...అయినప్పటికీ చెరగని ముద్ర

31 Oct, 2022 08:53 IST|Sakshi

సందర్భం

సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యా యానికి తెర లేచిన చీకటి రోజులు నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి.  1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ  సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. 

రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్‌సభ ఎన్నిక చెల్లదనీ, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌ లాల్‌ సిన్హా 1975 జూన్‌ 12న  చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్ష ణమే రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు ముక్త కంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్‌ పాలనా యంత్రాంగాన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బం ధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత – సమైక్య తలకు తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, 1975 జూన్‌ 25, అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ ప్రభుత్వం.  దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాలరాసింది. అంత ర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. 

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాశ్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్‌ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాదిమందిని జైల్లో పెట్టించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు అంటూ... జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. ‘మీసా’ వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.

ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్‌ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌ గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చి వేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికి వాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్‌.

హఠాత్తుగా, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగ తాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాశ్‌ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’ అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకూ చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిర అనుంగు సహచరుడు జగ్జీవన్‌ రామ్‌ కూడా ప్రతి పక్షాల సరసన చేరాడు. 

లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీకి వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‌లోని ‘యంగ్‌ టర్క్స్‌’ కూడా వారితో జత కట్టారు. 1977 మార్చ్‌ 20న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనూ, ఆమె సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీని దేశం లోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు.  మొరార్జీ దేశాయ్‌ ప్రధాని అయ్యారు. 

అవిశ్వాస తీర్మానం కారణంగా మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్‌ సింగ్‌ ప్రధానిగా పదవిని చేపట్టడం, రాజీనామా చేయడం; దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిన విషయమే. ఆ లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానాలకుగాను 351 స్థానాలు గెలుచుకుని తన సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. 

‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ పేరుతో అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌– హర్మందిర్‌ సాహిబ్‌పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్‌ సింగ్, బియాంత్‌ సింగ్‌లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధీ హత్యకు గురై 38 సంవత్సరాలు నిండాయి.  సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న దనడంలో మాత్రం సందేహం లేదు. 


వనం జ్వాలా నరసింహారావు 
వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ మొబైల్‌: 80081 37012
(నేడు ఇందిరాగాంధీ 38వ వర్ధంతి)

మరిన్ని వార్తలు