Dharmana Prasada Rao: ఇన్నాళ్లకొకడి ‘ధర్మాన’

13 Jan, 2023 14:15 IST|Sakshi

ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్‌ మీడియాలో గోల చేస్తున్నారు.


నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్‌.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. 

చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్‌. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది.

తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్‌ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్‌ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు.

పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ,  విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు.

సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’)

– వంశధార సూరి, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు