పండు రాలిపోయింది.. పాట మిగిలింది

7 Aug, 2020 00:48 IST|Sakshi

స్విచ్‌ వేస్తే తీగలోకి విద్యుత్‌ ప్రవహించినట్టు.. ఆ పాట నరనరానా ఉత్తేజం నింపుతుందని రాచకొండ అన్నారు. అదిగో ఆ ఉత్తేజప్రసార వాగ్గేయకారుడు వంగపండు అకస్మాత్తుగా పాటను మనకొది లేసి వెలిపోయేడు. ఇపుడాయన గురించి వలపోతలు, తలపోతలు, జేజేలు, ఆహాలు, ఓహోలు... అన్నన్నాలు... యేమలగాలు.. చ్చొచ్చోలు.. వినబడుతున్నాయి. కొందరు వంగపండు పాటలో వసంతకాల గానాన్ని వెదకపూనుకున్నారు. మరి కొందరు–వసంతకాల మేఘఘర్జనలు ఇపుడా పాటగానిలో గానీ, పాటలో గానీ లేవనీ; ఏ ప్రజల కోసం ఆ పాట అంత శక్తివంతమయ్యిందో ఆ ప్రజలను వొదిలాక పాట శక్తిని కోల్పోయిందనీ, పాటగాడు వొంటరయ్యేడనీ... వొంటరిగా వెళిపోయాడని– విప్లవ కోర్టుపీఠాల మీంచి యే పీఠానికి ఆ పీఠం తీర్పుల ప్రకటనలిచ్చేశాయి.
         
చాన్నాళ్ళకిందట ఒకాయన–అమాయక జానపద ఎర్రజెండా–వంగపండు అని వ్యాఖ్యానించేడు. అవును.. వంగపండు అమాయక జానపద ఎర్రజెండా! అమాయకుడుగాబట్టే–అప్పుడుకి సిలకల రెక్కలిరిగి, ఊపిర్లాగి నేలకొరిగినాయి, పిల్లుల వేటలో యెలకలు కొన్ని సనిపోయినాయి. మరికొన్నిబోనుల్ల బందీ ఐనాయి. ఆకు తెంపితే ఆదివాసీ నెత్తురు సుక్కలుసుక్కలుగా కారుతున్న రోజులవి. కోరన్న, మంగన్న నుంచి జరుగుబాటు కోసం తిరుగుబాటు నేర్పిన గురువులు దాకా యెందరో వొరి గిన సమయమది. జెండా పీలికలు పీలికలయ్యింది. యెవులే పీలికకి లీడరో? ఏ రోడ్‌ యెటు తీసకపోతాదో అంతా తికమక మకతికగ ఉన్న సమయాన తికమకలూ, మకతికల్లేకుండా–ఏమ్‌ పిలడో యెల్దుమొస్తవా, శికాకుళంలో సీమకొండకని పిలుస్తూ, శికాకుళం బయలెళ్ళిపోనాడు.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్న ఎర్రని జెండాని పట్టుకొని! ఉడుపు మళ్ళల్లో వినిపించే ఉడుపుగత్తెల నోమీనోమన్నలు, పశుల కాపర్ల గొంతులు తెగే రాగాలు.. బాల్యం లోనే వంగపండు వొంటిని పట్టేయి. ఉపాధి కోసం ఐటీఐ చేసి విశాఖపట్నం చేరాడు. పల్లె రైతు బతుకు నుంచి పట్నపు కార్మిక బతుకులోకి వొచ్చేడు.

అపుడు పుట్టిందే.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్నా ఎర్రని జెండా పాట. కార్మిక గీతాలతో విశాఖలో మార్మోగిన వంగపండు గొంతు తొలిసారిగా పార్వతీపురంలో ‘వొత్తన్నాడొత్తన్నాడు.. ఆ భూములున్న బుగతోడు, పోలీసుల తోడుతోను, అడుగడుగో అటుసూడు..’ అని చేత చిరతలతో, కీచుగొంతుతో వేలాది జనానికి వినిపించేడు. వేలాది జనం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ కోసం వచ్చేరు. జనం వంగపండు పాటకు వన్స్‌మోర్‌ కొట్టేరు. శ్రీశ్రీ– ఇప్పుడు కావాల్సిన కవిత్వమిదీ అని వంగపండుని పొగిడేరు. అమాయక జానపదుడు కాబట్టి  శ్రీశ్రీలాగా.. ఇకముందు పాటని నేను నడుపుతాను. ఈ యుగం నాది అనన్లేదు. ఈ పాట జనానిది అనన్నాడు. ‘రండిరో... పండరి భజనకు’ అన్న భజన గీత బాణీని, భావాన్ని ప్రజల చైతన్య మార్గంలోకి మరల్చే పాటగా.. ‘రండిరో కూలన్నా.. సంఘం కడదామూ, ఈళ సంగతేదో సూద్దామూ..’ అని రాసేడు. పట్నం, పల్లె జీవితాల మీద పాటలు రాసేడు. మాలపేటని కళ్ళముందర పెట్టేడు. కూలోళ్ళపిల్లని లోకానికి చూపేడు. మడిలో బెడ్డలన్ని– నీ నెత్తురు గడ్డలూ, పండిన పంటలన్ని నీ సెమటా సుక్కలని రైతోడికి ఎరుక పరిస్తే; ఎంత్రమెట్టా నడుస్తు ఉందంటే... వోరన్నోలమ్మీ అని యంత్ర గమనాన్ని కార్మికునికి వినిపించేడు.

వంగపండు విశిష్టతకు ఓ గొప్ప ఉదాహరణ – భూమి బాగోతం నృత్య నాటక రచన, ప్రదర్శన. తెలుగునేల అశేష పల్లెల్లో ఇంత విస్తృతంగా ప్రదర్శనలు పొందిన కళారూపం ఇటీవల మరొకటి లేదు. శ్రీకాకుళ పోరాటాన్ని శిక్కోలు యుద్ధం పేరుతో కంజరి కథ; కారా గారి ప్రసిధ్ధ కథ ‘యగ్యం’ కంజరి కథగా రాసి ప్రదర్శనలు ఇచ్చాడు. అపార కళాసంపదను లోకానికి అందించిన ఈ వాగ్గేయకారుడు అతిపేదగా జీవించి మరణించాడు.

వ్యాసకర్త ప్రముఖ కథా, నవలా రచయిత
‘ఉరకవే’ అధ్యక్షుడు ‘ 94400 31961
 

మరిన్ని వార్తలు