KK Ranganathacharyulu: నిష్కర్ష విమర్శకుడు!

14 Jun, 2022 15:28 IST|Sakshi
కేకే రంగనాథాచార్యులు

నేను అనే స్వోత్కర్షలేని సాదాతనం; మాటల్లోనూ, చేతల్లోనూ ద్వంద్వాలు లేని వ్యక్తిత్వం; జీవితంలోనూ, బోధనలోనూ ఉన్నత ప్రమాణాలను లక్ష్యించి ఆచరించిన ఆదర్శం; ఏది చదివినా, రాసినా లోనారసి పరిశీలనం; వివేచనం పరిశోధనం; వీటన్నిటి మూర్తిమత్వం ప్రస్ఫుటించిన ఆచార్యులు కేకే రంగనాథాచార్యులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతిగా, మానవీయ విభాగం డీన్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఆరుద్రలను దగ్గరగా ఎరిగి, దిగంబర, విప్లవ కవులతో సన్నిహితంగా ఉండి, వారి తాత్విక దృక్పథాలను తనదైన చూపుతో విశ్లేషించారు. 2021 మే 15 దాకా నిశ్చలంగా భాషా సాహిత్యాల గురించి బహుముఖీన ఆలోచనలు చేస్తూనే తనువు చాలించారు.

మార్క్సిస్ట్‌ సామాజిక దృక్పథంతో పురాణయుగం నుంచి స్త్రీవాద, దళిత సాహిత్య దశల వరకూ చారిత్రక భూమికని పట్టి చూపిన విమర్శకుడు. హేతువాద, ప్రజాస్వామిక సంస్కృతిని ఆచరించి చూపిన ఆచరణవాది. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వేదికపై దశాబ్ద కాలానికి పైగా సమావేశాలు నిర్వహించి ప్రముఖులచే ప్రసంగాలు చేయించి, వాటిని సంకలనాలుగా తెచ్చిన రంగనాథాచార్యుల కృషి మరువరానిది. (క్లిక్‌: తెలుగు: ద బెస్ట్‌ షార్ట్‌ స్టోరీస్‌ అఫ్‌ అవర్‌ టైమ్స్‌)

‘తెలుగు సాహిత్యం– మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’, ‘తెలుగు సాహిత్య వికాసం’, ‘తెలుగు సాహిత్యం–చారిత్రక భూమిక’, ‘సామయిక వ్యాసాలు’, ‘బహుముఖం’, ‘తెలుగు భాష సంగ్రహ స్వరూపం వంటి రచనలు ఆయన పరిశోధన పరిశ్రమను చూపిస్తాయి. ఆయా గ్రంథాలకు ఆయన రాసిన విపుల పీఠికలు విమర్శకులకు, పరిశోధకులకు కరదీపికల వంటివి. ఏ ధోరణినైనా ఏ ఉద్యమాన్నైనా సమగ్ర దృష్టితో దర్శించడం, తులనాత్మకంగా పరిశీలించడం, చారిత్రక పరిణామ దృక్పథంతో వివేచించడం, అంచనా వేయడం అనే విమర్శన కృత్యాన్ని నిరంతరం నిర్వహించారు. ఆయన ఏది మాట్లాడినా, బోధించినా, రాసినా అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన ఉపన్యాసాలు, రచనలు ఆలోచనాత్మకాలు, విజ్ఞాన సర్వస్వాలు!

– కొల్లు వెంకటేశ్వరరావు, ఖమ్మం
(జూన్‌ 14న కేకే రంగనాథాచార్యుల జయంతి)

మరిన్ని వార్తలు