మెరుగుపడింది జీతాలే... జీవితాలు కాదా!?

9 Aug, 2021 00:17 IST|Sakshi

సందర్భం

పోలీసు శాఖనుండి మొదలుకొని గిడ్డంగుల్లో, జెన్కో, ఫైర్, ఆర్టీవో, ట్రాఫిక్, జైళ్ళు ఇలా ప్రతీశాఖలో విస్తరించి పనిచేస్తున్న ఏకైక సంస్థ హోంగార్డ్స్‌. 1946 డిసెంబర్‌ ఆరున బొంబాయి ప్రావెన్స్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ శాఖల్లో అదనపు సహయార్థం స్వచ్చంద సంస్థగా దీన్ని స్థాపించారు. తర్వాత 1962లో భారత్‌–చైనా యుద్ధ సమయంలో వీరిని పునర్వ్యవస్థీకరించారు. ఈ పరంపరలోనే వీరి సేవలు గమనించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాలం టరీ ప్రక్రియ కింద నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ జీవితాలు మరింత చీకట్లోకి నెట్టివేయబడ్డాయనే చెప్పుకొని తీరాలి.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ హోంగార్డుల జీతం రూ. 600 నుండి 710 రూపాయలకు పెంచగా తెలంగాణలో నెలకు 12 వేల నుండి 20 వేల రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతీ ఏడాదీ రూ. 1,000 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ, ఈ నిర్ణయంతోపాటు అంతకుముందున్న కారుణ్య నియామకాలను తొలగించడం పిడుగులాంటి వార్తనే. ఉద్యోగి సర్వీస్‌ కాలంలో మరణిస్తే, వైద్య కారణాలవలన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగికి ఏర్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియమకాలను అమలు పరిచే అవకాశాన్ని హోంగార్డులకు తొలగించారు. దీనితో తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 17,490 మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అయితే ఈ కారుణ్య నియామకాలను ఆంధ్రప్రదేశ్‌లో హోం గార్డ్స్‌కు అమలు పర్చడమనేది హర్షించదగిన విషయం.

తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి 2019 తర్వాత హోంగార్డ్స్‌ జీతాలు పెంపుదల సందర్భంలో డబుల్‌ బెడ్రూం ఇంటి కలను సాకారం చేస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. పోలీసులకు వర్తించే ఎటువంటి అలవెన్స్‌ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వీరికి వర్తించకపోవడం, విధినిర్వహణలో చనిపోయినపుడు పోలీసులకు వర్తించే ఎక్స్‌గ్రేషియా హోంగార్డ్స్‌కు లేకపోవడం, పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ వంటి ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్‌ లేకపోవడం, పైగా ఏధైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే సీఎల్‌(క్యాజువల్‌ లివ్‌) వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్‌ లీవ్‌ అవకాశం లేకపోవడం, హోంగార్డ్స్‌ ఏరోజు పనిచేస్తే ఆరోజుకే కూలీ చెల్లించే ధోరణిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుశాఖ అంటేనే డిసిప్లిన్‌ పేరుమీదుగా దర్జాగా సాగే వెట్టిచాకిరికి ప్రతిరూపంగా ఉంటుంది. హోంగార్డ్స్‌ ఉద్యోగ భద్రత లేని బానిసల్లాగే కుక్కిన పేనులాగా అధికారుల చేతిలో హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో, చివరికి వీరి ఇళ్ళలో పాకీ పనులకు, చివరకు సొంతపనులకు కూడ హోంగార్డులను వినియోగించే అధికారులు ఉండటం విచారకరం.

ఇకపోతే మహిళ హోంగార్డ్స్‌ పరిస్థితి మరింత దారుణం. మహిళా హోంగార్డుల పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. ప్రసూతి సెలవులు మహిళా పోలీసులకు జీతంతో కూడిన ఆరుమాసాల సెలవులైతే మహిళా హోంగార్డులకు మాత్రం మూడునెలల బాలింతగానే విధులకు హజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. ఇదికాక లైంగిక వేధింపులు షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయం!? ఇటీవల ఎస్‌ఐ స్థాయి మహిళా అధికారి ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హోంగార్డులకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పిస్తున్న యధార్థం. ముఖ్యంగా కారుణ్య నియమకాల విషయంలో కాఠిన్యంతో కాకుండా కరుణతో, మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. అలాగే హోంగార్డుల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు మల్లే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై మన ప్రభుత్వాలు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.


వరకుమార్‌ గుండెపంగు 
వ్యాసకర్త కథా రచయిత ‘ మొబైల్‌ : 99485 41711

మరిన్ని వార్తలు