దొంగ దీక్షలు... కొంగ జపాలు మెప్పిస్తాయా?

15 Jul, 2021 14:03 IST|Sakshi

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పక్షాల పనితీరును ఎల్ల వేళలా నిశితంగా గమని స్తూనే ఉంటారు. పార్టీల గెలుపు, ఓటములు దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం 2019 ఎన్నికలలో తమ రాజకీయ పరిపక్వతను చాటుకొన్న ఫలితంగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్‌ సీట్లు లభించగా, టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్‌ సీట్లకు మాత్రమే పరిమితమైంది. 

ఓటమి చవిచూశాక సహజంగానే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొంటారు. కానీ అధి కారంలో ఉండగా పొరపాట్లు చేశానన్న పశ్చాత్తాపం చంద్రబాబులో ఏ కోశానా కనబడటంలేదు. ప్రభుత్వానికి ప్రతి దశలో ఇబ్బందులు కలుగ జేయకుండా కొంతకాలం వేచిచూద్దామన్న ప్రజా స్వామిక లక్షణమూ లేదు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ, మీడియాలో హడావుడి చేయడానికి కృత్రిమమైన కార్యక్రమాలు చేపడితే జనంలో నవ్వుల పాలవుతారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసిన ‘3 గంటల దీక్ష’ (ఉదయం అల్పాహార సమయం నుండి మధ్యాహ్నం భోజనం చేసేవరకు) అభాసు పాలయింది. ఓ రాజకీయ పార్టీ కేవలం 3 గంటల పాటు దీక్ష చేయడం గతంలో ఎన్నడూ లేదు.

తెలుగుదేశం చేపట్టిన దీక్షలో వారు చేసిన తీర్మా నాలు చూస్తే 1) రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాగా కోవిడ్‌ బాధితులకు రూ. 10,000 చొప్పున ఇవ్వాలి. 2) కోవిడ్‌తో మరణించిన పేషెంట్ల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి. 3) ఆక్సిజన్‌ అందక మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. బాధితులకు పరిహారంగా ఎంత మొత్తం ఇచ్చినా తప్పులేదు. కానీ, తను అధికారంలో ఉన్నప్పుడు సమంజసమైన నష్టపరిహారం ఇవ్వడానికి ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు భారీ ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ చేయడానికి ఏమి నైతిక హక్కు ఉంది? 

ఆశ్చర్యం ఏమిటంటే, జాతీయ పార్టీకి అధ్యక్షుడినని చెప్పుకొనే చంద్రబాబు కోవిడ్‌ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయలేదు. ప్రతి దేశం కోవిడ్‌ను జాతీయ విపత్తుగానే పరిగణించాయి. దేశంలో విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని సాయం అందించడం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత. తన బాధ్యతను విస్మరించిన కేంద్రాన్ని తప్పుపడుతూ న్యాయం చేయాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది. అయితే, కేంద్రం ‘కోవిడ్‌ మరణాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి మా వద్ద నిధులు లేవు’ అంటూ ఓ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసి చేతులు దులుపుకుంది.

కేంద్రం మాదిరిగా ప్రత్యేకంగా విరాళాలు సేకరించే వెసులుబాటు రాష్ట్రాలకు లేదు. ‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు అందే అరకొర నిధులతోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరిపెట్టుకొంటున్నాయి. ఒకవైపు అని వార్యంగా లాక్‌డౌన్లు విధించడం వల్ల రాబడి పడిపోయింది. అయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని నిలుపుదల చేయకుండానే, వైద్య ఆరోగ్య రంగానికి అదనపు నిధులు సమకూర్చి ప్రజల్లో భరోసా నింపుతూ వస్తోంది. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన కేంద్రం ఆ బాధ్యత నుండి తప్పుకున్నప్పటికీ, ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. సంక్షేమంలో చంద్రబాబునాయుడా పాఠాలు చెప్పేది?

అప్పుల ఊబిలో కూరుకొని గత్యంతరంలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే దానికోసం రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటారు’ అని రైతాంగాన్ని కించ పర్చేవిధంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన అమాన వీయ చరిత్ర చంద్రబాబుకు గుర్తులేదా?  

1996లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు చేపట్టిన చర్యలేమిటి?  సబ్సిడీ బియ్యం ధరను ఎన్టీఆర్‌ నిర్ణయించిన రూ. 2 నుంచి రూ. 5.50కు పెంచారు. తెల్లరేషన్‌ కార్డులను ఏరివేశారు. విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. సబ్సిడీలలో కోత పెట్టారు. సంపన్నులను శిక్షించి సామాన్యులను ఆదుకోవడం ప్రభుత్వాల ధర్మం అని చాణక్యుడు చెప్పాడు. క్రాస్‌ సబ్సిడైజేషన్‌కు మూలం ఈ సూత్రం. కానీ, అభినవ చాణక్యుడిగా చెప్పదగ్గ చంద్రబాబు అందుకు భిన్నంగా పేదలను శిక్షించి సంపన్న వర్గాలకు మేలు చేశారు. పారిశ్రామికీ కరణ పేరుతో, ఐటీ పేరుతో ప్రభుత్వ భూములను అస్మదీయులకు అప్పనంగా అందించారు.

2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానన్న రైతుల రుణమాఫీని ఎన్ని విధాలుగా కుదించారో ప్రత్యే కంగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయన నిఘంటువులో సంక్షేమం అనే పదానికి భిన్నమైన అర్థం కనపడుతుంది. సంక్షేమ హాస్టళ్లను మెరుగు పర్చడానికి రూ. 100 కోట్లు కోరితే, దానిని పక్కన బెట్టి 400 కోట్లతో ఆఫ్రో ఆసియన్‌ క్రీడలను నిర్వహించడం ద్వారా తనకు ప్రచారం తప్ప ప్రజల కష్టాలు పట్టవని చంద్రబాబు చాటుకున్నారు. అధికారంలో ఉండగా చేయగలిగిన పనులను కూడా చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చాక దొంగ దీక్షలు, కొంగ జపాలు చేయడం చంద్ర బాబుకే చెల్లింది. 


- డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 

వ్యాసకర్త కేంద్ర మాజీమంత్రి

మరిన్ని వార్తలు