చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం

9 May, 2022 12:59 IST|Sakshi

కొంతమంది మామూలు మనుషులు దేశికోత్తముల శిష్యరికం, నిరంతర అధ్యయనం, విసుగూ వేసటా లేని రచనా వ్యాసంగం, మహా విద్వాంసుల సాంగత్యాల వల్ల సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థాయికి ఎదుగుతారు. తాము చరిత్రను నడిపించామని గొప్పలు పోక, చరిత్ర తమను నడిపించిందని తలొంచుకొని వినమ్రత ప్రదర్శిస్తారు. అలాంటి వినయమోహనులైన వకుళాభరణం రామకృష్ణ ఆత్మకథ – ‘నన్ను నడిపించిన చరిత్ర’.
 
వకుళాభరణం ‘జ్ఞాపకాలు ఎందుకు రాశాను?’ అని తనకు తానే ప్రశ్నించుకొని ఇలా సమాధానం ఇస్తారు – ‘‘గత జీవితపు నెమరువేత! నాతో నేను మాట్లాడుకొనే స్వీయ సంభాషణ నా తృప్తికోసం, మహా అయితే మా కుటుంబం, మిత్రుల కోసం, శ్రేయోభి లాషుల కోసం, భావి తరాల కోసం.’’ 84 ఏళ్ల వకుళా భరణం రామకృష్ణ సుమారు ఎనభై సంవత్సరాల గత స్మృతుల్ని తలపోసుకొన్నారు. వకుళాభరణం రామకృష్ణ నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా ‘పాకలపల్లె’ వీధిబడి నుంచి కావలిలోని ‘విశ్వోదయ’ (జవహర్‌ భారతి) కళాశాల దాకా సాగిన చదువు సాముల గురించి ఎన్నో తీపి, చేదు అనుభవాల్ని జ్ఞాపకాల దొంతర్లలో పేర్చారు. పల్లెపట్టుల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, అన్ని జాతుల వాళ్ల మధ్య అరమరికలు లేకుండా జీవించి, మురిసిపోయిన వకుళా భరణం సింహావలోకనం చేసుకుంటూ– ‘‘...మన సమాజం ఎంత దూరం వచ్చింది, చదువు, సంస్కారం, విజ్ఞానం ఒకవైపు పెరిగినా; మత దురహంకారం, అసహనం ఎలా పెరిగి పొయ్యాయి? మన సంకీర్ణ సంస్కృతి ఏమౌతున్నది?’’ అని తలపట్టుకొని వేదన పడ్డారు. 

రామకృష్ణ నెల్లూరు వీఆర్‌ కాలేజి (1953–55)లో ఇంటర్మీడియట్, కావలి విశ్వోదయ కాలేజి (1955– 57)లో బీఏ చదివారు. సింగరాయ కొండ ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లోనే రెబల్‌ టీచరు నల్లగట్ల బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత మరో అధ్యాపకుడైన సింగరాజు రామకృష్ణయ్యల న్యాయ పక్షపాత దృష్టి, సామ్యవాద సిద్ధాంతాల ప్రభావం ఈయనపై పడింది. కేవీఆర్‌ శిష్యరికంతో ఈ ప్రభావం మరింత గాఢమైంది.

వకుళాభరణం ‘గుంపులో మనిషిని కాని’ నేను (పేజి: 96) అని అన్నా... యునైటెడ్‌ స్టేట్స్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఇన్‌ ఇండియా (యూఎస్‌ఈఎఫ్‌ఐ) ద్వారా ఎన్నికై 1967లో అమెరికా వెళ్లి, అక్కడ బ్లూమింగ్‌టన్‌ లోని ‘ఎర్ల్‌ హామ్‌ కాలేజి’లో విద్యార్థి సేవల గురించి అధ్యయనం చేశారు. రెండు నెలలపాటు అక్కడి పది విశ్వవిద్యాలయాల్ని దర్శించి నేర్చుకొన్న పాఠాల్నీ, అనుభవాల్నీ ‘జవహర్‌ భారతి’ కళాశాలలో ఆచరణలోకి తెచ్చారు. ‘‘అమెరికా పర్యటన వల్ల నా జ్ఞాన నేత్రం మరింత విప్పారింది. నా చుట్టూ వున్న పరిసరాలను, మనుష్యులను సమ్యక్‌ రీతిలో అర్థం చేసుకోగల సామర్థ్యం పెరిగింది’’ (పేజి: 100) అని రాసుకున్నారు. అంతేకాదు, ఈ విదేశీ పర్య టన ‘గుంపులో మనిషి కాని’ వకుళాభరణాన్ని గుంపులో మనిషిగా తీర్చిదిద్దింది. (క్లిక్: కూడు పెట్టే భాష కావాలి!)

‘జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం’లో వకుళా భరణం పరిశోధకులుగా గడిపిన సుమారు నాలుగు సంవత్సరాల అవధి, ఉపన్యాసకులుగా పనిచేసిన ఏడాది కాలం ఆయన్ను రాటుదేలిన పరిశోధకులుగా, ఉత్తమ ఆచార్యులుగా రూపొందించాయి. ఆచార్యవర్యులైన సర్వేపల్లి గోపాల్, బిపిన్‌చంద్ర, రొమిలా థాపర్ల సాన్నిధ్య, సాన్నిహిత్యాలు ఆయన జ్ఞానతృష్ణ, పరిశోధనా పటిమలకు మెరుగులు దిద్దాయి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎంతోమంది చరిత్ర ఆచార్యుల, విద్వాంసుల సహాయ సహకారాలతో ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర – సంస్కృతి’ 9 ఆంగ్ల సంపుటాల్నీ, 8 తెలుగు సంపుటాల్నీ 2003 నుంచి 2017 అవధిలో ప్రచురింపచేశారు. ఆచార్య రామకృష్ణ తమ ఆత్మకథ చివర్లో ‘కథ ముగిసింది’ (పేజి: 210) అని నిర్వేదం ప్రకటించారు. కథ ఇంకా ముగియ లేదు. ఆయన చేయవలసింది చాలా ఉంది! (క్లిక్: నవ్యచిత్ర వైతాళికుడు)

– ఘట్టమరాజు
 సుప్రసిద్ధ విమర్శకులు

మరిన్ని వార్తలు