సంస్కృతీ వటవృక్షాన్ని రక్షించుకోవాలి

2 Apr, 2022 01:49 IST|Sakshi

సందర్భం

ఉగాది పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు నూతన సంవత్సరాదిగా పిలుచుకునే ఈ రోజున... జీవితంలో ఎదు రయ్యే వివిధ రకాల అను భవాలకు ప్రతీకగా భావించే  షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని తినే ఆచారం ఉంది. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తినడం... ఒక రకంగా పర్యావరణానికి ఇచ్చే గౌరవమే. ఇందులో వాడే ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుంచి వచ్చిన పదార్థమే. ఇప్పుడు ఇందులో చేదును ప్రసా దించే వేప చెట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

‘అజారక్టా ఇండికా’ అనే శాస్త్రీయ నామం కలి గిన వేప చెట్టును పురాణాలలో లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పారు. ఈ భూమి మీద ఎక్కువగా మన దేశంలోనే కనిపించే చెట్టు వేప. ఈ ఆకులలో 150 రకాల విశి ష్టమైన రసాయనాల సమ్మేళనం ఉంది. పురాతన కాలం నుంచి వేపను వివిధ అవసరాలకు, చికిత్సలకు వాడుతున్నారు. వేప చెట్టు వేర్ల నుంచి చిగుర్ల వరకూ అన్ని భాగాలనూ భారతీయులు ఉపయోగించుకుం టున్నారు. ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాధాన్యం వుంది.

పేగుల్లో పురుగులు, మొలలు, దురదలు, దద్దుర్లు, పచ్చకామెర్లు, అల్సర్లు, అతి మూత్ర వ్యాధి; తామర, కుష్ఠు, సోరియాసిస్‌ వంటి చర్మ వ్యాధులకు; జ్వరం, మలేరియా, రక్త సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఈ వేప చెట్టు ఎంతో ఉపయోగకారి. మనదేశంలో దంతధావనం ఎక్కు వగా వేప పుల్లతోనే చేయడం మనకు తెలిసిన విష  యమే. అతి ప్రాచీన కాలం నుంచీ పంటపొలాలకు వేప పిండి, వేప నూనెలను ఎరువుగా, కీటక నాశినిగా వాడుతున్నారు. మన సంప్రదాయ వ్యవసాయంలో వేప విడదీయరాని భాగం.

ఇంతటి విశిష్టత కలిగిన ఈ వేప చెట్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత రెండు మూడు సంవత్సరా లుగా వేపచెట్లు తరచుగా ఎండిపోతున్నాయి. చాలా చోట్ల కూలడమూ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలం గాణ, రాయలసీమ ప్రాంతాలలో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. గత మూడు నాలుగు సంవ త్సరాల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై ‘లొరాంథస్‌’ అనే పరాన్న మొక్క ఎదగ డమే ఇందుకు కారణమని గుర్తించారు.

భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్‌ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలను పీల్చుకుంటుంది. ఫలితంగా వేప చెట్టు ఎండిపోయి కూలిపోతుంది. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్‌ను గుర్తించిన వెంటనే, చెట్టును మొత్తం కొట్టేయకుండా, అది ఉన్న కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా చెట్టుకు వ్యాపించ కుండా కాపాడవచ్చునని అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు.

అయితే ఇటీవల కొద్ది నెలలుగా ‘డిపాక్‌ డిసీజ్‌ ఆఫ్‌ నీవ్‌ు’ అని వ్యవహరించే మరో వ్యాధితో వేప చెట్లు చనిపోవడం వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే వైరస్‌ సోకిన కొమ్మలను కత్తరించి కాల్చివేయడం, అలాగే చెట్టుకు ఎక్కువ నీరు పోయడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నగరీకరణ వల్ల కాంక్రీట్‌ నిర్మాణాలు రావడం వల్ల చెట్టు కాండం వరకూ నిర్మాణాలు జరపడంతో చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందకపోవడం వల్ల కూడా చెట్లు అంతరిస్తున్నాయి. ఎంతో విలువైన ‘వేప చేదులోని తియ్యదనాన్ని’ భావి తరాలకు అందించడానికి ప్రభుత్వాలు వేపచెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి.

మోతె రవికాంత్‌
వ్యాసకర్త ‘సెఫ్‌’ వ్యవస్థాపక అధ్యక్షులు 
మొబైల్‌ : 94919 24345+

మరిన్ని వార్తలు