వెన్నెల (కంటి) జ్ఞాపకాలు

7 Jan, 2021 00:58 IST|Sakshi

వెన్నెలనూ వెన్నెలకంటినీ ఇష్టపడని వారెవరు? వెన్నెల అందరిది, వెన్నెలకంటి అంద రివాడు. మంచి మనిషి కాని వాడు మంచికవి కాలేడు. వెన్నెలకంటి వెన్నెలంత స్వచ్ఛ మైన మనసున్నవాడు. నేను 1989లో పీహెచ్‌డీ పట్టా నిమిత్తం మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి వెళ్లినప్పుడు పరిచయం. మొదట్లో ఆయన ప్రతిభను గుర్తించలేక పోయినా క్రమంగా పాత, కొత్త సినిమా పాటల మీద ఆయన అవగాహననూ, వాటిని అప్పటికప్పుడు అప్పగించే అసాధారణమైన ధార ణనూ గమనించి ఆశ్చర్య పోయాను. నా సిద్ధాంత వ్యాసం ‘తెలుగు సినిమాపాట చరిత్ర’లో ఆయన అందించిన విలువైన సమాచారం నాకెంతగానో ఉపక రించింది. సమాచారం ఇవ్వడమే కాదు, ఆ కోవకు చెందిన నా పుస్తకావిష్కరణ సభలన్నిటికీ వ్యాఖ్యా తగా వ్యవహరించారు.

వేటూరి అభివ్యక్తినీ, ఆత్రేయ శైలినీ ఆదర్శంగా ఎంచుకొన్నప్పటికీ పడికట్టు పదాలను వాడకుండా తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. చిన్నతనంలోనే పద్య రచనలు అలవడిన ఆయన సినిమాపాటల రచన లోనూ సాహిత్యాభిరుచినీ, అలంకార ప్రీతినీ కనబ ర్చారు. ‘మాటరాని మౌనమిది/ మౌనవీణ గానమిది/ గానమిది నా ధ్యానమిది...’; ‘చిరునవ్వుల వరమి స్తావా, చితినుంచి బ్రతికొస్తాను/ మరుజన్మకు కరుణి స్తావా, ఈ క్షణమే మరణిస్తాను’ వంటి వెన్నెల తున కలు దీనికి ఉదాహరణలు.

వెన్నెలకంటి స్ట్రెయిట్‌ చిత్రాల్లో కంటే డబ్బింగ్‌ చిత్రాలకే ఎక్కువగా మాటల్ని, పాటల్ని రాశారు. ఎనభైల దశకంలో డబ్బింగ్‌ ప్రక్రియను ఏలుతున్న రాజశ్రీతో పాటు ‘నాయకుడు’ చిత్రంలో రెండు పాటల్ని రాసే అవకాశం రావడంతో ఆ రంగంలో కాలు మోపి ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా ఎదిగి డబ్బింగ్‌ రంగంలో ఒక దశను సొంతం చేసుకున్నారు. ‘సన్నజాజి పడక... మంచెకాడ పడక... చల్లగాలి పడక’; ‘నేనాటోవాణ్ని, ఆటోవాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి’ లాంటి పాటలతో పాటు, ‘భామనే సత్యభా మనే’ చిత్రం మొదలుకుని కమల్‌హాసన్‌ నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో డబ్బింగ్‌ రచన చేసి ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు. హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు ‘జురాసిక్‌ పార్క్‌’తో ప్రారంభించి అనేక ఆంగ్ల చిత్రాలను, ‘నింగీ నేలా నాదే’ అనే చైనీయ చిత్రాన్ని కూడా ‘డబ్‌’ చేసిన ఘనత ఆయనకు దక్కింది.

‘తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, బాలసుబ్ర హ్మణ్యం సినీ గేయరచయితగా నాకు పునర్జన్మని చ్చారు’ అని జీవితాంతం ‘బాలు’ పట్ల తన కృతజ్ఞతా భావాన్ని వెల్లడించుకున్నారు. వెన్నెలకంటి సామ ర్థ్యాన్ని గ్రహించే బాలుగారు ఆయన్ని తన వారసుడిగా ప్రకటించారు. ఆయనతో ‘కరోనా’ మీద కూడా పాట రాయించి గానం చేశారు. సింగీతం శ్రీనివాసరావు ‘మాయాబజార్‌’లో పింగళి రాసిన ‘నవవసంత మధు రిమ...’ అనే పల్లవికి చరణాల్ని వెన్నెలకంటి చేత పూర్తి చేయించి తన మనవరాలితో కలిసి పాడారు. 

విద్యార్థి దశలోనే వెన్నెలకంటి మూడు శతకాలను రాశారు. ‘ఆత్మవత్‌ సర్వభూతాని’, ‘యత్ర నార్యస్తు పూజ్యన్తే...’ అనే నాటికలకు పరిషత్‌లలో బహుమతు లను పొందారు. ‘ఉషోదయం ఆపలేవు’, ‘వెన్నెల జల్లు’, ‘లహరి’ కవితాసంపుటాలు వెలువరించారు. అయినా తనివి తీరక సినీరంగానికి సంబంధించిన విశ్లేషణ గ్రంథం ఏదైనా రాయాలని అభిలషించేవారు. కానీ  సినిమా రచనల ఒత్తిడివల్ల ఆ పనికి తీరిక లభిం చేది కాదు. అలాగే శ్రీరామచంద్రుని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని మొదలుపెట్టి కిష్కింధకాండ వరకు ఉన్న కథా వస్తువుతో 600 పద్యాలు రాశారు. అది కూడా అసంపూర్ణంగా మిగిలిపోవడం విధి వైప రీత్యం.

‘పురాణమిత్యేవ న సాధు సర్వం’ అన్నట్టు వెన్నెలకంటి పాత సినిమా పాటల్ని గౌరవించడంతో పాటు కొత్తపాటల్ని కూడా సమర్థించేవారు. నేటి సినిమా పాటల్లో విలువలు దిగజారిపోయాయనే నా వాదంతో ఆయన ఏకీభవించలేదు. అలాగే నేను ‘మనస్విని’ పురస్కార న్యాయ నిర్ణేతలలో ఒకరినై ఉండి కూడా ఆయన పాటలకు ఆ పురస్కారాన్ని ఇవ్వకపోయినా, నన్నెప్పుడూ పల్లెత్తు మాట అనని సంస్కారి. వెన్నెలకంటి అభిమానుల హృదయాలలో చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తడి కన్ను లతో ప్రార్థించడం తప్ప మన చేతుల్లో ఏముంది? ‘హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నది!’

డాక్టర్‌ పైడిపాల
వ్యాసకర్త సినీ గేయ పరిశోధకుడు
మొబైల్‌ : 99891 06162

మరిన్ని వార్తలు