Ronanki Appalaswamy: నడిచే బహు భాషాకోవిదుడు

15 Sep, 2022 14:45 IST|Sakshi

కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకుడిగా, అనువాదుకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత భాషావేత్తగా ఎదిగారు. విజయనగరం ఎంఆర్‌ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్‌ ప్రారం భించారు. 

ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్‌ వంటి యూరోపియన్‌ భాష లను ఆధ్యయనం చేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమేకాక అను వాదాలూ చేశారు. గ్రామఫోన్‌ ప్లేట్లు పెట్టుకొని జర్మన్, లాటిన్‌ లాంటి భాషల్లో నైపుణ్యం సంపా దించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భార తీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు.

విజయనగరంలో వున్న తొలినాళ్లలో ‘సాంగ్స్‌ అండ్‌ లిరిక్స్‌’ పేరిట తొలికవితా సంపుటిని 1935లో వెలువ రించారు. అల్లసాని పెద్దన,  క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరిం చారు. మేకియవెల్లి ఇటాలియన్‌ భాషలో రాసిన ‘ప్రిన్స్‌’ గ్రంథాన్ని, ‘రాజనీతి’ పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన ‘పూర్ణమ్మ’, ‘తోకచుక్క’లను ఇంగ్లీష్‌లోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, నారాయణ బాబు, విశ్వ సుందరమ్మ, చాకలి బంగారమ్మ వంటివారిని ప్రపంచ కవితా ప్రియులకు పరిచయం చేసింది రోణంకి వారే.  ఆకాశవాణిలో కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేశారు.

ఆంగ్లభాషలో ఉత్తమ బోధకుడిగా, పలు భాషల్లో నిష్టాతుడిగా ఖ్యాతిగాంచిన రోణంకి అప్పలస్వామిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధన చేయమని ఆహ్వానం లభిం చింది. యూజీసీ ఎమెచ్యూర్‌ ప్రొఫెసర్‌గా నియమించింది. చాగంటి సోమయాజులు (చాసో), శ్రీరంగం నారాయణబాబు, చిర్రావూరి సర్వేశ్వర శర్మలు రోణంకికి మంచి స్నేహితులు. ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. (క్లిక్ చేయండి: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ)

ప్రముఖ రచయిత ఆరుద్ర, రోణంకి మాష్టారుకు శిష్యుడే. అందుకే తన తొలి కావ్యం ‘త్వమేవాహం’ను అప్పల స్వామికి అంకితం చేశారు. డాక్టర్‌ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను రోణంకి గారికే అంకితమిచ్చి మాష్టారు రుణం తీర్చుకున్నారు. పీవీ నరసింహారావు, పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి వారితో సమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఆచార్య అప్పలస్వామి జీవిత చరిత్రను, రచనలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.


- డాక్టర్‌ జి. లీలావరప్రసాదరావు 
వ్యాసకర్త అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్, బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, శ్రీకాకుళం
(సెప్టెంబరు 15నఆచార్య రోణంకి అప్పలస్వామి జయంతి)

మరిన్ని వార్తలు