ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం

18 Apr, 2022 00:49 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతు న్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే– ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే! ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే– మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే!!

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ దాడి నేపథ్యంలో ప్రపంచ ఆహార మార్కెట్లు మరోసారి అల్లకల్లోలాన్ని చవిచూస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడనుంది. ఉక్రెయిన్‌లో బుల్లెట్లు, బాంబులు ప్రపంచ క్షుద్బాధా సంక్షోభాన్ని మనం కనీవినీ ఎరుగని స్థాయికి తీసుకుపోనున్నాయని ప్రపంచ ఆహార పథకం కార్యనిర్వాహక అధికారి డేవిడ్‌ బీస్లే ఇటీవలే వ్యాఖ్యానించారు. 2007–08 సంవత్సరంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రపంచ ఆహార సంక్షోభం కారణంగా సరకుల ధరలు అదుపుతప్పి పోయాయని చెబుతుంటారు. పెరిగిన చమురు ధరలు, అధిక ఆహార ఉత్పత్తి, కమోడిటీ ఫ్యూచర్స్‌ ద్వారా కలిగిన అధిక ధరలు వంటి కారణాలన్నీ పరస్పరం కలసిపోయి ప్రపంచ ఆహార సరఫరాలను స్తంభింపజేయ డమే కాదు... ఆనాడు 37 దేశాల్లో ఆహార దాడులకు దారితీశాయి.

అలనాటి సంక్షోభం పునరావృతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సరుకుల ధరలు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముందే పెరుగుతూ వచ్చాయి. 2021లో ఆహార ధరలు మునుపటి రికార్డులను బద్దలు గొట్టాయి. ఇతరేతర కారణాలు కూడా బలంగా తోడవడమే కాకుండా ప్రపంచ సరఫరాల్లో 30 శాతం గోదుమలను, 28 శాతం బార్లీని, 18 శాతం మొక్కజొన్నలను, 75 శాతం పొద్దుతిరుగుడు నూనె సరఫరాకు వీలుకలిగిస్తున్న నల్లసముద్ర రీజియన్‌లో ప్రస్తుతం సాగుతున్న ఘర్షణను గమినిస్తే ప్రపంచం మరోసారి తీవ్రమైన ఆహార సంక్షోభం వైపు పయనిస్తోంది. ఇది ఎంత తీవ్రమైన సంక్షోభం అనే అంశాన్ని భవిష్యత్తు మాత్రమే చెప్పాల్సి ఉంది.

ఇప్పటికే ఇరాక్, శ్రీలంక దేశాల్లో ఆహారం కోసం నిరసన ప్రదర్శ నలను ప్రపంచం చూస్తోంది. అనేక దేశాలు దేశీయ ఆహార సరఫరాకు దెబ్బ తగలకుండా ఉండటానికి స్వీయరక్షణ విధానాలకు మళ్లి పోయాయి. ముంచుకొస్తున్న సంక్షోభం వెనుక మరింత మంది దారి ద్య్రంలో కూరుకుపోనున్నారని బ్లూమ్‌బెర్గ్‌ సరిగ్గానే అంచనా వేసింది.
ఇప్పటికే ప్రపంచమంతటా ఆహార ధరలు పెరిగాయి. సూపర్‌ మార్కెట్లకు వచ్చే సరఫరాలు కనుమరుగవుతున్నాయి. ఆహార భద్రత రోజురోజుకూ ప్రమాదపు అంచుల్లోకి వెళుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద నైట్రోజన్‌ ఎరువుల ఎగుమతిదారుగా ఉండటంతోపాటు ఈ ప్రాంతం మొత్తంగా ఫాస్పరస్, పొటాష్‌ ఆధారిత ఎరువుల ఉత్పత్తిదారుగా బలమైన స్థానంలో ఉంటోంది. యుద్ధం కారణంగా భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన రైతుల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోనున్నాయని చెబుతున్నారు. ఇది పంటల ఉత్పత్తిపై పడుతుంది. ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది. ఆహార కొరతలే కాదు... వాటి ధరవరలు కూడా ఆహార సంక్షోభం ఏ స్థాయిలో ఉండబోతోందన్న అంశాన్ని నిర్ణయిస్తాయి.

ఈలోపు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంతో సహా ఉత్తర ఆఫ్రికా, అఫ్గా్గనిస్తాన్‌ వంటి దేశాలు సైతం ఈ సంక్షోభం తాకిడికి మొట్టమొదటగా దెబ్బతింటాయి. అలాగే ఆఫ్రికాలోని ఈజిప్ట్, మడగాస్కర్, మొరాకో, ట్యునీషియా, యెమెన్, లెబనాన్‌... ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ దేశాలతోపాటు టర్కీ, ఇరాన్, ఎరిత్రియా, ఇరాక్‌ కూడా ఈ సంక్షోభం బారిన పడనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ దేశాలన్నీ అధికంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవి. ఇక యూరోపియన్‌ యూనియన్‌ విషయానికి వస్తే పెరుగుతున్న దాణా ధరలు అక్కడి మాంస పరిశ్రమపై బలంగా వేటు వేయనున్నాయి. దీనివల్ల మాంసం ప్రాసెసింగ్‌ ధరలు పెరిగి పోతాయి. ఇప్పటికే స్పెయిన్‌లో సూపర్‌ మార్కెట్లలో వంటనూనెల కొనుగోళ్లపై రేషన్‌ విధించారు.

యుద్ధం మరికొంత కాలం ఇలాగే కొనసాగితే, పెరిగే ఆహార పదార్థాల ధరల ప్రభావం నిస్సందేహంగా అన్ని దేశాలపై పడు తుంది. యుద్ధానికి ముందే గోదుమ ధరలు రికార్డు స్థాయిని అందుకు న్నాయి. నిజానికి అధికంగా అమ్ముడుపోయే సరుకుల ధరలు చాలా కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. 2021లో అమెరికా ఆహార, వ్యవ సాయ సంస్థ ప్రకారం, గోదుమ, బార్లీ ధరలు మునుపటి ఏడాదితో పోలిస్తే 31 శాతం వరకు పెరిగాయి. దీంతో మొక్కజొన్న ధరలు కూడా పుంజుకున్నాయి. వీటి ధరలు కూడా సంవత్సరం లోపే 44 శాతం పెరగడం విశేషం. 2021లో సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ 63 శాతం పెరిగిన ధరతో రికార్డు సృష్టించింది. పైగా, ఈ సంవత్సరం మార్చి నెల తొలివారంలో గోదుమ ఫ్యూచర్ల ధర 2008 సంక్షోభం నాటి స్థాయికి పెరిగిపోయింది.

వీటి ధరలు మరింతగా అంటే మరో 22 శాతం పెరిగి గత రికార్డులన్నింటినీ బద్దలు చేస్తాయని అంచనా. దీనివల్ల 2022–23 సంవత్సరంలో పోషకాహర లేమి బారిన పడుతున్న వారి జనాభాకు మరో 8 నుంచి 13 మిలియన్ల మంది చేరతారని చెబుతున్నారు. భారతదేశంలోని గోదుమ ఎగుమతిదారులు సరఫరాల్లోని ఖాళీలను పూరించడానికి తపన పడుతుండగా, ఈ సంవత్సరం గోదుమ ఎగుమతిదారులు తమ ఎగుమతులను మూడు రెట్లకు పెంచనున్నారని ఐటీసీ ఊహిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం అదనపు మిగులును పండిస్తున్న భారతీయ రైతులను విమర్శించడానికి అలవాటుపడిన వారు, ఇప్పుడు ప్రపంచ ఆహార ధాన్యాల సరఫరాలో ఏర్పడిన భారీ కొరతను పూరించడానికి మన రైతులు సిద్ధపడుతుండటం చూసి పొంగిపోతున్నారు. 

ముందే చెప్పినట్లుగా ఏ రకంగా చూసినా ప్రపంచం ఇప్పుడు మరో ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆహార ధరలు ఇప్పటికే అధికంగా ఉంటున్నాయి. ఇవి గత 40 సంవత్సరాల్లో ఎప్పూడూ లేనంత అధిక స్థాయిని తాకాయి. ఆహార పంటలు ఉపయోగించుకునే బయో ఇంధన ఉత్పత్తి పెరిగిపోయింది. ఉదాహ రణకు అమెరికాలో పండుతున్న మొక్క జొన్న పంటలో మూడోభాగం ఎథనాల్‌ ఉత్పత్తి కోసం వాడుతున్నారు. యూరోపియన్‌ యూని యన్‌లో పండే 90 మిలియన్‌ టన్నుల ఆహార పంటల్లో, 12 మిలియన్‌ టన్నుల గోదుమ, వరిని ఎథనాల్‌గా మార్చివేశారు.

వీటన్నింటి మధ్యలోనే కొన్ని ఖండాంతర స్థాయి కంపెనీలను రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించేందుకు అమెరికా అనుమతించింది. కార్గిల్, నెస్లె, అర్చర్‌ డెనియల్స్‌ మిడ్‌ లాండ్, పెíప్సీకో, బేయర్‌ వంటి బడా వ్యవసాయ ఆధారిత కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, కీలకమైన సప్లయ్‌ లింకును మాత్రం ఇవి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆహార భద్రత సమస్యను కొన్ని బడా కంపెనీల చేతుల్లో ఎందుకు పెడుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడే 2007–08 సంవత్సరం నాటి ప్రపంచ ఆహార పెను సంక్షోభాన్ని పునరావృతం కానివ్వకూడదన్న ప్రిస్క్రిప్షన్‌ తప్పుదోవ పట్టిందని స్పష్టమవుతోంది. ఆహార సరఫరా మార్గాల కోసం ప్రపంచం ఇప్పుడు పడుతున్న పాట్లకు కారణం ఏమిటంటే, ఆహార స్వావలంబన నుంచి దూరం జరగాలని చాలా దేశాలపై ఒత్తిడి పెట్టడమే! పోటీకి వీలుకల్పించడం అనే సాకుతో ప్రపంచ ఆహార సరఫరా చెయిన్లను నిర్మిస్తూ పోవడమే ప్రస్తుత సంక్షోభానికి మూలం. 

ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మార్కెట్లపై ఆధారపడటం తగ్గించి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడమే! ఈ సందర్భంగా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ చెప్పిన మాటలు మనం ఎన్నటికీ మరచిపోరాదు. ‘‘తుపాకులు కాకుండా ఆహార ధాన్యాలను కలిగిన దేశాలదే భవిష్యత్తు!’’


దేవీందర్‌ శర్మ , వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు

ఈ–మెయిల్‌: hunger55@gmail.com

>
మరిన్ని వార్తలు