డెమోక్రసీ ‘నాల్గవ స్తంభం’లో పగుళ్లు!

18 Aug, 2020 04:10 IST|Sakshi

పత్రికా స్వేచ్ఛ అనేది వ్యాపార స్వేచ్ఛలో భాగమైపోవడమే అత్యంత విస్మయకరం, విచా రకరం. పత్రిక అనేది ఒక వ్యాపారం కానప్పుడే అది స్వేచ్ఛగా ఉన్నట్టు లెక్క. అందుకే అది వ్యాపారానికి దూరంగా ఉండాలి. – కారల్‌ మార్క్స్‌  (లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌) 

అనుమాన పిశాచమనే నీడలో హేతువు, రుజువు, కారణం నిలవవు, ఓడిపోతాయి. న్యాయం చచ్చిపోతుంది. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తాము ఏదో ఎదిగిపోవాలన్న తొందరలో అర్థసత్యాలతో ఏపగింపు కల్గిస్తూ అవే అంతిమ సత్యాలుగా పాఠకులపై రుద్దేస్తూ తమ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుంటారు. ఈ తెచ్చిపెట్టుకున్న దురద పనికిమాలిన చిల్లర మల్లర చెత్త పత్రికలకు వర్తిస్తుందే గానీ ఉత్తమ ప్రమాణాలతో నడిచే గొప్ప పత్రికలకు వర్తించదు. దేన్ని బడితే దాన్ని, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేవారు మసాలా కబుర్లలో ఆనందం పొందే బాపతు మాత్రమే, ఏది నిజమో, ఏది కట్టుకథో తేల్చుకోలేని వారు మాత్రమే తాత్కాలిక ఆనందానికి లోనవుతారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వాలను నర్మగర్భంగా, ముసుగువేసి నాశనం చేయడానికి అత్యుక్తులు రాసి సెన్సేషనలిజం ద్వారా సర్క్యులేషన్‌ పెంచుకునే ధోరణి– ఉత్తమ ప్రమాణాలు గల పత్రికలకు పడదు. పచ్చి అబద్ధాలను ఎదుర్కో వడమూ ఆ క్రమంలో కష్టసాధ్యమే. అందుకే ఉత్తమ ప్రమాణాలు గల పత్రికల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇదే క్షమించదగిన జర్నలిజా నికి, క్షమార్హంకాని జర్నలిజానికి మధ్య ఉన్న తేడా. – జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌ (ఫ్రమ్‌ బెంచ్‌ టు ది బార్‌ పేజీ. 210)

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మానవాళికి ఎన్ని రకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించిందో అంతకన్నా మించిన అనర్థాలను కూడా బలవంతంగా రుద్దుతోంది. యాప్‌లు, వాట్సాప్‌లు, లింకులు, వెబ్‌ లింకులు, మొబైల్స్, సూట్‌ కేసులో ఇమిడిపోయే కూపీ (ట్రాకింగ్‌) వ్యవస్థలూ, ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు (పాత టెలిగ్రామ్‌ భాషను అప్పటికప్పుడు ఆధునికంగా వండివార్చే, బాజా సాధనం) ఇలా సవాలక్ష ముమ్మరిస్తున్న దశలో ఉన్నాం. జుకర్‌ బర్గ్‌ రంగంలోకి వచ్చి ఫేస్‌ బుక్‌ అనే కూపీ వ్యవస్థను నర్మగర్భంగా రంగంలోకి  దించి దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను దేశాల ప్రయోజనాలకు విరు ద్ధంగా దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు. ఆ మాటకొస్తే ఒకప్పుడు చైనీయులపైన నల్లమందు చల్లి, నల్లమందు భాయిలుగా బ్రిటిష్‌ వాడు ప్రచారం చేసినట్లే జుకర్‌బర్గ్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో ఫేస్‌ బుక్‌లో నమోదు చేసి అమెరికా, బ్రిటన్‌ మాళిగల్లో నిర్లిప్తంచేసి పెట్టాడు. అలా అని బీజేపీ పాలకులు జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ మనకే ఉపయోగిస్తుందని మురిసిపోయే సమయానికి మన పాలకుల గుట్టు మట్టుల్ని కూడా ఫేస్‌బుక్‌లో నిక్షిప్తం చేసేసరికి పాలకులు లబోదిబో మంటున్నారు. ఈ బాగోతం కాలిఫోర్నియాలో మన ప్రధాని హుషా రుగా జుకర్‌బర్గ్‌ను కలుసుకుని కరచాలనం చేసినంత సేపు పట్టలేదు.

ఇప్పుడు బీజేపీ వారు జుకర్‌బర్గ్‌ బీజేపీ రహస్యాలను ప్రైవేట్‌ వ్యాపార ప్రయోజనాల్లో భాగంగా ఫేస్‌బుక్‌ ద్వారా బట్టబయలు చేస్తున్న దశలో ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడు తున్నారు. మనం చైనాపై ‘గుర్రు’తో డజన్లకొద్దీ టిక్‌ టాక్‌లను, అప్పో లను నిషేధించినట్లు ప్రకటించుకున్నా అమెరికాతో మనకు పైన వేసు కున్న లింకుల వల్ల జుకర్‌బర్గ్‌ను వదిలించుకోలేము. అమెరికాలో జూకర్‌బర్గ్‌ బంధించి ఉంచిన మన ఫోన్‌ నంబర్లనూ విడుదల చేయించుకోలేని దుస్థితి ఈ సాంకేతిక ఉచ్చు మనచుట్టూ బిగియడానికి కారణం.. మన  సర్వర్ల ‘బిస’ అంతా అమెరికాలోనే ఉండటం! ఆంధ్ర ప్రదేశ్‌లో టెక్నాలజీ మాయ చాటున కొన్ని తొత్తు పత్రికలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు రాష్ట్ర న్యాయ వ్యవస్థనూ కూడా అబద్ధాల అల్లికతో అభాసుపాలు చేయడానికి సంకల్పించి తప్పుడు కథనాలకు తెరలేపుతున్నాయి. న్యాయవ్యవస్థకూ చట్టబద్ధంగా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గండికొట్టి, అడుగువూడిన పాత పాలకులకు ప్రాణప్రతిష్ట చేయాలన్న తాపత్రయంకొద్దీ ‘న్యాయదేవతపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా’ అంటూ అశరీరవాణి కథనాలు అల్లుతోంది: ఒక్క దానికీ రుజువులు లేవు.

పైగా రాష్ట్ర హైకోర్టు పేరును దుర్వినియోగపరుస్తూ, అలాంటి అలవాటులోనే ఉన్న ఆ ‘కెప్ట్‌ ప్రెస్‌’ అల్లిన కథనం అంతా ఆధునిక టెక్నాలజీ మెలకువలన్నింటినీ దుర్వినియోగం చేసి, ఆ కథనానికి తానే కర్త, కర్మ, క్రియగా మారిన మాస్టర్‌ అల్లిక అది. ఆ పత్రిక అల్లికల్లోని అంశాలు స్థూలంగా: ‘న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్‌? వెబ్‌లింక్‌ ద్వారా మొబైల్‌పై వల; వాట్సాప్‌ సందేశాలపైన నియంత్రణ, చదవక ముందే రీడింగ్‌మోడ్‌ లోకి, మాటల్లో అస్పష్టత, సమస్యలపై సాంకేతిక నిపుణులతో పరీక్ష, నెట్‌వర్క్‌ మొబైల్‌ మాత్రం బాగుందని నిర్ధారణ– అయినా అంతు చిక్కని ఇబ్బందులు అయినా నిఘాయే కారణమని అనుమానం, సూట్‌కేసులో ఇమిడిపోయే ట్రాకింగ్‌ వ్యవస్థ’ వల్ల ‘ఆధునిక టెక్నాలజీతో ఈ పనులన్నీ అత్యంత సులభమని’ ఆ కథనం సారాంశం. ఆ మొత్తం కథనం అంతా ఆధారపడింది వాస్తవాలపైన కాదు, పూర్తిగా ‘సొంత డబ్బా’పైననే! ‘న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు దోచేవాడూ ఒకటే’నన్న జగమెరిగిన మన తెలుగు సామెత. ఆ మాటకొస్తే అబద్ధం అంటేనే అతుకులమూట అనీ, అల్లిన కథనం దాచినా దాగని సత్యమనీ ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నిజానికి ‘న్యాయదేవతపై నిఘా’ వేసే తెలివితేటలు గాడితప్పి వ్యవహరిస్తున్న నడమంత్రపు పాత్రికేయులకు తప్ప వృత్తి ధర్మాన్ని, ప్రమాణాలను పాటించే వారికి ఉండజాలవు.

రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో వైఎస్‌ జగన్‌ తనకు మించిన దీటైన పోటాపోటీతో తలపడి ‘ఢీ’కొనగల సత్తా ఉన్నవాడని భావించినందునే లోలోన టీడీపీ అధినేత చంద్రబాబు కుమిలిపోయాడు. అందుకే తప్పుడు ఆరోపణల పైన కుట్ర ద్వారా 16 మాసాలపాటు జైలుపాలు చేశాడని లోకానికి తెలిసి పోయింది. అయినా గత ఆరేళ్లకుపైగా సీబీఐ స్పెషల్‌ కోర్టులూ ఎంతసేపు ‘ఏవి మీ ఆధారాలు’ అని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజుదాకా జగన్‌పై కేసులు అలా కొనసాగడం రాజ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థల్లో చెండితనానికి నిదర్శనం కాదా? అంతేగాదు, చివరికి ‘ఆదాని శాసిస్తాడు/మోదీ పాటిస్తాడు/ జగన్‌ జైలుకు, భార్య భారతి ముఖ్యమంత్రి కుర్చీపైకి’ అనేంతగా పాత్రికేయ అజ్ఞాని బరి తెగించడాన్ని ఇతరులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా సహించరానిది. దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును గమని స్తున్న వారికి గత 70 ఏళ్లలో మన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ‘నాలుగు స్తంభాల’లో ఒకటైన పత్రికా వ్యవస్థతో పాటు మిగతా మూడు వ్యవస్థలు కూడా క్రమక్రమంగా ఎలా బీటలిచ్చి పోతు న్నాయో గమనించాల్సిన పరిణామం.

దీనికి కారణం– ఈ రాజ్యాంగ వ్యవస్థలేవీ రాజ్యాంగం నిర్దేశిం చిన మౌలిక లక్ష్యాలకు కట్టుబడకుండా గాడితప్పి నడుచుకొంటు న్నాయి. బహుశా అందుకనే సు్రçపసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్య కొన్ని విషయాలను ఇలా బాహాటంగా చెప్పగలిగారు: ‘న్యాయమూర్తులుగా పదవీ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞకు అర్థం– రాజ్యాంగం నిర్దేశించిన సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య రాజకీయాలను పాటిస్తానని. ఇదెలా సాధ్యం? న్యాయమూర్తులకు రాజకీయ సిద్ధాంత తాత్వికత అనివార్యం. న్యాయమూర్తుల నియా మకం రాజ్యాంగం ప్రకారం జరిగిందిగానీ రాజ్యాంగానికి అతీతంగా జరగలేదు గనుక ఈ సైద్ధాంతిక నిబద్ధత అనివార్యం. ఒక కోటీశ్వ రుడు– మురికివాడల్లో నివసించే పేదవాడి ముందు నిలబడి నాకు రాజకీయాలు లేవు అని చెబితే అతణ్ణి మీరు నమ్ముతారా? అలాగే ఒక కార్మిక సంఘం నాయకుడు తన పారిశ్రామిక యజమాని ముందు నిల బడి నాకు రాజకీయాలు లేవంటే అది ఒట్టి తొండిమాట. రాజకీయా లున్నంత మాత్రాన వ్యక్తి న్యూనతగా భావించుకోరాదు. ‘నాకు రాజ కీయం’ లేదని దాచటం నేరం. మనం మనసిచ్చి భోళాగా మాట్లా డదాం. ఇతర వృత్తులలో ఉన్నవారి మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా రాజకీయాలుంటాయి. కానీ, న్యాయ ప్రక్రియ అనేది మాత్రం కులాలకు, వర్గాలకు, సమూహాలకు అతీతం’! 

అంతేగాదు, కోర్టు ధిక్కార నేరాధికారాన్ని కోర్టు సమర్థించు కోవాలంటే, జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో కోర్టు తన ‘ధిక్కార ప్రయోగా’న్ని సమర్థించడం సబబ వుతుందని జస్టిస్‌ బ్లాక్‌ (1943) నిర్ధారించాడు. అలాగే కోర్టు తీర్పును సదుద్దేశంతో విమర్శించే ఎవరినీ తప్పుబట్టరాదనీ, అలాంటి విమర్శ సామాన్యుడి హక్కు అనీ ప్రివీకౌన్సిల్‌లో ఏనాడో లార్డ్‌ అడ్కిన్‌ ప్రకటిం చాడు. అంతేగాదు, నిజం చెప్పాలంటే, వార్తా పత్రికల్లో వచ్చే విమ ర్శలవల్ల వృత్తి నైపుణ్యంగల ఏ న్యాయమూర్తీ ప్రభావితుడు కాడని క్వీన్స్‌ కౌన్సిల్‌ సీనియర్‌ సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్‌ డెన్నింగ్‌ స్పష్టం చేశాడు. మీడియాలో వచ్చే విమర్శలకు ఏ న్యాయ మూర్తీ ప్రభావితం కాకనక్కర్లేదనీ, వాటిని వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందు లుగానే భావించి న్యాయమూర్తులు కూడా ప్రజల విమర్శను శిరసా వహించడం ధర్మమని లార్డ్‌ సాల్మన్‌ ప్రకటించాడు. అన్నింటికన్నా ‘కోర్టు ధిక్కార నేరం’ అనే ఆరోపణల గురించి లార్డ్‌ డెన్నింగ్‌ ఒక శిలా శాసనంగానే లభించిన పరిపక్వమైన వాక్యాలను ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తలు తరచుగా పేర్కొనడాన్ని మనం మరచిపోరాదు. 

‘ఈ కోర్టు ధిక్కారమనే మన అధికారాన్ని మన న్యాయమూర్తుల సొంత గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించరాదు. స్పష్ట మైన సాక్ష్యంమీదనే ధిక్కార నేరం మోపాలి. అంతేగానీ మనను విమ ర్శించే వారిని అణచడం కోసం ఈ అధికారాన్ని వినియోగించరాదు. మనం విమర్శకు భయపడరాదు, విమర్శను వ్యతిరేకించరాదు. కానీ అంతకన్నా మనం కోల్పోయే అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన స్వేచ్ఛ ఒకటుంది– అదే భావప్రకటనా స్వేచ్ఛ. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన సరసమైన వ్యాఖ్య, భోళా విమర్శ చేసే హక్కు పార్లమెంటులోనూ, బయటా, పత్రికల్లోనూ, టీవీలలోనూ పౌరులకు ఉంది. మా ప్రవర్తనే అంతిమ సాక్ష్యంగా నిలబడాలి. అంతే గానీ, చుట్టూ చెడు జరుగుతుంటే మౌనంగా ఉండిపోవటం మార్గం కాదు’ అలా అని, పత్రికలు తమ సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛతో ఇతరులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేయటానికి పూనుకోవటం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే నని డెన్నింగ్‌ ప్రకటించాడు. అందుకేనేమో క్యూబా విప్లవ నేత ఫిడెల్‌ క్యాస్ట్రో అత్యంత స్పష్టంగా హెచ్చరించిపోయాడు– ‘నా ఒక్కడివల్లే, దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అని!!


వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌

మరిన్ని వార్తలు