Rachamallu Ramachandra Reddy: రా.రా.  ఓ నఖరేఖా చిత్రం!

24 Nov, 2022 14:12 IST|Sakshi

సందర్భం

విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్‌ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! 

తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! 

విమర్శకుల్లో  రా.రా. మెథడాలజీని, మెథడ్‌ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్‌ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్‌ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది!

ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్‌ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్‌! ఈ విష యంలో ఫ్రాస్ట్‌కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్‌ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? 

రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్‌ ఖయావ్‌ు, రబీంద్రనాథ్‌ టాగోర్‌ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్‌ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్‌ ఎట్‌ హార్ట్‌) అయివుండాలి!! 

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ గురించి చెప్తూ ‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్‌ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్‌ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్‌ బ్రెష్ట్‌ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్‌ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి.

‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా.

రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. 

ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్‌గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! 


- మందలపర్తి కిశోర్‌ 
సీనియర్‌ పాత్రికేయుడు
(నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్‌ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి)

మరిన్ని వార్తలు