ఏడాదికి కోటి ఉద్యోగాలేవీ?

13 May, 2022 12:18 IST|Sakshi

ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కారు 8 ఏళ్ల కాలంలో 8 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చామనీ, మరో 60 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామనీ చేసిన ప్రకటన యువతకు ఆశ్చర్యం కలిగించింది. మోదీ గద్దెనెక్కిన తర్వాత 8.1 శాతం నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. దేశంలో 18 నుంచి 25 ఏండ్ల వయసున్న యువత 50 శాతం ఉన్నారు. కోవిడ్‌కు ముందు 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... కోవిడ్‌ తర్వాత ఆ సంఖ్య 45 కోట్లకు చేరింది. 

కొత్తగా ఉద్యోగాలను సృష్టించి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇచ్చే మాట అటుంచి... ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలూ, శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకన్నా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వాలి కదా.  245 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 19.15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 72 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ (2.27 లక్షలు), పోస్టల్‌ (90 వేలు), హోం (1.28 వేలు), రెవెన్యూ (76,327), సైన్సు– టెక్నాలజీ (8,227) గనులు (6,925), జలవనురులు (4,557), కుటుంబ– ఆరోగ్యం (21,003) వంటి ఎన్నో శాఖల్లో ఖాళీలు నింపవలసి ఉంది. అలాగే 1,672 ఐఏఎస్‌ పోస్టులు, 1,452 ఐపీఎస్‌ పోస్టులు, మరో 3 వేల వరకు ఇతర సివిల్‌ సర్వీసెస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాయుధ బలగాల్లో 1,22,555, గ్రామీణ డాక్‌లలో 73,452, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 10,368, ఐఐటీల్లో 3,876 ఖాళీలు నింపవలసి ఉంది. (చదవండి: ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?)

నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న ప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు యువతకు ఉద్యోగాల పేరుతో గాలమేసి ఓట్లు పొంది అధికార పీఠాన్ని ఎక్కుతున్నాయి. ఆ తర్వాత వారిని పూర్తిగా విస్మరించడం శోచనీయం! (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?)

– గుర్రం రాంమోహన్‌ రెడ్డి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు