పేదలపై యుద్ధం!

30 Aug, 2020 00:30 IST|Sakshi

జనతంత్రం

చరిత్రను విజేతలే రచిస్తారు. అతడెంతటి నరహంతకుడైనా సరే, బందిపోటు పిండారీ అయినా విజేతగా మిగిలిన రోజున పరమ పవిత్రుడిగానే చరిత్ర ప్రక్షిప్తం చేస్తుంది. మహా త్యాగ ధనులూ, వీరయోధులైనా సరే విజయాలు దక్కనిరోజున ‘అన్‌ సంగ్‌ హీరోస్‌’గానే మరుగునపడతారు. ‘ఒక రాజును గెలిపించు టలో ఒరిగిన నర కంఠములెన్నో..’ అంటారు దాశరథి. ఒరిగిన కంఠాల లెక్క ఎవరికీ తెలియదు. గెలిచిన రాజు మాత్రమే కని పిస్తాడు.

పందొమ్మిదో శతాబ్దపు ప్రథమార్ధంలో ఆండ్రూ జాక్సన్‌ అనే అమెరికా అధ్యక్షుడుండేవాడు. భూమిపుత్రులైన స్థానిక రెడ్‌ ఇండియన్లను ఊచకోత కోసి అమెరికా దక్షిణ ప్రాంతంలో వారి జనాభాను నిశ్శేషం చేసిన ‘ఘనత’ ఆయనది. రెడ్‌ ఇండియన్ల చర్మం వలిపించి తాను స్వారీ చేసే గుర్రానికి కళ్లేలు తయారు చేయించుకునేవాడట. అంతేకాదు, వందలాది మంది నల్లబాని సలు సేవకులుగా కలిగిన ‘శ్రీమంతుడు’ కూడా. ఆరోజుల్లో వ్యక్తుల ఐశ్వర్యాన్ని వారి వద్దనున్న బానిసల సంఖ్య ఆధారంగా గణించేవారు. కానీ, అమెరికా చరిత్రలోని గొప్ప అధ్యక్షుల్లో ఒకడిగా ఆండ్రూ జాక్సన్‌కు ఇప్పుడు కూడా స్థానం ఉంది. ఇరవై డాలర్ల నోటు మీద ఆయన బొమ్మను ముద్రించి మరీ అమెరికా గౌరవించుకుంది. చర్మం రంగు ఆధారంగా అమెరికాలో వర్ణ వివక్ష, విద్వేషం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆండ్రూ జాక్సన్‌ కాలం నాటి క్రూరత్వం బయటకు కనబడకపోవచ్చు కానీ, ఇంకా ప్రమాదకర స్థాయిలోనే వివక్ష కొనసాగుతున్నట్టు ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలు నిరూపించాయి.

ఈ నేపథ్యంలో పులిట్జర్‌ అవార్డు గ్రహీత, ఆఫ్రో–అమెరి కన్‌ రచయిత్రి ఇసాబెల్‌ విల్కర్సన్‌ రాసిన ‘కులం–మన అసం తృప్తుల పుట్టుక’ (caste: the Origins of our Discontents)  అనే పుస్తకం తాజాగా అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నది. భారతదేశంలో నెలకొని ఉన్న నిచ్చెన మెట్ల వంటి సామాజిక అంతరాల వ్యవస్థను మనం కులవ్యవస్థగా పరిగణిస్తాము. ఒక వ్యక్తి పుట్టుక కారణంగానే అతడు ఎక్కువవాడో, తక్కువ వాడో నిర్ధారించి బ్రాండింగ్‌ చేసే సంప్రదాయం మనది. అమెరికాలో ఇటువంటి వివక్షను జాతి (race) వివక్షగా పరిగణించేవాళ్లు. జాతి వివక్ష కంటే మరింత లోతైన, గాఢమైన కులవివక్ష కూడా అమెరికన్‌ వ్యవస్థలో నెలకొని ఉన్నదని విల్కర్సన్‌ ఈ పుస్తకంలో వాదించారు. జాతివివక్ష బయటకు కనిపించేదయితే, అంతర్లీ నంగా ఉండి నడిపించేదే కులవివక్ష అంటారామె. శరీర నిర్మాణం లోని ఎముకల గూడును కులతత్వంతోనూ, రక్తమాంసాలను జాతితోనూ ఆమె పోల్చారు. ఆధిపత్య జాతి భావన దురహం కార పూరితంగా బయటకు కన్పిస్తుంది. కులతత్వ ఆధిపత్య భావన అంతర్లీనంగా వుండి, మర్యాదస్తులనుకునే వారిలోనూ అప్పుడప్పుడు తొంగిచూస్తుందని విశ్లేషించారు. ఇందుకు ఉదా హరణగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అనుభ వాన్ని ప్రస్థావించారు. అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన స్టేట్‌ సెనేటర్‌గా ఉండేవారు. ఆ హోదాలో ఒక మీడియా పార్టీకి హాజరయ్యారట. అక్కడకు వచ్చిన అతి«థుల్లో చాలా మందికి అప్పటికి ఒబామా పరిచయం లేదు. ఆయనతోపాటు మరో నలుగురైదుగురు మాత్రమే ఆఫ్రో–అమెరికన్లు. మిగిలిన వారంతా తెల్లవారే. ఒబామా శరీర వర్ణం చూసి ఓ మీడియా ప్రతినిధి వెయిటర్‌గా భావించి, తనకో కూల్‌డ్రింక్‌ తెచ్చిపెట్ట మని ఆర్డర్‌ చేశాడట. ఇదంతా గమనించిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రతినిధి ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత లోకానికి ఈ సంగతిని వెల్లడించారు. ఒబామాను వెయిటర్‌గా భ్రమించిన మీడియా ప్రతినిధి దుర్మార్గుడేమీ కాదు. మర్యాదస్తుడే. అతని అంతరంగంలో పేరుకుపోయిన ఆధిపత్య భావజాలంవంటిదే మన దగ్గర కులతత్వం.

కులానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ ఆధిపత్య భావ జాలం సర్వసాధారణమైన విషయం. కానీ, కులాలకు, మతా లకు అతీతంగా వ్యవహరించవలసిన అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రుల్లోనూ తరచుగా ఈ ఆధిపత్య ధోరణి బయటపడుతున్న దృష్టాంతాలు మన సామా జిక భద్రతపై భయ సందేహాలకు కారణమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు బాహాటంగా ఒక మీడియా సమావేశంలోనే ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని వ్యాఖ్యా నించారు. అంటే దళితులు తక్కువవారు అనే భావన ఆయన అంతరంగంలో, ఆలోచనల్లో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో దట్టంగా ఆవరించిన కారణంగానే ఆయన ఆమాట అనగలిగారు. దళితులను మాత్రమే కాదు, కులవృత్తులు చేసుకుని జీవించే మత్స్యకారులను, నాయీబ్రాహ్మణులను, ఇతర వెనుకబడిన కులాల వారిని కూడా ఆయన పలుమార్లు అవమానించారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. ఆయన ధోర ణిని అర్థం చేసుకున్న సహచర మంత్రులు, పార్టీ నేతలు కూడా పేదవర్గాల ఆత్మాభిమానంతో యథాశక్తిగా ఆటలాడుకున్నారు. ఇవేవీ కూడా చాటుమాటుగా జరిగిన వ్యవహారాలు కావు. అన్నీ బహిరంగంగా జరిగినవే. కానీ ఏ ఉదంతంపై కూడా ఇప్పటికీ చంద్రబాబు విచారం వ్యక్తం చేయలేదు. అందువల్ల ఆయనలో ఈ కులాధిపత్య ఆలోచనా ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉన్న దని భావిస్తే తప్పెలా అవుతుంది?

ఏమాత్రం తప్పుకాదు. ఎందుకంటే ఈ కులాధిపత్య భావ నతో కూడిన నిర్ణయాలు, కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగు తూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో జరిగిన భూ సమీకరణ విషయాన్ని తీసుకుందాము. భూసమీ కరణ కంటే ముందు జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి కానీ, సమీకరణ పేరుతో ఇచ్చిన భూముల్లో అప్పటికే వేలాది ఎకరాల్లో జరిగిన బినామీ లావాదేవీల గురించి కానీ, సీఆర్‌డీఏ ఏర్పాటు వెనుకనున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యూహం గురించి కానీ ఇక్కడ చర్చించుకోవడం లేదు. నానావిధ ప్రయత్నాలతో మొత్తం 36 వేల ఎకరాల భూమిని ‘సమీకరించారు’. అందులో ఎకరాకు 1,200 గజాల చొప్పున సుమారు తొమ్మిదివేల ఎకరాలను భూములిచ్చిన రైతుల పేరుమీద కేటాయించారు. ఇందుకు అదనంగా మరో 1,200 ఎకరాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద లకు ఇళ్లస్థలాల కోసం ప్రత్యేకించింది. పేదల కేటగిరీలో సహ జంగానే దళితులు, షెడ్యూల్డ్‌ తెగలవారు, వెనుకబడిన వర్గాలు , అగ్రకుల పేదవారు ఉన్నారు. సౌకర్యవంతమైన సొంత ఇల్లు కలిగి ఉండడం ఒక ఆత్మగౌరవ వ్యక్తీకరణ. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఆత్మాభిమానంతో కూడిన జీవికను సాగించే విధంగా దాదాపు 30 లక్షలమందికి ప్రభుత్వం ఇళ్లస్థలాలను సిద్ధం చేసింది. స్థలాల మంజూరు కూడా మహిళల పేరు మీద జరిగింది. అంటే ఇల్లాలిని గృహలక్ష్మిగా గౌరవించిన ఉదాత్తమైన ఒక అద్భుత పథకం ఇది. రాష్ట్రవ్యాప్తంగా కేటాయించినట్లుగానే కృష్ణా, గుంటూరు జిల్లాలవాసులైన పేదలకు అమరావతి ప్రాంతంలో కేటాయించారు. చంద్రబాబు ఈ పథకంపై తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లెక్కలేనన్ని పిటిషన్లు వేయించారు. అవన్నీ హైకోర్టు స్వీకరించేలా వ్యాజ్యాలు నడపడంలో బాబు బహునేర్పరి. క్లే కోర్టుపై రఫేల్‌ నాడల్‌ చెలరేగినంత స్థాయిలో బాబు కోర్టు వ్యాజ్యాల్లో చెలరేగుతారని ఈ రాష్ట్రంలోని ప్రజ లందరికీ ఒక నమ్మకం. పైనుంచి కింది దాకా అందుకు అనువైన హంగులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు.

బాహుబలి సినిమాలో దర్శకుడు రాజమౌళి సెట్టింగ్స్‌లో, గ్రాఫిక్స్‌లో సృష్టించిన మాహిష్మతి నగరాన్ని చూసి చంద్రబాబు ముగ్ధుడయ్యాడు. తన పరవశాన్ని ఆయన దాచుకోలేదు కూడా. రాజమౌళిని పిలిపించుకుని సలహాలు కూడా అడిగారు. ఆయన ఏమిచ్చారో తెలియదు కానీ, చంద్రబాబు మాహిష్మతి ఉరఫ్‌ అమరావతి నగరం మాత్రం గ్రాఫిక్స్‌ గడప దాటలేదు. మాహి ష్మతి ‘నహీ’ష్మతిగానే మిగిలిపోయిన వైనం మనకు తెలుసు. దళితులు, పేదవర్గాలపై చంద్రబాబు ఆలోచన ధోరణి ఏరకంగా ఉంటుందో ఇప్పటికే అనేకమార్లు వెల్లడైంది. తాను ఊహించు కున్న ‘మాహిష్మతి’ స్కీమ్‌లో వారికి చోటు లేదు. హఠాత్తుగా జగన్‌ ప్రభుత్వం 54 వేలమంది పేదలకు స్థలాలివ్వడంతో ఆయన కలవరపడ్డారు. తనవాళ్లను పిలిపించి గట్టిగా వ్యాజ్యాన్ని రచించి కోర్టులో వేశారు. రాజధాని ప్రాంతంలో భూకేటా యింపులు చేసే అధికారం సీఆర్‌డీఏకు మాత్రమే ఉన్నది, ప్రభు త్వానికి లేదు అనేది సారాంశం. ‘ఆదియందు అంతయునూ శూన్యమే ఆవరించి వున్నది. ఆ తర్వాత దేవుడు సీఆర్‌డీఏను సృష్టించాడు’ అన్న చందంగా వ్యూహం సిద్ధమైంది. పాల మీగడ వంటి రైతు కుటుంబాల సభ్యులను సమీకరించి ప్లకార్డులతో రోడ్లపై కూర్చోబెట్టించారు. అంటే ‘క్రీమీలేయర్‌’ రైతాంగమన్న మాట. అన్ని ఉద్యమాలకు మద్దతు ఇచ్చినట్టుగానే ఈ క్రీమీలే యర్‌ రైతాంగ ఉద్యమానికి కూడా కామ్రేడ్స్‌ మద్దతు లభిం చింది. పాతకాలం కమ్యూనిస్టులు క్రీమీలేయర్‌పై భిన్నంగా స్పందించేవారు. చలనచిత్ర రంగానికి వచ్చిన తొలి తరం కవుల్లో, రచయితల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. ఆ ప్రభా వంతోనే కవి, రచయిత ఆత్రేయ క్రీమీలేయర్‌పై ఒక చక్కని పాట రాశారు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా! నీ బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?’ అని ప్రశ్నిస్తూ సమాధానం కూడా తనే చెబుతాడు. ‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో’ అంటాడు. కండలు కరగేసిన దళిత బహుజనుల కాయకష్టంతోనే రైతాంగంలో క్రీమీలేయర్‌ ఎది గిందనేది నిర్వివాదాంశం. ఎవరి స్వేదజలంతో విరగ పండిన చేలు సిరులు కురిపించి క్రీమీలేయర్‌ రైతాంగాన్ని సృష్టించిందో, వారికి రాజధాని భూముల్లో ఇళ్లస్థలాలివ్వవద్దని ‘పాలమీగడ లన్నీ’ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగడం ఓ విచిత్రం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనే పేదవర్గాలపై యుద్ధం ప్రకటించినట్టు కనిపిస్తున్నది. తనకు ఓట్లు వేయని ప్రజలు ఎందుకు లబ్ధిపొందాలని పంతం పట్టినట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. పల్లెసీమల ముంగిట్లోకి పరిపాలనను తీసు కెళ్లేందుకు ఉద్దేశించిన గ్రామ సచివాలయాల భవనాలకు రంగుల మిషతో అడ్డుతగిలింది. పేదింటి బిడ్డలు ఇంగ్లిష్‌ చదువు లతో ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నా లపై కోర్టుకెక్కింది. ఇళ్ల స్థలాల ద్వారా సొంత ఇంటిని కల్పిం చడం ద్వారా పేద ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నంపై డజన్లకొద్దీ లిటిగేషన్లు సంధించింది. ఉన్నత న్యాయస్థానం కూడా ప్రతి పిటిషన్‌ను స్వీకరించడంపైనా ప్రజల్లో చర్చ జరు గుతున్నది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వ్యాసం ఈమధ్య సోషల్‌ మీడియాలో వచ్చింది. నిబద్ధత గల కమ్యూనిస్టుగా పేరున్న ఒక సీనియర్‌ నాయకుడు ప్రశాంత భూషణ్‌ కోర్టు ధిక్కారం వ్యవహారంపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సంద ర్భంగా గతంలో సుప్రసిద్ధ కమ్యూనిస్టు నేత ఇఎమ్‌ఎస్‌ నంబూ ద్రిపాద్‌పై వచ్చిన కోర్టు ధిక్కారం కేసును ఆయన గుర్తుచేశారు. 1967లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న నంబూద్రిపాద్‌ ఒక పత్రికా గోష్టిలో న్యాయవ్యవస్థపై కొన్ని కామెంట్స్‌ చేశారు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయవ్యవస్థ కూడా ఒక అణచివేత సాధనం. ధనిక వర్గానికి, పేద వర్గానికి జరిగే యుద్ధంలో న్యాయం ధనికవర్గం తరఫున నిలబడుతుంది.’ మరునాడు పత్రి కల్లో ఈ వ్యాఖ్యలు అచ్చయ్యాయి. కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నంబూద్రిపాద్‌కు శిక్ష వేసింది. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్లింది. అక్కడ కూడా నంబూద్రిపాద్‌ తగ్గలేదు. ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా స్వల్ప జరిమానాతో కేసును ముగించారు. మార్క్సిస్టు సిద్ధాంతాలనే కాకుండా హిందూ ధర్మశాస్త్రాలను కూడా ఔపోసన పట్టిన మేధావి నంబూద్రిపాద్‌. ప్రపంచంలో బుల్లెట్‌ ద్వారా కాకుండా బ్యాలెట్‌ ద్వారా అధికారంలోకి వచ్చిన తొలి కమ్యూనిస్టు నేత కూడా నంబూద్రిపాదే.

ప్రతిపక్ష నేత చంద్రబాబు పేదవర్గాలపై న్యాయస్థానాల్లో యుద్ధం చేస్తున్న సమయంలోనే సోషల్‌ మీడియాలో నంబూద్రి పాద్‌ వ్యాఖ్యలు ప్రచారం కావడం కేవలం కాకతాళీయమే కావచ్చు. చంద్రబాబు ప్రయత్నాలన్నీ ఆయనకు తాత్కాలిక ఉప శమనాన్ని కలిగించేవే. అంతిమంగా పేదవర్గాల, దళితుల న్యాయ మైన పోరాటం నెగ్గుతుంది, మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో... వాళ్లొస్తున్నారు. మట్టికాళ్ల మహామనుషులొస్తున్నారు. శ్రమజీవన సౌందర్య జయకేతనాన్ని నీ గుండెలపై ఎగరేస్తారు. చూస్తుండు.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు