనవరి 1న కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని గోసవీడు గ్రామంలో జన్మించిన షేక్‌ అస్సాన్‌  తన 93వ ఏట 23 జూన్‌ 2021న కన్ను మూశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నోప్రఖ్యాత దేవాలయాల్లో నాద స్వర ప్రదర్శ నలను ఇచ్చిన ఘనత ఈయన సొంతం.

సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో 1950 నుంచి 1996 వరకు నాదస్వర ఆస్థాన విద్వాన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నాదస్వరంలో ప్రభుత్వ ఉద్యోగిగా రామాలయంలో పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి ముస్లిం ఈయనే కావడం విశేషం. ఆయన పలువురు శిష్యులు నాదస్వర విద్వాంసులుగా, ఉద్యోగులుగా ఆలయాల్లో పనిచేస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్‌ మొనగాడు!
హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతా నికి చెందిన తెలుగు బిడ్డ సత్య నాదెళ్ళ ఇవాళ ప్రపంచం తిరిగి చూసే స్థాయికి ఎదిగారు. దాని వెనుక ఆయన స్వయం కృషి, దీక్ష అనన్య సామాన్యం. 2014లో∙మైక్రోసాఫ్ట్‌ సంస్థకు సీఈఓగా ఎదిగిన ఆయన కథ ఎందరికో స్ఫూర్తి. ‘మొబైల్‌ – ఫస్ట్, క్లౌడ్‌ – ఫస్ట్‌’ వ్యూహంతో సత్య మైక్రోసాఫ్ట్‌ జాతకాన్నే మార్చేయడం ఓ చరిత్ర పాఠం. ఆయన పగ్గాలు చేపట్టినప్పుడు 30 వేల కోట్ల డాలర్ల చిల్లర ఉన్న మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ ఆపైన ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లకు చేరడమే అందుకు ఓ నిదర్శనం.

మాతృదేశాన్ని గర్వించేలా చేసిన భారతీయ – అమెరికన్‌ అయిన 54 ఏళ్ళ సత్యకు ‘వాణిజ్యం, పరిశ్రమల’ విభాగంలో చేసిన కృషికిగాను పద్మ పురస్కారం ప్రకటించారు. తండ్రి ఐ.ఏ.ఎస్‌. అధికారి అయిన సత్య కర్ణాటకలోని మణి పాల్‌లో ఇంజనీరింగ్‌ చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్‌ – మిల్‌వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్‌ చదివారు. అమెరికా లోనే ఎమ్బీఏ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరక ముందు కొంత కాలం ఆయన సన్‌ మైక్రోసాఫ్ట్‌లో పనిచేశారు. మణిపాల్‌లో తన జూనియర్‌ – బీఆర్క్‌ విద్యార్థిని అయిన అనుపమను వివాహం చేసుకున్నారు. సత్య మామ గారు కూడా ఐఏఎస్సే. ముగ్గురు పిల్లల తండ్రి అయిన సత్యకు క్రికెట్‌ అంటే వీరాభిమానం. 

మహాసహస్రావధాని
గరికిపాటి నరసింహారావు బులిబులి అడుగులు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో పడ్డాయి. బాల్యం నుంచే పద్యధారణపై మక్కువ పెంచుకున్నారు. మేధను పెంచుకొనే క్రమంలో భాషకు సంబంధించి తల్లి ఇచ్చిన సవాళ్లను అధిగమించడం కోసం యత్నిస్తూ క్రమంగా ధారణను వంటబట్టించు కున్నారు. ఒకేసారి ఎక్కువ మంది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం ప్రారంభించి క్రమంగా అవధానాలు చేసే దిశగా అడుగులేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత కాకినాడలో అధ్యాపకులుగా చేరారు.

ఖమ్మం జిల్లాలో కూడా కొంతకాలం పనిచేశారు. వృత్తి కొనసాగిస్తూనే 1992లో అష్టావధానాలకు శ్రీకారం చుట్టారు. 1996లో కాకినాడలో 1,116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానాన్ని రంజుగా నిర్వహించి భేష్‌ అనిపించుకున్నారు. క్రమంగా అవధానం నుంచి ఆధ్యాత్మిక ప్రవచన కర్తగా ఎదిగారు. ఆధ్యాత్మిక ప్రసంగాల్లో ప్రాపంచిక విషయాలను జోడిస్తూ ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. సంప్ర దాయాలు, సనాతన పద్ధతులను కొనసాగిస్తూనే మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలపై ఆయన ప్రవచనాలే ఆయుధంగా పోరాడుతున్నారు. 

నాట్య రుద్రమ
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ గడ్డం పద్మజారెడ్డి కూచిపూడి నర్తకిగా కళకు తన జీవితాన్ని అర్పిం చారు. కృష్ణా జిల్లా పామర్రులో 1967 జనవరి 1న డాక్టర్‌ జీవీరెడ్డి, స్వరాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డిని వివాహం చేసుకుని తెలంగాణ కోడలు అయ్యారు.

ఐదేళ్ల వయస్సు నుంచే కూచిపూడి నాట్యం వైపు అడుగులు వేసిన ఆమె ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శోభానాయుడు దగ్గర మెళకువలు నేర్చుకున్నారు. సత్యభామ, రుద్రమదేవి పాత్రలకు పేరొందారు. ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్‌ ఆర్ట్‌ ఫామ్‌ను రూపొందించారు. నృత్త రత్నావళి గ్రంథంలోని అంశాలను దృశ్యరూపంగా మార్చారు. మరోవైపు ఆడపిల్లల భ్రూణ హత్యలు, ఎయిడ్స్, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే అంశాలకు సంబంధించి నత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన కుటుంబం తనకు ఎనలేని ప్రోత్సాహం ఇచ్చిందని ఆమె ‘సాక్షి’తో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు