పాలనలో, పార్టీలో మానవీయ ముద్ర

12 Mar, 2021 11:15 IST|Sakshi

విశ్లేషణ

11వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ ప్రస్థానం

సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్‌ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్‌ జగన్‌కి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి. ఈ 21 నెలల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన వైఎస్‌ జగన్‌ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తదుపరి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత దశాబ్దకాలం ఓ మహత్తర చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది. సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్‌ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ఆ రోజున పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా యువజనులు, శ్రామికులు, రైతులు, మహిళల ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి నుంచి పుణికిపుచ్చుకొన్న విశిష్ట లక్షణాలు, రాజీపడని వ్యక్తిత్వమే ప్రాంతీయ పార్టీగా ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ ఏర్పాటు చేయడానికి ఆయనను పురిగొల్పింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్‌ జగన్‌కి చరిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి.

ఆదర్శ నాయకుని కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు
రెండు పర్యాయాలు 2004లో, 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహా నాయకుడి కుమారుడి పట్ల అత్యంత అమానుషంగా ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కుట్ర చేసిన ఫలితంగానే జాతీయ పార్టీ  కాంగ్రెస్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌లో మట్టికొట్టుకు పోయింది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో వెళుతూ నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సెప్టెంబర్‌ 2, 2009న పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై విషాదకర పరిస్థితులలో మరణిం చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహా నేత డాక్టర్‌ వైఎస్సార్‌ మరణాన్ని ఆయన సహచరులు, అభిమానులు, కార్యకర్తలు, పేదలు, సామాన్యులు.. ఇలా ప్రతి వర్గం తట్టుకోలేకపోయింది. ‘కాంగ్రెస్‌ పార్టీ ఇక బ్రతకదు.. దానికి నూకలు చెల్లాయి’ అని అందరూ అంటున్న సమయంలో ఆ పార్టీకి ప్రాణం పోసింది డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజలలో నమ్మకం కల్పించి కాంగ్రెస్‌ పార్టీకి 2004 మే ఎన్నికలలో అఖండ విజయం సాధించి పెట్టారు. తను అమలు చేసిన వినూత్న సంక్షేమ, అభివృద్ధి పనులతో ప్రజల హృదయాలను గెలుచుకొని తిరిగి 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. అంతేకాదు.. 2004లో 27 మంది లోక్‌సభ సభ్యులను, 2009లో 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ-1, యుపీఏ-2 ప్రభుత్వాలు ఏర్పడటానికి దోహదం చేశారు. అంతటి గొప్ప ప్రజా నాయకుడు చనిపోయిన తరువాత సొంత పార్టీలోకి కొన్ని శక్తులు, ప్రత్యర్థి పార్టీలోని నాయకులు, మీడియాలోని ఓ వర్గం కుమ్మక్కై వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం సాగించారు.

ఓదార్పు నిర్ణయం ఆటంకాలు
2009లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాక.. ఆమె అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం.. డాక్టర్‌ వైఎస్సార్‌ అభిమానుల్ని కదిలించింది. ముఖ్యంగా వైఎస్సార్‌ మరణవార్త విని తట్టుకోలేక గుండె ఆగి కొందరు, ఆత్మహత్యలు చేసుకొన్న మరికొందరు తమ కుటుంబాలను అనాథలుగా మిగిల్చి వెళ్లారని, అటువంటి వారందర్నీ ఆదుకోవడం తమ ధర్మమని విజయమ్మ చెప్పడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట నిచ్చింది. మృతుల కుటుం బాలను పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ ఏప్రిల్‌ 9, 2010న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. అయితే, జగన్‌కు ప్రజల్లో లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని కొన్ని వర్గాలు.. పార్టీ విభేదాలు పక్కన పెట్టి చేతులు కలిపాయి. డాక్టర్‌ వైఎస్సార్‌ కుటుం బంపై కుట్రలు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఓదార్పు యాత్రకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. మలివిడత యాత్రను కూడా చేయొద్దని చెప్పడంతో.. ఇక కాంగ్రెస్‌ పార్టీ కుట్రలకు తల వంచకుండా బయటపడుతూ నవంబర్‌ 29, 2010న విజయమ్మ, వైఎస్‌ జగన్‌ ఇరువురూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీ అక్రమ కేసులు వేయించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయించింది. 2014 ఎన్నికలS సమయంలో నరేంద్ర మోదీ గాలి దేశవ్యాప్తంగా వీస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీలు అవకాశవాద పొత్తు పెట్టుకోవడమేకాక.. ‘జనసేన’ అంటూ బయలుదేరిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఇంటికి బాబు వెళ్లి తనకు సహకరించమని ఒప్పందం చేసుకోవడతో ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో 63 సీట్లు పొంది ప్రతిపక్షంలో కూర్చుంది.

2014, మే 17న ఎన్నికల ఫలితాలు వెలువడిన స్వల్ప వ్యవధిలోనే ఆనాడు వైఎస్‌ జగన్‌ ప్రజల ముందుకొచ్చి ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఓటమికి బాధ్యులుగా ఎవ్వరినీ వేలెత్తి చూపలేదు. సహచర ఎమ్మెల్యేలలో, నాయకులలో, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే, 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్‌ జగన్‌పై కత్తి గట్టినట్లు ప్రవర్తించింది. ఫిరాయింపుల్ని ప్రోత్సహించి 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. అసెంబ్లీలో సైతం వైఎస్సార్‌సీపీ నేతలను మాట్లాడనివ్వకపోవడం, దూషించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడింది. నవంబర్‌ 6, 2017న వైఎస్‌ జగన్‌ మొదలు పెట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇడుపులపాయ నుండి మొదలై 13 జిల్లాల్లో 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియడం దేశ రాజకీయాలలోనే ఓ సంచలనం. పాదయాత్ర పొడవునా జగన్‌.. సమాజంలోని రైతాంగాన్ని, చేతివృత్తుల వారిని, యువతను, మహిళలను.. ఇలా ప్రతి ఒక్కరినీ కలుసుకొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలను అర్థం చేసుకొన్నారు.

నవరత్నాలతో మెరుగైన జీవన ప్రమాణాలు 
అధికారంలోకి రాగానే.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ‘నవరత్నాలు’ అమలు చేస్తామంటూ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిం చింది. ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరు తెచ్చుకొన్న వైఎస్‌ జగన్‌.. ఎన్నికల మేనిఫెస్టోను ‘పవిత్ర భగవద్గీతగా, పవిత్ర బైబిల్‌గా, పవిత్ర ఖురాన్‌’ గా భావించి అమలు చేస్తామని ఇచ్చిన హామీ, పార్టీ అభ్యర్థుల ఎంపికలో చేసిన సామాజిక న్యాయం మొదలైన అంశాల కారణంగానే.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 50% ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగారు. 22 లోక్‌సభ సీట్లలో విజయకేతనం ఎగరవేశారు.

చెక్కు చెదరని ప్రజాభిమానం
అధికారం చేపట్టిన ఈ 21 నెలల్లో సీఎంగా వైఎస్‌ జగన్‌.. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. అనేక వినూత్న సంక్షేమ పథకాలను పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేయడం వల్లనే ఆయా వర్గాల ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతూనే.. పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ సంస్థాగత వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం.


వ్యాసకర్త డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ప్రభుత్వ చీఫ్‌ విప్, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌

మరిన్ని వార్తలు