ఆహార స్వావలంబన విధాన దిశగా...

12 Nov, 2022 00:33 IST|Sakshi

విశ్లేషణ

గత యాభై ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగానికి సగం నశించింది. ఇది పర్యావరణ ప్రళయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవవైవిధ్య వినాశనం అని ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌’ నివేదిక చెబుతోంది. ఇవి మరింత ముదరడానికి ప్రపంచ ఆహార వ్యవస్థే కారణమని కూడా సూచిస్తోంది. దీన్ని బలపరిచే సాక్ష్యం, కుబేరుల జాబితాలోకి ఆహార రంగ వ్యాపారవేత్తలు చేరడం! విరోధాబాస ఏమిటంటే, ఈ సంక్షోభాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను బడా కంపెనీలు సూచిస్తుండటం! ఆహార భద్రత రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునేవారి చేతుల్లోకి మారిపోతోంది. ఈ విపరిణామాలు సంభవించకూడదంటే ఆహార వ్యవస్థ సమూలంగా మారాలి.

కొన్నేళ్ల క్రితం నాటి మాట. జర్మనీలోని ఓ నేచర్‌ రిజర్వ్‌పై ససెక్స్‌ యూనివర్శిటీ (యూకే) ఓ అధ్యయనం నిర్వ హించింది. దాని ప్రకారం, ఆ ప్రాంతంలోని క్రిమికీటక సంతతి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే... పాతికేళ్ల కాలంలో ఎగిరే కీటకాలు 75 శాతం వరకూ లేకుండా పోయాయి. ఈ పరిణామం ‘పర్యావరణ ప్రళయం’ లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ ఫలితాలకు ఆశ్చర్యపోయిన కొందరు శాస్త్రవేత్తలు కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉంటారని వ్యాఖ్యానించడమే కాకుండా... ఒకవేళ అదే నిజమైతే జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేలుకొలుపు అవుతుందని కూడా వ్యాఖ్యా నించారు.

ఐదేళ్ల తరువాత... ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన ‘లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌–2022’ కూడా ఇలాంటి బాంబే వేసింది. యాభై ఏళ్ల కాలంలో (1970–2018) వన్యప్రాణుల జనాభాలో దాదాపు సగం నశించిపోయిందని 32 వేల జీవజాతులను విశ్లేషించిన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌ తెలిపింది. లాటిన్‌ అమెరికా ప్రాంతంలో అత్య ధికంగా 94 శాతం జనాభా నశించి పోయింది. మంచినీటిలో బతికే వాటిల్లో 80 శాతం వాటికి నష్టం జరిగింది. ఈ నివేదికలోని ఇతర ఆందోళనకరమైన అంశాలను కాసేపు పక్కనబెడితే భూమి ‘ఆరవ మహా వినాశనం’ ముంగిట్లో ఉందన్న విషయం చాలాకాలంగా తెలుసు. అందుకే ఇది జీవజాతి వినాశనమనీ, మానవ నాగరకతల పునాదులపై జరుగుతున్న దాడి అనీ యూఎస్‌ నేషనల్‌ అకాడమి ఆఫ్‌ సైన్సెస్‌ పేర్కొనడం అతిశయోక్తి ఏమీ కాదు. 

నిజానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నివేదిక సమాజానికి ఒక షాక్‌ లాంటిది. కానీ చదువుకున్నవారి చాలామంది మనఃస్థితిని బట్టి చూస్తే, ఈ నివేదిక వారిని ఇసుమంత కూడా కదిలించినట్లు కనపడదు. వీరు చెట్లను అభివృద్ధి నిరోధకాలుగా చూస్తూంటారు. రహదారులు, గనులు, పరిశ్రమల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం, లేదా కావాల్సినట్టుగా మార్చుకోవడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పామాయిల్‌ పంటల కోసం విశాలమైన అటవీ భూములను చదును చూస్తూండటం ఈ ధోరణినే సూచిస్తుంది. అలాగే పచ్చటి అడవులను పప్పుబెల్లాల మాదిరిగా పరాయివారికి పంచేస్తూండటం చూస్తూంటేనే తెలుస్తుంది పర్యావరణానికి మనం ఏమాత్రం మర్యాద ఇస్తున్నామో!

ఏటా కోటి హెక్టార్ల నష్టం...
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మనం సుమారు కోటి హెక్టార్ల అటవీ భూమిని కోల్పోతున్నాం. కానీ ‘సీఓపీ’ చర్చల్లో దీనికి హద్దులు వేయాలన్న అంశంపై ఒక్క తీర్మానమూ జరగదు. ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవ వైవిధ్య వినాశనం అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఈ రెండు అంశాలు మరింత ముదిరేందుకు ప్రపంచ ఆహార వ్యవస్థ కారణమని కూడా సూచి స్తోంది. ఈ హెచ్చరిక ఉన్నా, వ్యవసాయ రంగంలో మార్పులన్నీ వ్యవసాయం పెద్ద ఎత్తున సాగాలన్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సూచించిన విధంగా మాత్రమే మారుతున్నాయి. 

‘ద యాక్షన్‌ గ్రూప్‌ ఆన్‌ ఎరోషన్, టెక్నాలజీ అండ్‌ కాన్‌సంట్రేషన్‌ (ఈటీసీ) వంటి అంతర్జాతీయ సంస్థ తయారు చేసిన ఇంకో నివేదిక కూడా ఆహార వ్యవస్థ బిగ్‌ ఫుడ్, బిగ్‌ టెక్, బిగ్‌ ఫైనాన్స్‌లకు చెందిన కంపెనీల చేతుల్లోకి జారిపోతోందని విస్పష్టంగా తెలిపింది. దీనివల్ల రైతులు, జాలర్ల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. నేలను విషతుల్యం చేయడం, నీళ్లను విపరీతంగా వాడేయడం, పర్యా వరణాన్ని కలుషితం చేయడం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం... ఈ క్రమంలో లాభాలు ఆర్జించడమే ఈ బడా కంపెనీల లక్ష్యంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కబళించిన రెండేళ్లలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి 62 మంది ‘ఆహార కోటీశ్వరులు’ చేరారు.

ఈ కాలావధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ కంపెనీ ‘కార్గిల్‌’ లాభాల వాటాలో 64 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని ఇతర ఫుడ్‌ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడ్డాయి. ఈ రెండు నివేదికలూ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధనాంశాలుగా ఉంచాలి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నివేదిక చెప్పే విషయానికి వ్యవయాయ రంగంలో జరుగుతున్న వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పలు ఉదాహరణలతో ఇచ్చిన ఈటీసీ నివేదిక... వ్యవసాయం డిజిటలైజ్‌ అయితే బోలెడంత సమాచారం సేకరించవచ్చుననీ, ఈ సమాచారం కాస్తా మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి పెద్ద కంపెనీల క్లౌడ్‌ సర్వర్లలోకి చేరిపోయి కొత్తకొత్త బిజినెస్‌ వ్యూహాల రూప కల్పనకు సిద్ధంగా ఉంటుందనీ చెబుతుంది. 

ఈ నివేదికను కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఇదెలా జరుగుతోందో అర్థమవుతుంది. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యంలో తరుగుదల అంశాలను చూపి బడా కంపెనీలు వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధా రిత పరిష్కారాలు సూచిస్తాయి. జన్యుమార్పిడి పంటలు, హైటెక్‌ విత్తనాల్లాంటివన్నమాట. డిజిటల్‌ వ్యవసాయం వల్ల లాభాలంటూ ఊదరగొడతాయి. ఇదే క్రమంలో జీవ వైవిధ్య వనరుల పరిరక్షణ పేరు చెప్పి, కృత్రిమ ఆహారాన్ని మన ముందుంచుతాయి. 

రైతులు, రైతు కూలీలు కనుమరుగు...
డిజిటల్‌ టెక్నాలజీల వల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందను కునేరు! డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పేరుతో ఇప్పుడున్న ఆహార వ్యవస్థ విధ్వంసం మాత్రమే జరుగ నుంది. బడా కంపెనీలవన్నీ తప్పుడు పరిష్కారాలని ఈ నివేదిక ద్వారానే స్పష్టమవుతుంది. డ్రోన్లు, సెన్సర్లు, ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధల వల్ల... రైతులు, రైతు కూలీలు క్రమేపీ మరుగున పడిపోతారు. డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు, యంత్రీకరణకు అనువైన పొలాలతో బడా టెక్‌ కంపెనీలు బడా ఆర్థిక సంస్థల సాయంతో రైతులకు అవసరమే లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆహార భద్రత అనేది రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునే కొందరి చేతుల్లోకి మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విత్తనాల విక్రయాల్లో 40 శాతాన్ని కేవలం రెండు కంపెనీలు నియంత్రి స్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవవచ్చు.

ఈ కంపెనీలు పరోక్షంగా ఆహార సరఫరా వ్యవస్థ మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లే లెక్క. ఏం పండించాలి, ఎప్పుడు పండించాలి వంటి అంశాలనూ బడా కంపెనీలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అంతేకాదు... ఆహార కంపెనీల సహకారంతో చివరకు పంటల కోతలు ఎలా జరగాలి, మనం ఏం తినాలన్నది కూడా నిర్ణయిస్తాయి. ఈ విపరిణామాలన్నీ సంభవించకుండా ఉండాలంటే ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థ సమూలంగా మారాల్సి ఉంటుంది. సరికొత్త ఆహార వ్యవస్థకు మారడం కూడా వైవిధ్యత, ఆహార సార్వ భౌమత్వం అంశాల ఆధారంగా సాగాలి. అంతేకాదు... ఇది 360 కోట్ల రైతులు, రైతుకూలీలు, మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగాల్సిన మార్పు. జీవ వైవిధ్య పరిరక్షణ, కనీస ఆదాయానికి భరోసా, వాతావ రణ పరంగా వీరికి న్యాయం జరగడం అప్పుడే సాధ్యమవుతుంది.

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు