Osmania University: ఉస్మానియా అలాయ్‌ బలాయ్‌!

3 Jan, 2023 12:36 IST|Sakshi

వందేళ్ళకు పైగా ఘన చరిత్ర, కీర్తి గల ఉస్మానియా యూనివర్సిటీ మరొక అద్భుతమైన ఘట్టానికి తెరలేపుతోంది. గ్లోబల్‌ అలుమ్నయి మీట్‌ (జీఏఎమ్‌–23)ను జనవరి మూడు, నాలుగు తేదీలలో నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంనాటి వందేమాతరం ఉద్యమం నుండి తొలి, మలి తెలంగాణ ఉద్యమాల వరకూ ఎన్నో ప్రజా యుద్ధాలకూ, తెలంగాణ ప్రజల అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ చిహ్నంగా నిలిచింది ఉస్మానియా.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల 57వ రూమ్‌ ఎన్నో సామాజిక, రాజకీయ, అస్తిత్వ ఉద్యమాలకూ, మేధో చర్చలకూ వేదిక అయింది. హైదరాబాద్‌కు మణిహారం లాంటి ఆర్ట్స్‌ కళాశాల నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు, పాత్రికేయులు, రాజ కీయ నాయకులు, కళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తయారయ్యారు. మిగతా కళాశాలల నుంచి గొప్ప ఇంజినీరింగ్, శాస్త్త్ర సాంకేతిక నిపుణులూ, సైంటి స్టులూ తలెత్తారు. ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన పీవీ నర్సింహారావు, పార్లమెంట్‌లో గొప్ప వక్తగా, విమర్శకునిగా పేరున్న ఎస్‌. జైపాల్‌ రెడ్డి, లోక్‌ సభ మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్, వామపక్ష ఉద్యమాలకు ఊపిరులూదిన జార్జిరెడ్డి; గొప్ప కవి, రచయిత, టీచర్‌గా పేరున్న సి. నారాయణ రెడ్డి, సినీ దిగ్గజం శ్యాంబెనెగల్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి... ఇలా చెప్పుకుంటూపోతే ఉస్మానియా ఉత్పత్తి చేసిన మహామహుల పేర్లకు అంతుండదు. నిజానికి ఉస్మానియా చరిత్ర రాస్తే ఒక ఉద్గ్రంథమే అవుతుంది.

కడుపు చేత పట్టుకొని వచ్చిన వేలాది మంది విద్యార్థులను అమ్మలాగా ఆదరించి అక్కున చేర్చుకొని వారికి సుందరమైన భవిష్యత్తును తీర్చిదిద్ది దేశ సేవ కోసం బయటికి పంపింది ఉస్మానియా. (క్లిక్ చేయండి: నూతన సంవత్సర తీర్మానాలు)

‘ఎన్‌సీసీ’ నుండి యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి అనుభవిస్తే గాని మనసు కుదుటపడదు. పచ్చని చెట్లు, పిట్టల కిలకిలా రావాలతో జీవ వైవిధ్యం ఉట్టిపడే క్యాంపస్‌లో అడుగుపెడితే ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు! యూనివర్సిటీ లైబ్రరీలో రేయింబవళ్లూ కూర్చొని చదువుకోవడం, ఇంజనీరింగ్‌ కాలేజీ క్యాంటీన్‌ కబుర్లూ; అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగే దృశ్యాలూ, ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర జరుపుకొన్న వేడుకలూ, యూనివర్సిటీలోని చాయ్‌ కొట్టుల దగ్గర జరిపిన సుదీర్ఘమైన సామాజిక, రాజకీయ చర్చలూ, సరదా సంభాషణలూ... ఎన్ని జ్ఞాపకాలు! 

మన యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని మరోసారి పలకరించుకుందాం రండి. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఒకసారి అందరం ఒక దగ్గర కూడి ఆనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుని తరించే అవకాశం యూనివర్సిటీ కల్పిస్తోంది. ఇలాంటి అవకాశాలు, సందర్భాలు రావడం బహు అరుదు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన మన పాత విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతు సాయం అందించడానికి తగిన సందర్భమూ ఇదే!

– వలిగొండ నరసింహ, రీసెర్చ్‌ స్కాలర్, ఓయూ
(జనవరి 3, 4 తేదీలలో ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం)

మరిన్ని వార్తలు