ఆధార్‌తో శర (అను) సంధానం

24 Dec, 2021 01:45 IST|Sakshi

సమకాలీనం

పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తు తున్నాయి. బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. మరోవైపు ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కరణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. తాజా అనుసంధానంతో పాటు ఎన్నికల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం.

దేశంలో ఎన్నికల సంస్కరణల మందకొడి తనానికి విరుద్ధంగా పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. ప్రవేశపెట్టాక నిమిషాల్లోనే లోక్‌సభలో ప్రక్రియ పూర్తయితే, ఉభయసభల్లో కలిపి 48 గంటల్లోనే బిల్లుకు ఆమోదం దొరికింది. చట్టసభల స్ఫూర్తి, సంప్ర దాయం, మర్యాదల్ని గాలికొదిలి సాధించిన ఈ వేగం మంచిదా? అన్న చర్చ తెరపైకొస్తోంది. ముసాయిదా అంశాల్ని సభల్లో చర్చించ కుండా, స్థాయీ సంఘానికి పంపాలన్న విపక్ష డిమాండ్‌ పట్టించు కోకుండా, విభజన వినతిని వినకుండా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక, బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ‘ఇది నిర్బంధమేమీ కాదు, ఓటర్ల ఐచ్ఛికం మాత్రమే!’ అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, బిల్లు లోని అంశాల్ని బట్టి ఇది పూర్తిగా ఐచ్ఛికం కాదని తెలుస్తోంది.

తప్పని సరి కాదంటున్నా, తగిన కారణాలుంటే తప్ప ఆధార్‌ అనుసంధాన పరచకుండా ఒక పౌరుడు కొత్తగా ఓటు నమోదు చేయలేడు, పాత ఓటరు పునరుద్ధరణా చేసుకోలేడన్నది బిల్లు మతలబు! ఆ ‘తగిన కారణాల్ని’ తర్వాత కేంద్రమే నిర్ణయిస్తుంది. దీనిపైనే విపక్షాలకు అభ్యంతరాలున్నాయి. ఒక పౌరుడు, ఆధార్‌ వివరాలివ్వదలచుకోనందునో, ఇవ్వలేక పోతున్నందుకో కొత్త ఓటరు నమోదును గానీ, పాత ఓటు పునరుద్ధరణను కానీ ఎన్నికల సంఘం నిరాకరించజాలదని కేంద్రం చెబుతోంది. ఈ విషయంలో కొంత అస్పష్టత, సందిగ్ధత ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన, బోగస్‌ ఓట్లు ఏరివేయటం వంటి లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన బిల్లు వివాదాస్పదమవడమే దురదృష్ట కరం! ఓటరు జాబితా–ఆధార్‌ అనుసంధానంతో పాటు, ఏటా 4 సార్లు విభిన్న గడువు తేదీలతో కొత్త ఓటర్ల నమోదు, సర్వీస్‌ ఓటర్ల విషయంలో ఇప్పుడున్న లింగ వివక్షను తొలగించడం వంటి మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. విస్తృత సంప్రదింపులు జరిపి, పార్లమెంటులో లోతైన చర్చకు ఆస్కారం కల్పించి ఉంటే ప్రజస్వామ్య స్ఫూర్తి నిలిచేది.

బహుళ నమోదులకు చెక్‌!
‘నీవు ఎక్కదలచుకున్న రైలు జీవితం కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్టు మన దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎప్పుడూ ఆలస్యమే! ఎంతోకాలం బాకీ పడ్డ తర్వాత కానీ అవి రావు. ఆలస్యంగా వచ్చి కూడా వెంటనే అమలుకు నోచుకోవు! ఒకే వ్యక్తి వేర్వేరు నియోజక వర్గాల పరిధిలో ఓటరుగా ఉంటున్న ఉదంతాలు దేశంలో కొల్లలు! విడతలుగా జరిగే ఎన్నికల్లో వీరు రెండేసి చోట్ల ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొడుతున్నారు. తెలుగు నాట ఇది తరచూ కళ్లకు కట్టేదే! పకడ్బందీగా దీన్ని పరిహరించి, ఒక వ్యక్తికి ఒకే ఓటును శాస్త్రీయంగా పరిమితం చేసే ఓటరు జాబితాల ప్రక్షాళనకి ఎన్నికల సంఘం–కేంద్రం పూనుకున్నాయి. ఓటరు జాబి తాని ఆధార్‌తో అనుసంధానించడమే ఇందుకు మేలైన పరిష్కారమని తాజా బిల్లు తెచ్చాయి.

పౌరసత్వం లేని వారూ ఓటర్లుగా ఉండటం పట్ల పాలకపక్షం బీజేపీకి అభ్యంతరాలున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, వంటి పొరుగుదేశాల నుంచి అక్రమంగా వచ్చిన, దేశపౌరులు కాని వారిని ఓటు బ్యాంకులుగా అనుభవించేందుకే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని పాలకపక్షం ఎదురుదాడి చేస్తోంది. విపక్షాలు మాత్రం, ఎన్నికల సంస్కరణల్లో కీలకమయ్యే బిల్లును కేంద్రం ఎందుకింత హడావుడిగా తెచ్చింది? అంటున్నాయి. తొందర వెనుక దురుద్దేశాల్ని శంకిస్తున్నాయి. అనుసంధానం తప్పని సరి కాదు, ఐచ్ఛికం అంటున్నప్పటికీ... వద్దనుకునే పౌరులు ఏ పరిస్థితుల్లో నిరాకరించవచ్చో బిల్లులో లేకపోవడం లోపం! పైగా, అందుకు ‘తగిన కారణాలు’ ఉండాలనటం, వాటిని కేంద్ర నిర్ణయానికి వదలటంపైనే సందేహాలున్నాయి. అలా నిర్ణయించే కారణాలు, పౌరుల అప్రతిహతమైన ఓటుహక్కును భంగపరచవచ్చన్నది భయం! ఈ అనుసంధానం వ్యక్తుల గోప్యత హక్కుకు విఘ్నమని, ఫలితంగా ఆధార్‌లో పొందు పరచిన పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగ మయ్యే ఆస్కారముందని వారు సందేహిస్తున్నారు.

ఆధార్‌ ప్రామాణికతపైనే..
దేశంలో కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రత్యేక గుర్తింపు కార్డు వ్యవస్థ ఏర్పరిచారు. 95 శాతానికి పైబడి జనాభాకు ఆధార్‌ ఇప్పించినప్పటికీ, నిర్దిష్టంగా దేనికీ తప్పనిసరి చేయలేని పరిస్థితి! అలా చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల్లో దుబారాను, దుర్వినియోగాన్ని నిలువరించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియకు పలుమార్లు ఎదురుదెబ్బలే తగిలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, వేరయ్యాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టినా, అర్ధంతరంగా ఆపాల్సి వచ్చింది. లక్షల్లో ఓట్లు గల్లంతవడం పట్ల పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆర్టీఐ దరఖాస్తులతో సమాచారం సేకరించినపుడు, ఈ ఓట్ల తొలగింపు–చేర్పు ప్రక్రియ ఇల్లిల్లూ తిరిగి జరిపింది కాదని తేలింది. రాజకీయ పక్షాల ప్రమే యంతో, ఎక్కడో కూర్చొని మూకుమ్మడిగా జరిపినట్టు ఆధారాలతో తప్పుల్ని నిరూపించడంతో, లోపాల్ని ఎన్నికల సంఘమే అంగీకరించాల్సి వచ్చింది. ‘ఇప్పటికిప్పుడు మేమైనా ఏమీ చేయలేమ’ని ఎన్నికల సంఘమే చేతులెత్తడం విమర్శలకు తావిచ్చింది.

ఈ దశలోనే, సుప్రీంకోర్టు కల్పించుకొని, సదరు ప్రక్రియ నిలుపుదలకు ఆదేశిం చింది. పైగా ఆధార్‌ సమాచార ప్రామాణికతపైనే ఎన్నో సందేహాలు న్నాయి. పౌరులు ఆధార్‌ నమోదు సమయంలో ఇస్తున్న సమాచారం సరైందా? కాదా? తనిఖీ చేసి, ధ్రువీకరించుకునే వ్యవస్థ ‘భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ’(యుఐడిఎఐ) వద్ద లేదు! ఈ లోపాన్ని అలహాబాద్, కలకత్తా హైకోర్టులతో పాటు వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా గుర్తించి, తప్పుబట్టాయి. అనుసంధానం వల్ల ఆధార్‌లోని పౌరుల వ్యక్తిగత సమాచారం వెల్లడై, రాజకీయ పక్షాలు ‘ప్రొఫైలింగ్‌’ చేసే ఆస్కారం ఉంటుంది. ఇది పౌరుల గోప్యతా హక్కుకు భంగం. తమ పరిధి ఓటర్లైన, ఏయే సామాజిక వర్గాల వారు, ఎలాంటి సంక్షేమ పథకాల కింద, ఎంతేసి లబ్ది పొందుతున్నారో అభ్యర్థులు, పార్టీలు తెలుసుకోవచ్చు! తద్వారా వారిని లక్ష్యం చేసి ప్రచారం జరుపడం, ప్రభావితం చేయడం, వశపరచుకోవడం వంటి అకృత్యాలకు ఆస్కారముంటుంది. ఇది పాలకపక్షాలకు సానుకూలాం శమై, పోటీదారుల మధ్య వివక్షకు తావిస్తుంది. లోగడ పుదుచ్చేరిలో ఇలా జరిగినపుడు చైన్నై హైకోర్టు తప్పుబట్టింది.

సంస్కరణలింకా నిగ్గుతేలాలి!
‘నోటా’ పోరాట యోధులు ఇప్పుడెక్కడున్నారో? ‘పోటీలోని అభ్యర్థు లెవరికీ తాను ఓటేయజాల’ అని చెప్పడమే నోటా! పెద్ద పోరాటం తర్వాత, సుప్రీంకోర్టు అనుమతితో  2013 నుంచి సంక్రమించిన ఈ ప్రక్రియ, ఇంకా నికర లాభాలివ్వలేదు. ఎన్నికల వ్యయాన్ని నియం త్రించే వ్యవస్థలన్నీ ఇప్పుడు నామమాత్రమయ్యాయి. ఎన్నికల సంఘం విధించే పరిమితికి మించి వ్యయం చేసే వారెందరో ఉన్నా, దొరకటం లేదు. ఆ కారణంగా ఎవరూ అనర్హులు కావటం లేదు. రాజకీయాల్లోకి నేరస్తులు రాకుండా అడ్డుకునేందుకు చేసిన సంస్క రణలు ‘నిర్దిష్టత’ కొరవడి నీరసిస్తున్నాయి.

కేంద్ర సమాచార కమిషన్, సుప్రీంకోర్టు చెప్పినా... తాము ‘పబ్లిక్‌ అథారిటీ’ కాదని రాజకీయ పక్షాలు చేస్తున్న పిడివాదంతో పారదర్శకత లోపించి పార్టీలపరమైన సంస్కరణలు కుంటుపడుతున్నాయి. ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజా స్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కర ణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. సగటు ఓటరుకు ఎన్ని కలపైనే విశ్వాసం సడలుతోంది. తాజా అనుసంధానంతో పాటు ఎన్ని కల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం.


- దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు