వంగపండుకు సుస్థిర స్థానం

3 Aug, 2021 20:46 IST|Sakshi

మార్పు కోసం తూర్పు కొండల్లో ఉదయించిన ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావుకు ఏపీ ప్రభుత్వం విశేష గుర్తింపునిచ్చింది. ఆయన పేరుమీద జానపద పురస్కారం ఏర్పాటు చేయటమేకాక, నిరుపేద జీవితం గడిపిన ఆయన కుటుంబానికి  పదిలక్షల పారితోషకం అందిస్తూ సాంస్కృతిక శాఖ జీఓను విడుదల చేసింది. వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న ప్రతి ఏటా పురస్కారం ఇచ్చేందుకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గద్దర్‌ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేసిన వంగపండు,ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా పలు ప్రదర్శనలు ఇచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, యంత్రమెట్ట నడుస్తున్నదంటే వంటివి విశేష ఆదరణ పొందాయి. 300కి పైగా జాపపదాలు రచించారు. బాణీకట్టి, తానే స్వయంగా కాలికి గజ్జెకట్టి ఆడి, పాడే ఆయన తెలియనివారు ఎవరూ ఉండరు.

పార్వతీపురం దగ్గర్లోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఎంత సంచలనం కలిగించింది. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమ కళాకారులలో ఆయన అగ్రగణ్యులు. ప్రజాకళాకారుడు. మూడు వందల పాటల సృజనతో, ఎడతెగని ప్రదర్శనలతో, ఏళ్ల తరబడి ఆడిన నాటకాలతో వంగపండు తన సాహిత్య, కళా, ప్రజాజీవితాన్ని సుసంపన్నంగా గడిపారు. నిజమైన అర్థంలో కార్మిక కవి. ‘జజ్జనకరి జనారే... ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..’, యంత్రమెట్టా నడుత్తు ఉందంటే’, ఓడా నువ్వెళ్లిపోకే’, ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్‌’... ‘ఉందర్రా మాలపేట’ వంటి పాటలు ప్రజాబాహుళ్యంలో ఉర్రూ తలూగిం చాయి. 

వంగపండు దళితసంవేదనను పలికించారు. కుల నిర్మూలన భావజాలంతో గజ్జెకట్టి ఆడిపాడారు. భూమిభాగోతం – వంగపండు రాసిన నృత్యరూపకం. ఈ రూపకాన్ని తెలుగునేలపై ఎన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారో తెలియదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి, అదే సమయంలో సాహిత్య కళా రంగాలలో గొప్ప వారసత్వమున్న ప్రాంతానికి, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వంగపండు చరిత్రలో చిరస్థానాన్ని సాధించుకున్నారు. అటువంటి మహా కళాకారుడికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అత్యున్నత గుర్తింపు ఇవ్వడమేకాక, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం. 

– నేలపూడి స్టాలిన్‌ బాబు
(04–08–2021న వంగపండు ప్రథమ వర్థంతి సందర్భంగా) 
 

మరిన్ని వార్తలు