Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం

13 Dec, 2022 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం.

ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్‌ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్‌ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 21,077, ఉత్తర ప్రదేశ్‌లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. 

టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. 

హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్‌ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!)

– మోటె చిరంజీవి, వరంగల్‌

మరిన్ని వార్తలు