ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?

9 Sep, 2022 00:36 IST|Sakshi

పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్‌ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్‌ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్‌ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది.

సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్‌’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు.

అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్‌ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది.

భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్‌ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్‌ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు.

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్‌ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు.

కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్‌ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్‌ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం.

మోర్గాన్‌ స్టాన్లీకి చెందిన రుచిర్‌ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్‌ మార్కెట్‌ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్‌ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది.

సెప్టెంబర్‌ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్‌ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్‌ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్‌ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్‌ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు.

మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్‌ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్‌ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి.

- దేవీందర్‌ శర్మ 
ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

>
మరిన్ని వార్తలు