రిషి సునాక్‌ను బ్రిటన్‌ ప్రధానిగా చేయడం వెనుక..

9 Nov, 2022 10:48 IST|Sakshi

స్పందన

‘మనము నేర్చు కోవాల్సిన పాఠం’ అంటూ అక్టోబర్‌ 31వ తేదీన కరణ్‌ థాపర్‌ వ్యాసంలోని అంశాలు అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా ఉన్నాయి. బ్రిటన్‌ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్‌ ఎన్నిక కావడానికీ, బ్రిటన్‌ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రిషి సునాక్‌ను ఎన్ను కోవడానికి ముందు లిజ్‌ ట్రస్‌ అనే మహిళను కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నుకున్నది కదా. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టె క్కించడానికి బ్రిటన్‌ దేశానికి, ముఖ్యంగా కన్జర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వానికి రిషి సునాక్‌ లాంటి ఆర్థిక వ్యవహారాల నిపుణుడి అవసరం వచ్చింది. కన్జర్వేటివ్‌ పార్టీ రిషి సునాక్‌ను ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఎన్నికలలో గెలిచి ఉంటే – అప్పుడు భారతీయులు బ్రిటన్‌ ప్రజల నుంచి ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉండేది.

190 సంవత్సరాలు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది బ్రిటన్‌. ఇప్పటికీ 14 దేశాలపై తన రాజరికపు ముద్రను కొనసాగిస్తూనే ఉన్నది. తమను దోచుకున్న దేశాన్ని బ్రిటిషర్స్‌ శత్రువులుగా భావిస్తారు. వ్యాసకర్త చెప్పిన దానికి విరుద్ధంగా ఆ దేశం నుండి చాలా విషయాలను స్వయం ప్రకటిత మేధావులైన కొందరు భారతీయులు నేర్చుకోవాలి.

ఇక రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భాన్ని నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి చెందినదనీ, ఆ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడానికీ వ్యాసకర్త సంఖ్యాపరమైన విశ్లేషణలు చక్కగా చేశారు. ఈ దేశంలో సంఖ్యాపరంగా ముస్లింలు 14.3 శాతం ఉన్నది నిజమే. పార్లమెంట్లో వారి స్థానాలు కూడా తక్కువనేది వాస్తవమే. సివిల్‌ సర్వెంట్లుగా, సైనికులుగా ఆ మతం వారి సంఖ్య దేశంలోని ఇతర మతాల వారితో పోలిస్తే తక్కువే. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదే! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లిం వర్గం నుండి నలుగురు రాష్ట్రపతులుగా ఎన్నిక చేయబడ్డారు. మరి ముస్లింలు మెజా రిటీగా ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనార్టీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల పరిస్థితి ఏమిటి?

20 కోట్ల మంది ముస్లింల నుండి ఒక ప్రధాని ఆశించడానికి వీలు లేదా? అని ఒక మంచి ప్రశ్న వేశారు వ్యాసకర్త. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు ఈ దేశంపై సర్వాధికారాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో 28 శాతం హిందువులు ఉంటారు. ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క హిందువూ సీఎం కాలేదనే విషయం వ్యాసకర్తకు తెలియదా? 

ముస్లింలను చెద పురుగులుగా, బాబర్‌ వారసులుగా అవహేళన చేస్తూ, మానసికంగా వేధిస్తున్నారనే విషయం వాస్తవమేనా? కశ్మీర్‌ లోయనుండి 3 లక్షల మంది హిందువులను  తరిమికొట్టింది ఎవరు? ఇక చివరిగా రిషి సునాక్‌ను బ్రిటన్‌ ప్రధానిగా చేయడం వెనుక ఆ దేశ అవసరం ఉంది. ఈ విషయంలో ఆయన భారతీయ మూలాల శ్రేష్ఠత గానీ, రంగు గానీ, జాతి గానీ కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలకు కనబడ లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం రిషీ సునాక్‌ ఎంపిక చూసి గర్వపడాల్సింది ఏమీలేదు. బ్రిటిష్‌వారి ఔదా ర్యమూ అంతకన్నా ఏమీలేదు.


- ఉల్లి బాలరంగయ్య
రాజకీయ, సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు