సందేహాలు తీరకుండా చర్యలెలా?

12 Jan, 2023 00:56 IST|Sakshi

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేపట్టే చర్యలకు కొన్ని వైరుద్ధ్యాలు అడ్డుపడుతున్నాయి. ఉష్ణోగ్రతలను తక్కువ పెరిగేలా చూడాలంటే, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. కానీ పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆధారపడే బొగ్గును తగ్గించే అంశానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలుష్యానికి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత వాటిపైనే ఉండగా, ఆ దాతల జాబితాలోకి భారత్, చైనాలను కూడా చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. భారత్‌కే ప్రత్యేకమైనది చైనాతో వ్యవహారం. చైనా తనకు అనుకూలంగా జీ77+ చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఉద్గారాల్లో యూరప్, అమెరికాను మించనున్నందున దాతల జాబితాలోకి చైనా చేరేలా భారత్‌ ఒత్తిడి తేవాలి.

వాతావరణం విషయంలో గత ఏడాది ఎన్నో వైపరీత్యాలను చూశాం. ఉత్తర భారతం అసాధారణ వడగాడ్పులతో అట్టుడికింది. పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. యూరప్, చైనా కరవును చవిచూశాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవ డంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచం ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది. అయినా సరే... గత ఏడాది మానవాళి ఐదు కీలకమైన వైరుద్ధ్యాలను ఎదుర్కొంది. వీటిని తొల గించుకోకుంటే, ప్రకృతి వైపరీత్యాలు ఈ ఏడాదీ మనల్ని పలకరించక మానవు!

వైరుద్ధ్యాల్లో మొట్టమొదటిది ‘శిలాజ ఇంధనాలు వర్సెస్‌ బొగ్గు’ అన్న అంశం నుంచి పుట్టుకొచ్చింది. వాతావరణ మార్పుల ప్రభా వాన్ని తగ్గించేందుకు భూమి సగటు ఉష్ణోగ్రతలను వీలైనంత తక్కువ పెరిగేలా చూడాల్సిన అవసరముంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని అనుకుంటున్నాయి. ఈ అంశంపై ఇతర దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి శాస్త్రీయ మదింపు ప్రకారం, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఈజిప్టులో గత ఏడాది జరిగిన 27వ కాప్‌ సమావేశాల్లో పాశ్చాత్య దేశాలు బొగ్గు వాడకం తగ్గిద్దామనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. అభి వృద్ధి చెందిన దేశాల్లో అత్యధికం చమురు, సహజవాయువుల ప్రధాన ఎగుమతిదారులు లేదా ఎక్కువ మోతాదుల్లో వినియోగించేవారు కావడం ఇక్కడ ప్రస్తావనార్హం!

ఇక రెండో వైరుద్ధ్యం గురించి: కాప్‌–27 సమావేశాల్లో ఇది వ్యక్తమైంది. ఆర్థికాంశాలపై చర్చలో ‘లాస్‌ అండ్‌ డ్యామేజీ’ అంశంలో ఈ వైరుద్ధ్యం ఏమిటన్నది తెలిసింది. వాతావరణ కాలుష్యానికీ, భారీ కర్బన ఉద్గారాలకూ అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతే ఎక్కువ. కాబట్టి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా వాటిపైనే ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఆర్థిక వనరులను సమ కూర్చాల్సి ఉంది కూడా.

ఇందుకోసం ఏటా సుమారు వెయ్యి కోట్ల డాలర్ల అవసరముండగా... ఇప్పటికి సమకూర్చింది పిసరంతే. ఎందు కిలా అన్న ప్రశ్నకు అభివృద్ధి చెందిన దేశాలు విచిత్రమైన వాదన చేస్తున్నాయి. దాతల జాబితాలోకి భారీ ఆర్థిక వ్యవస్థలున్న దేశాల (భారత్, చైనా అని)ను చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఈ కొత్త వాదన... ఇప్పటివరకూ నిర్ణయించిన విషయాలకు భిన్నం.

మూడో వైరుద్ధ్యం కాప్‌–27 తీర్మానం తుది ప్రతిలో ‘జస్ట్‌ ట్రాన్సిషన్‌’, ‘జస్ట్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ పార్ట్‌నర్‌షిప్‌’ (జేఈటీపీ) అన్న పదాలను చేర్చడంతో ఉత్పన్నమైంది. ఈ రెండు పదాలూ చూసేం దుకు ఒకేలా అనిపిస్తాయి. కానీ వీటి అర్థాలు చాలా భిన్నం. ‘జస్ట్‌ ట్రాన్సిషన్‌’ అనేది సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకానికి మళ్లేందుకు ఒక్కో దేశానికి కావాల్సిన అంశాలకు సంబంధించినది కాగా, జేఈటీపీ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో బొగ్గు వాడకాన్ని నిలిపివేసేందుకు జీ7 దేశాలు అమలు చేస్తున్న అజెండాకు సంబం ధించిన విషయం. భారత్‌ సహా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా బొగ్గుపై ఆధారపడ్డ దేశాలు. వీటిని జేఈటీపీలోకి చేర్చేందుకు జీ7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏతావాతా... కాప్‌–27 తుది తీర్మానంలో జస్ట్‌ ట్రాన్సిషన్‌ అనే మాట చేరిక ఆహ్వానించదగ్గదైతే... జేఈటీపీ మాత్రం అనుమానించదగ్గది. 

నాలుగో వైరుద్ధ్యం విషయానికి వద్దాం. కార్బన్‌ మార్కెట్లపై జరిగిన చర్చల్లో ఇది బయటపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ కార్బన్‌ మార్కెట్లను (క్యోటో ప్రొటోకాల్‌లో భాగంగా ఏర్పాటైన క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకనిజమ్స్‌; క్లుప్తంగా ‘సీడీఎం’) ఆర్థిక వనరు లను సమకూర్చుకునే సాధనంగా చూస్తూవచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల దృక్పథం దీనికి పూర్తిగా భిన్నం. తక్కువ ఖర్చుతో కర్బన ఉద్గారాలను తొలగించుకునేందుకు సీడీఎంను వాడుకోవచ్చునని ఈ దేశాలు భావిస్తున్నాయి. క్యోటో ప్రొటోకాల్, ప్యారిస్‌ అగ్రిమెంట్ల రెండింటిలోనూ కార్బన్‌ మార్కెట్ల ప్రస్తావన ఉన్నప్పటికీ వాటి నేపథ్యాలు మాత్రం వేర్వేరు.

మొదటిదాని ప్రకారం దేశాలకు నిర్దిష్టమైన కర్బన ఉద్గార తగ్గింపు లక్ష్యాలు లేవు. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం ‘నేషనల్లీ డిటర్మైండ్‌ కంట్రిబ్యూషన్స్‌’ (ఎన్‌డీసీ) ఉన్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఆయా దేశాలు చేసే ప్రయత్నాలే ఈ ‘ఎన్‌డీసీ’. భారతదేశం క్లైమేట్‌ ఫైనాన్స్‌ కోసం ఇతర దేశాలకు కార్బన్‌ క్రెడిట్స్‌ అమ్మితే, అవి ఉద్గారాల తగ్గింపు జాబితాలోకి చేరవు. దీనివల్ల మనం ఎన్‌డీసీలో వెనుకబడిపోతాం. కార్బన్‌ క్రెడిట్స్‌ అమ్ముకుని వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం... ఆయా దేశాలు కర్బన ఉద్గారాలపై ఇచ్చిన మాటను పూర్తి చేసిన తరువాతే సాధ్యమవుతుందన్నమాట. 

చిట్టచివరి... ఐదవ వైరుద్ధ్యం గురించి. ఇది భారతదేశం తనకుతాను సమాధానం ఇచ్చుకోవాల్సిన ప్రశ్న. వాతావరణానికి సంబంధించిన రాజకీయాల్లో చైనాతో ఎలా వ్యవహరించాలి? తన ఆర్థిక బలంతో రాజకీయాలు చేస్తున్న చైనా విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు వీటిల్లో ఒకటి మాత్రమే. ఫలితంగా కర్బన ఉద్గారాలు ఎన్నో రెట్లు ఎక్కువయ్యాయి. మన మంత్రులు ఈ విషయాలను ఇప్పటికే పలుమార్లు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.

కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌(సీఈఈడబ్ల్యూ) అంచనా ప్రకారం చైనా గత, భవిష్యత్తు ఉద్గారాలు అమెరికా, యూరప్‌లను కూడా మించిపోతాయి (2060 నాటికి శూన్యస్థాయికి తేవాలన్న లక్ష్యంతో చైనా ఉంది). అంటే అమెరికా, యూరప్‌ల మాదిరిగానే చైనాను కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చాలన్నమాట. కానీ చైనా తనకు అనుకూలంగా ఉండేలా జీ77 + చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఈ విషయంలో భారత్‌ ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి. చైనా పాత్ర ఎలా ఉండాలో కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. 

ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాల అధ్యక్ష స్థానంలో ఉంది. దీని ఆసరాతోనైనా భారత్‌ ప్రపంచ వాతావరణ మార్పుల చర్చల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలపరచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగానూ స్థిరపడాలి. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వాడకం మాత్రమే కాకుండా... అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించేలా ప్రపంచాన్ని ఒప్పించాలి. శిలాజ ఇంధనాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం వైపు మళ్లేందుకు కావాల్సిన అంశాల ఆధారంగా జేఈటీపీ ఉండేలా... జీ7 దేశాల పెత్తనం మాదిరిగా కాకుండా చూసుకోవాలి. చైనా అపరిమిత ఉద్గారాల విషయంలో భారత్‌ విస్పష్టంగా వ్యవహరించాలి. దాతల జాబితాలోకి చైనా కూడా చేరేలా ఒత్తిడి తేవాలి. కార్బన్‌ మార్కెట్లను అవకాశంగా తీసుకుని మరింత పర్యావరణ హితమైన టెక్నాలజీలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. 

ఇప్పటివరకూ ప్రస్తావించిన ఐదు వైరుద్ధ్యాలు పరిష్కార మవుతాయా? లేక అలాగే కొనసాగుతాయా? అన్నది ఇంకోదఫా వాతావరణ మార్పుల చర్చలు జరిగినప్పుడే తేలుతుంది. కాకపోతే ఈ ఐదు అంశాలు ప్రపంచం, మరీ ముఖ్యంగా భారతదేశం వాతావరణ మార్పుల విషయంలో ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో నిర్దేశిస్తాయ నడంలో సందేహం లేదు.

వైభవ్‌ చతుర్వేది 
వ్యాసకర్త
ఫెలో, ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ,
ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’
(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు