తీర్పు చెప్పేవాడు ‘మనవాడైతే’?

16 Oct, 2020 00:57 IST|Sakshi

సందర్భం

దేశంలో న్యాయ పరమైన చిక్కులు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉంటుంది. మారుతున్న సామాజిక పరిస్థితులను అనుసరించి ఒక్కోసారి పెను వివాదాలు చోటు చేసుకుంటాయి. వీటిని విమర్శిస్తూ ఇదేమి  చోద్యం? ఇంతకు ముందు ఇలాంటి వివాదం తలెత్తిందా అనటం సబబు కాదు. అలా అనుకుంటే న్యాయ చరిత్రలో, ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే ప్రజా హక్కులను కాపాడే కేసుగా కేశవానంద భారతి కేసు చరిత్రకు ఎక్కేది కాదు. చరిత్ర గతినే మలుపు తిప్పిన కేసుగా దీనిని న్యాయ కోవి దులు అభివర్ణిస్తుంటారు. 13  మంది న్యాయమూర్తులచే 68  రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిగిన ఈ కేసు తీర్పులో నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. 

అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు పాలించే ప్రభుత్వాలకు ఆటంకాలు, అవరోధాలు కలిగినప్పుడు సవాళ్లు, ప్రతి సవాళ్లు, సంక్షోభాలు షరా మామూలే ! ఇవి రాజకీయాల్లో అయితే ప్రజలు ఓటు ద్వారా తీర్పునిస్తారు. అయితే ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వానికి ఈ సంకట స్థితి ఎదురైతే న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. ఈ తీర్పులు చట్టాలను అనుసరించి ప్రజామోదయోగ్యంగా ఉంటాయి,  అలా ఉండకపోతేనో మళ్ళీ అదొక  సంక్షోభం.
ఎవరైనా న్యాయస్థానానికి ఎందుకు వెళతారు? న్యాయం కోసం. కానీ అదే న్యాయస్థానం న్యాయం అందించటానికి సిద్ధంగా లేకపోతే? లేదా పక్షపాత ధోరణితోనూ, ఏకపక్ష ధోరణితోనూ వ్యవహరిస్తోంది అనిపిస్తే? అప్పుడేమిటి చేయటం?

సరిగ్గా అప్పుడే సహజ న్యాయసూత్రాల ప్రస్తావన వస్తుంది. దీన్నే న్యాయ పరిభాషలో ‘ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ నేచురల్‌ జస్టిస్‌’ అంటారు. కేసు విచారణలో ఏకపక్ష ధోరణులు, ఎదుటివారి వాదనను వినకపోవటం లేదా వినే అవకాశం ఇవ్వకపోవటం, తీర్పు వెలువరించటానికి ముందే ఆ తీర్పు ఎలా ఉండాలో మానసికంగా సంసిద్ధులు కావటం, అందుకు పక్షపాత వైఖరో, ద్రవ్య ప్రలోభమో, బంధుత్వమో, రాగద్వేషాలో కారణం అవటం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ‘సివిల్‌ లా’లో ‘ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ నేచురల్‌ జస్టిస్‌’ ప్రస్తావన వస్తుంది.

ఏమిటీ సహజ న్యాయ సూత్రం? ఇది మన న్యాయ చట్టాల్లో ఉందా? అంటే చట్టాల్లో పొందుపరచకపోయినా భారత రాజ్యాంగం ఆర్టికల్‌  14, ఆర్టికల్‌  21 అనుసరించి సంగ్రహించడమైనది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 చట్టం ముందు అంతా సమానులే అని చెప్తుంటే, ఆర్టికల్‌ 21 వ్యక్తి స్వేచ్ఛ, ప్రాణ రక్షణ గురించి చెప్తోంది. ‘మేనకా గాంధీ వర్సెస్‌ ది యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో ఆర్టికల్‌  21 స్ఫూర్తి విపులీకరించడమైంది.

మితిమీరిన అధికారాలు ఎప్పుడూ మితం తప్పి అక్రమాలకే దారితీస్తాయనేది నానుడి. ఈ నానుడి నుంచి న్యాయవ్యవస్థకూ మినహాయింపు ఏమీలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ మనుగడ కూడా మన మధ్య ఉండే మనుషులతో సాగేదే..! కనుక మనుషుల్లో ఉండే సహజమైన బలహీనతలు, పక్షపాత ధోరణులు అక్కడ నిబిడీకృతం అయి ఉంటాయి. అయితే వీటి ప్రభావం పవిత్రమైన తీర్పులపై ప్రసరించకుండా కాపాడుకునే ప్రక్రియే సహజ న్యాయసూత్రాల ప్రక్రియ. ఇది ఏకపక్ష, పక్షపాత, రాగద్వేషాలకు అతీ తంగా వ్యవహరించమని కోరే హక్కు. 

తీర్పులలో అవాంఛనీయ ధోరణులు ఏర్పడినప్పుడు న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టి, ఆ వ్యవస్థపై సగటు మనిషికి విశ్వాసం కలిగించేవే సహజ న్యాయసూత్రాలు. ఇందులో రెండు అతిముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవే, ఒకటి ‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ బయాస్‌’, రెండు ‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఫెయిర్‌ హియరింగ్‌’. 
డాక్ట్రిన్‌ ఆఫ్‌ బయాస్‌ (Doctrine of bios) దీన్నే ‘నెమోడెబిత్‌ ఎస్సేజుడెక్స్‌ ప్రోప్రియాకాసో’ ( Nemo debut esse judex pro pria causo) అంటారు. ఇది లాటిన్‌ భాష నుంచి సంగ్రహించబడింది.  No man shall be judge in his own  అంటే ఏ ఒక్కరూ కూడా తమ కేసులో తాము జడ్జిగా వ్యవహరించకూడదు. తమ కేసులో అంటే ప్రత్యక్షంగా తాము ‘ఇన్వాల్‌’ అయినట్టు కాదు.

ఒక కేసును విచారించే న్యాయమూర్తికి సదరు కేసుకి ఏదైనా సంబంధం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ తీర్పు సరిగా వెలువడే అవకాశం లేదు.
అలాగే సహజ న్యాయసూత్రాల్లో రెండవ అతిముఖ్యమైన అంశం ‘ఆడి అల్టెరమ్‌ పార్థిమ్‌’ (Audi Alterm partem). ఇది కూడా లాటిన్‌ భాష నుంచి వచ్చినదే. దీన్నే ఇంగ్లిష్‌లో ‘ఫెయిర్‌ హియరింగ్‌’ అంటారు. "No man should be punished or condemned unheard" ఏ వ్యక్తిని కూడా పూర్తి విచారణ జరగకుండా లేదా తన వాదనలు వినకుండా అతడిని శిక్షించకూడదు.డాక్ట్రిన్‌ ఆఫ్‌ బయాస్‌లో మళ్లీ మూడు అంశాలు ఉన్నాయి. ‘బయాస్‌’ అంటే పక్షపాత ధోరణి అని మనకు తెలిసిందే! ఈ పక్షపాతం ఎన్ని విధాలు అంటే మూడు రకాలు అని పేర్కొనవచ్చు. 

1. వ్యక్తిగత పక్షపాతం ( Personal bias) 2. ద్రవ్యసంబంధ పక్షపాతం (Pecuniary bias) 3. విషయానికి సంబంధించిన పక్షపాతం  (Subject matter of bias). వీటికి సంబంధించిన తీర్పులు చాలా ఉన్నాయి. ‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఫెయిర్‌ హియరింగ్‌’ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ వ్యక్తికి సంబంధించి అయినా న్యాయస్థానం తీర్పు చెప్పేటప్పుడు ఉభయుల వాదనలు విన్న తర్వాతే తీర్పు వెలువరించాలి. తీర్పు సారాంశాన్ని స్పష్టంగా వెల్లడించాలి. వాదనలు వినిపించడానికి ఉభయులకు సముచితమైన అవకాశం ఇవ్వాలి. న్యాయమూర్తులకు సహజంగానే కొన్ని విషయాలలో విచక్షణాధికారాలు ఉంటాయి. కానీ అవి తీర్పులను మరింత సమర్ధంగా, సమ్మతంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టడానికి, ప్రజల హక్కులు కాపాడటానికి అప్పుడప్పుడు సహజ న్యాయసూత్రాలు తెరమీదకు వస్తాయి. కానట్లయితే ప్రజాస్వామ్య మూలస్తంభాలలో అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఏ కొద్దిమంది చర్యలవల్లో, చేష్టలవల్లో మసకబారే ప్రమాదం ఉంది. ఈ రకమైన అవాంఛనీయ చర్యల వల్ల ప్రజాస్వామ్య ఉనికికే భంగం కలిగే అవకాశం ఉంది. కనుక పవిత్రమైన న్యాయవ్యవస్థను కాపాడుకోవటంలో సగటు ప్రజలకు బాధ్యత ఉందని ‘సహజ న్యాయ సూత్రాలు’ వంటివి అప్పుడప్పుడు గుర్తుకు తెస్తుంటాయి.


పి. విజయబాబు
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు, 
పూర్వ కమిషనర్, సమాచార హక్కు చట్టం,
న్యాయవాది

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు