సెక్షన్‌ 164: అక్కడ చెబితే... అంతా నిజమేనా?

3 Dec, 2021 13:27 IST|Sakshi

కొద్ది రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాలలో పనికట్టుకొని సెక్షన్‌ 164, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, 1973 మీద విస్తృత చర్చలు నడుపుతున్నారు. ప్రజలలో తప్పుడు అపోహలు కలిగిస్తూ రాజకీయ దురుద్దేశంతో కొందరి వ్యక్తిత్వ హననం చేయడానికి పాటుపడుతున్నారు. సెక్షన్‌ 164(1) అనేది నేర ఒప్పుదల, రికార్డు చేసే ప్రక్రియ: ఈ ప్రక్రియలో, జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ తన పరిధిలో ఉన్న లేక తన పరిధిలో లేని నిందితుడిని దర్యాప్తు అధికారి అభ్యర్థన మేరకు, నేర ఒప్పుకోలు, ఇతర కథనాలను రికార్డు చేస్తారు. దీనిని రికార్డు చేసేటపుడు, మేజిస్ట్రేట్, నిందితుడిని సవివరంగా నేరం ఒప్పుకోవాల్సిన ఆగత్యం లేదని, తాను ఇస్తున్న ప్రకటన అతడికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని లె లుపుతారు. ఆ మేరకు మేజిస్ట్రేట్‌ తన సంతకంతో స్టేట్‌మెంట్‌ను ముగిస్తారు. అయితే, కొన్ని మీడియాలలో వస్తున్న కథనాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. 

సెక్షన్‌ 164లో పేర్కొన్నది అంతా వాస్తవ మని, దీనిని కోర్టులు వాస్తవ సాక్ష్యంగా పరిగణిస్తాయని చెబుతూ కావాలని కొందరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి, అత్యధిక కేసుల్లో 164 స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నది నిజం కాదని, వాస్తవాలకు దూరంగా ఉంటుందని, కేసును తప్పుదారి పట్టించడానికి ఇచ్చినదిగా కూడా రుజువైంది. దీనికి ఉదాహరణ– ఆయేషా మీరా కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత, ముద్దాయి సత్యంబాబు తాను చెల్లి పెండ్లి కోసం ఆర్థిక సహాయం పొంది తప్పుడు నేరం ఒప్పుకోలు ఇచ్చినట్లు గౌరవ హైకోర్టు అప్పీలులో మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇది రుజువై, సత్యంబాబు నిర్దోషిగా బయటకి వచ్చారు. కాబట్టి, నిందితుడు అబద్ధాలు, అవాస్తవాలను రికార్డు చేసే అవకాశాలుంటాయి. సెషన్స్‌ కోర్టుల్లో రుజువైంది.

సెక్షన్‌ 164 స్టేట్‌మెంట్‌ని కోర్టులలో తారుమారు కాని, మార్పు/ సవరణకు వీలు లేని సాక్ష్యంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నో కేసులలో అప్రూవర్‌గా మారిన నిందితుడి స్టేట్‌మెంట్‌ సత్య నిరూపణకు విరుద్ధంగా ఉంటున్నాయి. సెక్షన్‌ 164(1) అనేది స్వచ్ఛందంగా నిందితుడి నేర ఒప్పుకోలు లేదా అప్రూవర్‌గా మారిన నిందితుడు, మేజిస్ట్రేట్‌ ముందు ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా, పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇచ్చే స్టేట్‌మెంట్, ఇది పూర్తి వాస్తవ సాక్ష్యం అయిపోదు. అంతేకాని, మీడియా మాధ్యమాల్లో ఇటువంటి క్రిమినల్‌ ట్రయల్‌ చేయడం చట్టపరంగా నేరం. పైగా సమాజానికి చాలా ప్రమాదకరం.


- పొనకా జనార్దన్‌ రెడ్డి 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి 

మరిన్ని వార్తలు