Katta Narasimhulu: కైఫియత్తులే ఇంటిపేరుగా...

14 May, 2022 13:32 IST|Sakshi
కట్టా నరసింహులు

బలమైన చారిత్రక ఆధారాలైన కైఫియత్తులను ఇంటి పేరుగా మార్చు కొన్న గొప్ప భాషావేత్త, పరిశోధకులు... విద్వాన్‌ కట్టా నరసింహులు. వైఎస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించారు. బ్రౌన్‌ గ్రంథాలయ ఆవిర్భావం తర్వాత దాని వ్యవస్థాపక సెక్రెటరీ డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రితో పరిచయం... కట్టా పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ గ్రంథాలయానికి చేర్చింది.

బ్రౌన్‌ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని పటిష్టం చేసేందుకు కట్టా పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం, శక్తియుక్తిలకు తృప్తిచెందిన జానమద్ది ఆయనకు మెకంజీ రాసిన ‘కడప కైఫియత్తు’ల పరిష్కార బాధ్యతను అప్పగించారు. ఫలితంగా 3,000 పైచిలుకు పేజీలతో, 8 సంపుటాల కడప కైఫియత్తులు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. 

ఆయన కేవలం కడప కైఫియత్తుల ఆధా రంగా ఇంతవరకు వెలుగు చూడని చారిత్రకాంశాలతో ‘కైఫియత్‌  కతలు’ పేరిట పుస్తకం వెలువరించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయల పాలన వలె ఆయన బంధువులైన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పూర్తి చారిత్రక ఆధారాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు వెలువరించి, అక్కడ ఉన్న రామాలయ చరిత్రను లోకానికి తెలిపారు. (చదవండి: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి)

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కృషి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ‘పోతన భాగవతం’ ప్రాజెక్టులో సేవలందించే అవకాశాన్ని కల్పించింది. అక్కడ పని చేస్తూనే ఆయన 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా కడపలోని బ్రౌన్‌ కేంద్రంలో సదస్సు జరగనుంది.

– పవన్‌కుమార్‌ పంతుల, జర్నలిస్ట్‌
(మే 15న విద్వాన్‌ కట్టా నరసింహులు తొలి వర్ధంతి)

మరిన్ని వార్తలు