బడుగు జీవుల ఆశాదీపం ఆరోగ్యశ్రీ

28 Aug, 2020 01:41 IST|Sakshi

విశ్లేషణ

సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక ప్రతిష్టాత్మక పథకానికి రూపురేఖలు దిద్దారు. ఆ పథకం పేరే ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలకు లబ్ధి కలిగించిన పథకమిది. వైఎస్సార్‌ 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం బీపీఎల్‌ కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం మరింత మెరుగుపరిచిన ఈ పథకంలో కోవిడ్‌–19 చికిత్సను కూడా భాగం చేయాలని నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు వరంలాంటిదనే చెప్పాలి. దేశంలోనే కోవిడ్‌–19 చికిత్సను రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎవరైనా అన్నప్పుడు అది పడికట్టుపదంలాగా ధ్వనించవచ్చు కానీ ఈ మూడు పదాలకున్న ప్రాధాన్యత మానవజాతి ఉనికి పొడవునా ఎన్నడూ అంతరించిపోలేదు. ఆరోగ్య సమస్యలు ఏ కాలంలోనైనా ఎవరినైనా పీడిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కొన్నిసార్లు అవి అసాధారణ రీతిలో ఖర్చులను తీసుకొస్తాయి కూడా. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడు వ్యక్తులకూ, కుటుంబాలకూ ఆర్థిక భారానికి దారితీస్తుంది. ప్రత్యేకించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌), ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. వీరికి స్వల్ప స్థాయి జబ్బులకు కూడా నాణ్యమైన ఆరోగ్య సేవలు పెద్దగా ఖర్చులేకుండా అందడం అనేది పీడకలలాగే అవుతుంది. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే విభజన పూర్వ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, గొప్ప దార్శనికుడు, దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజ శేఖరరెడ్డి ఒక ప్రతిష్టాత్మక పథకానికి రూపురేఖలు దిద్దారు. ఆ పథకం పేరే ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలకు లబ్ధి కలిగించిన పథకమిది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని, దాని ఆధారంగానే తమవైన కీలకమైన ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయని నేను గర్వంగా చెప్పగలను. 

తిరుగులేని దార్శనికత
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్నే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంగా రూపుదిద్ది దానిని మరిం తగా మెరుగుపర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప దార్శనికత ప్రాధాన్యతకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్‌ 2007లో ప్రారంభించినప్పుడు, అది బీపీఎల్‌ కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. రాజ కీయ ప్రత్యర్థులు ఎన్ని వివాదాలు రేపినప్పటికీ, ఆరోగ్యశ్రీ పథకం ఎంత గొప్పగా విజయవంతమై ప్రజాదరణ పొందిందంటే, విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరు మార్చినప్పటికీ కొనసాగించాల్సి వచ్చింది.  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వార్షికాదాయం 5 లక్షల రూపాయలకంటే తక్కువ ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయలవరకు ఆరోగ్య సంరక్షణ బీమాను అందించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఆరోగ్య కార్డు పొందుతారు. ఈ కార్డుతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులలో మెరుగైన ఆరోగ్య సేవలను వీరు పొందుతారు. 

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో సంపాదనపరుడైన వ్యక్తి అనారోగ్యంలో చిక్కుకుంటే అది కుటుంబం మొత్తానికి ఆదాయ నష్టమే కాకుండా తీవ్రమైన ఆర్థిక భారం కూడా పడుతుంది. ఇక ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కలిపినట్లయితే ఇది సంబంధిత కుటుం బానికి భారీ సమస్యను సృష్టిస్తుంది. అందుకే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆపరేషన్‌ పూర్తయ్యాక రోజుకు రూ. 225లు లేక నెలకు రూ. 5,000లను పూర్తి స్వస్థత చేకూరేవరకు రోగికి ఇవ్వడం అనేది ఈ పథకంలోని మరొక కీలకమైన అంశం. ఆసుపత్రుల్లోనే కాదు.. ఆరోగ్య శిబిరాలలోనూ ఈ పథకం కింద ప్రయోజనాలు పొందవచ్చు. ఇన్‌ పేషెంట్, అవుట్‌ పేషెంట్‌ యూనిట్లు రెండింటిలోనూ లబ్ధిదారులు నగదు రహిత సేవలను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాధులకు మాత్రమే కాకుండా, వాటికయ్యే చికిత్సకు కూడా ఈ పథకం హామీనిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ఇక ఆరోగ్య బీమాకు అందిస్తున్న మొత్తానికి సంబంధించి చూస్తే దాదాపు 13 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని ఆరోగ్యశ్రీ కల్పిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ యోజనలో అందిస్తున్న మొత్తం (రూ. 5 లక్షలు) కంటే చాలా చాలా ఎక్కువ.

కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ
కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించడంతో కుటుంబం మొత్తంగా తమకు కేటాయించిన బీమా మొత్తం నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను ఒక్క యాప్‌ ద్వారానే పొందవచ్చు. బీపీఎల్‌ పరిధిలోని వర్గంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలు ఇటీవలి కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ విని యోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుచేత, యాప్‌ను ప్రవేశపెట్టడం అనేది ఈ పథకానికి మరింత విలువను జోడించింది. పైగా ఇది సులభంగా అందుబాటులోకి వచ్చింది.

ఇటీవలికాలంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన విశిష్టమైన తోడ్పాటు ఏమిటంటే కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావానికి గురైన రోగులను కూడా దీంట్లో భాగం చేశారు. కోవిడ్‌–19 ప్రాణాంతక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టించింది.  వైద్య చికిత్స లేక ఆరోగ్య అత్యవసరాల విషయంలో కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచానికే సవాళ్లు విసిరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ఎత్తుక ఆర్థిక నష్టానికి కారణమైంది. ఈ ఆర్థిక సంక్షోభం విషయంలో భారతదేశానికి కూడా ఏమాత్రం మినహాయింపు లేదు.
నెలలపాటు నిరవధిక లాక్‌డౌన్‌ లేక పాక్షిక లాక్‌డౌన్‌ విధించడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆర్థిక మందగమనం తీవ్రస్థాయికి చేరుకుని అన్ని రంగాల ప్రజానీకంపై తీవ్రమైన ఒత్తిడి కలిగించింది. కాగా ఈ ఒత్తిడి ఆర్థికంగా బలహీన వర్గాలపై గరిష్ట ప్రభావం కలిగించింది. ప్రత్యేకించి రోజుకూలీలపై, కాంట్రాక్టు కార్మికులపై దీని ప్రభావం చెప్పనలవి కాదు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో పొరపాటున వైరస్‌ ప్రభావానికి గురైతే ఈ వర్గానికి చెందిన వారి జీవితాలు మరింత ధ్వంసం కాక తప్పదు.

వెనుకబడిన వర్గాల ప్రజలకు వరం
ఏదేమైనప్పటికీ, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్‌–19 చికిత్సను కూడా భాగం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు వరంలాంటిదనే చెప్పాలి. దేశంలోనే కోవిడ్‌–19 చికిత్సను రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కోవిడ్‌–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన ప్రజలు, వారితో కాంటాక్టులోకి వచ్చినట్లు అనుమానిస్తున్నవారికి కూడా ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని ఏపీలోనే అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1.42 కోట్లమంది ప్రజలు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పధకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. పదేళ్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆరోగ్యశ్రీ నిరుపమాన సేవలు అందించింది. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నాయుడి పాలనలో ఈ పథకం పేరు మార్చేయడమే కాకుండా దీంట్లో భాగంగా గతంలో అందించిన అనేక ప్రయోజనాలను కూడా తీసివేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని మొదట ప్రారంభించగా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ నమూనాను తమ తమ ప్రాంతాల్లో అమలు చేయడంపై ఆసక్తి చూపాయి. ప్రారంభించినప్పటి నుంచి అద్భుత విజయం సాధించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని విదేశాలు సైతం అధ్యయనం చేస్తూ వచ్చాయి. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం విశిష్టతకు ఇవి తిరుగులేని ఉదాహరణలు. రాబోయే రోజుల్లో సైతం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజల వ్యథలను తీర్చడంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ తనదైన గొప్పపాత్రను పోషిస్తుందని, దాని సేవలు మరింతగా విస్తరి స్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. 

విజయసాయిరెడ్డి 
వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత
జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈమెయిల్‌ : venumbaka.vr@sansad.nic.in

మరిన్ని వార్తలు