నెరవేరిన చిరకాల స్వప్నం

29 Sep, 2022 10:35 IST|Sakshi

సందర్భం

ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్‌ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. 

రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్‌ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్‌ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్‌ / పెట్రోలు ఇంజిన్‌ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్‌/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్‌ వార్మింగ్‌లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.  

ఈ విద్యుత్‌ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్‌ డయాక్సైడ్‌ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్‌ డ్రైవింగ్‌ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్‌ లేదా డీజిల్‌ డ్రైవింగ్‌ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్‌ స్టేషన్‌ (ఛార్జింగ్‌ స్టేషన్‌) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్‌ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్‌ బస్సుల వినియోగానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. 

ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్‌ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్‌ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

ఈ విద్యుత్‌ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్‌ చేసే విద్యుత్‌ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్‌ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్‌ మోడల్‌తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్‌ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్‌ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది.


సీహెచ్‌ ద్వారకా తిరుమల రావు 
వ్యాసకర్త ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు