ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?

18 Aug, 2022 00:27 IST|Sakshi

అభిప్రాయం

భారత స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం. బ్రిటిష్‌ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్‌ 15న బ్రిటిష్‌ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు?

వలస వాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు దాదాపు నూట యాభై ఏళ్ళు సాగించిన మహోజ్జ్వల పోరాటాల ధారలో ఒక మజిలీ 1947 ఆగస్ట్‌ 15. ఆ విస్తృత పోరాట సంప్రదాయం ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క ప్రజా సమూహానిదో, ఏ ఒక్క నినాదానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క ఆశయానిదో కాదు. అది ఈ దేశ ప్రజలందరూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కావాలనే విశాల ఆశయానిది! పద్ధెనిమిదో శతాబ్ది చివరి నుంచే ఆదివాసులు ప్రారంభించిన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలూ; రైతుబిడ్డలైన సైనికులూ, రైతాంగమూ, సంస్థానాధీశులూ, రెండు ప్రధాన మతాలకూ చెందిన ప్రజలందరూ ఐక్యంగా పాల్గొన్న ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమూ; ఆ తర్వాత ముప్ఫై సంవత్సరాలకు ప్రారంభమైన మధ్యతరగతి జాతీయోద్యమమూ, ఇరవయ్యో శతాబ్ది తొలి అర్ధభాగంలో సాగిన ఎన్నో విప్లవోద్యమాలూ, భిన్నమైన రాజ కీయ ఉద్యమాలూ, ఆ ఉద్యమాలలో పాల్గొన్న అన్ని ప్రజాసమూ హాలూ, అన్ని ప్రాంతాలూ... జాతీయోద్యమంలో భాగమే.

అది ప్రధా నంగా బ్రిటిష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. చాలాచోట్ల అది స్థానిక భూస్వామ్య దోపిడీ, పీడనలను కూడా వ్యతిరేకించిన ఉద్యమం. భారత సమాజం అనుభవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం అది.

బ్రిటిష్‌ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్‌ 15న బ్రిటిష్‌ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఈ ఏడున్నర దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి గణాంకాలు చూపి, ‘‘స్వతంత్ర భారత ప్రగతి’’ గురించి చెప్పడానికి అవకాశం ఉంది. భారత ఉపఖండంలోని ఇరుగు పొరుగు దేశాలలో ప్రజా స్వామ్యం అనుభవించిన అవాంతరాలను చూపి, భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదనే అవకాశమూ ఉంది. వలసానంతర భారత సమాజ గమనాన్ని అర్థం చేసుకోవ డానికీ, విశ్లేషించడానికీ ఎన్నో సూచికలూ ప్రాతిపదికలూ ఉన్నప్పటికీ, ప్రగతి, ప్రజాస్వామ్యం అనే రెండు సూచికలే కీలకమైనవి. 

బ్రిటిష్‌ వలస పాలన తొలగిపోవాలని భారత ప్రజలు కోరు కోవడానికీ, ఉద్యమించడానికీ మూల కారణం వలసవాదం భారత సంపదలను దోచుకుపోతున్నదనే అవగాహన. విస్పష్టమైన గణాం కాల ఆధారంగా దాదాభాయి నౌరోజీ 19వ శతాబ్ది చివరి రోజుల్లో ప్రతిపాదించిన ‘వనరుల తరలింపు’ సిద్ధాంతాన్ని దాదాపుగా జాతీయోద్యమంలోని అన్ని పాయలూ అంగీకరించాయి. భారత సమాజ వనరులతో స్థానికంగా సంపద పోగుపడడానికీ, తద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధి జరగడానికీ వలస పాలన అవకాశం ఇవ్వడం లేదని జాతీయోద్యమ నాయకులందరూ భావించారు. వలస పాలన భారత సమాజ అభివృద్ధిని అడ్డుకుంటున్నదనీ, అందువల్ల దాన్ని తొలగించి స్వరాజ్యం సాధించినప్పుడే స్వతంత్ర, భారత ప్రజా ప్రభుత్వం భారత వనరులను స్థానికాభివృద్ధికి వినియోగించగలుగు తుందనీ జాతీయోద్యమం భావించింది. 

75 ఏళ్ళ క్రితం వలస పాలకులు వెళ్లిపోయారు. భారత ప్రజల మైన మనం మన స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రణాళికా బద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని రచించుకున్నాం. కుంటుతూనో, నడుస్తూనో, పరుగులతోనో పన్నెండు ప్రణాళికలు అమలయ్యాయి. ప్రణాళిక అంటేనే సోషలిజం చిహ్నమేమో అని భయంతో గంగ వెర్రులెత్తే రాజకీయపక్షం అధికారం సాధించి, ప్రణాళికా సంఘాన్నీ, ప్రణాళికలనూ రద్దు చేసి పారేసి ఏడేళ్ళు గడిచాయి. ప్రణాళిక లేకుం డానే భారతదేశాన్ని పరివర్తన చెందిస్తానని కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. అనేక గ్రంథాలు కాగలిగిన ఈ సుదీర్ఘ చరిత్రలో భారత సమాజం సాధించిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎంత? 

జాతీయాదాయం 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 140 లక్షల కోట్ల రూపాయలకు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 5 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు, ఎగుమతులు ఒక బిలియన్‌ డాలర్ల నుంచి 38 బిలియన్‌ డాలర్లకు, రోడ్డు మార్గాలు 4 లక్షల కి.మీ. నుంచి 64 లక్షల కిలోమీటర్లకు పెరిగాయని... అటువంటి గణాంకాలతో మనం సాధించిన ప్రగతి గురించి చెప్పుకోవచ్చు. కానీ నాణానికి ఈ బొమ్మతో పాటే బొరుసు ఉంది. ఇక్కడ ఎన్నో రెట్లు పెరిగినట్టు కనబడుతున్న అంకెల పొట్ట విప్పి చూస్తే ఆ పెరుగుదలలోని ఒడుదొడుకులు బయట పడతాయి. ఉదాహరణకు జాతీయాదాయం లెక్కలో ఒక వంద మందిని మినహాయిస్తే, హఠాత్తుగా మన జాతీయాదాయం సగానికి పడిపోతుంది. ఆ వందమంది ఆదాయం 55  కోట్ల మంది ఆదాయం కన్నా ఎక్కువ.

అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఆరు రెట్లు పెరుగు దల, జనాభా పెరుగుదల నాలుగు రెట్ల కన్న తక్కువే ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో ఆకలిచావులు, అర్ధాకలి కొనసాగుతూనే ఉన్నాయి. ఎగుమతుల్లో 38 రెట్ల పెరుగుదల కనబడుతున్నప్పటికీ,  దిగుమ తులు ఇదే కాలంలో ఒక బిలియన్‌ డాలర్ల నుంచి 60 బిలియన్‌ డాలర్లకు పెరిగి, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా హెచ్చింది. ఎగుమతి దిగుమతుల వ్యత్యాసం 2 కోట్ల రూపాయల నుంచి 20 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ 75 ఏళ్ళలో ఆర్థిక, సామాజిక అసమానతలు, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలు గణనీయంగా మారలేదు. ఏ ఒక్క అభివృద్ధి గణాంకం తీసుకున్నా, ఆ వెలుగు వెనుక పెనుచీకటి కనబడుతూనే ఉన్నది. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు?

అంత మాత్రమే కాదు, ఆ నాడు ఒక్క బ్రిటన్‌కు వలసగా ఉన్న భారతదేశం ఇవాళ, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక పెట్టుబడిదారీ దేశాలకు ముడిసరుకులు అందించే వనరుగా, వాళ్ల సరుకులు అమ్ముకునే మార్కెట్‌గా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులకూ, దిగుమతుల కోసం ఆధారపడిన అన్ని దేశాల అవమా నకర ఆదేశాలకూ తలొగ్గి, సార్వభౌమాధికారాన్నే పలుచబరచుకునే స్థితి వచ్చింది. ఆధునికత, విద్య, రవాణా, సమాచార సంబంధాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాలలో అంకెల్లో మాత్రమే చూస్తే బ్రిటిష్‌ వలస పాలన కూడ ఇటువంటి ప్రగతి సాధించినట్టే కనబడు తుంది. కానీ, సుపరిపాలన ఉన్నా సరే, స్వపరిపాలనకు ప్రత్యా మ్నాయం కాదు అని జాతీయోద్యమం కోరుకుంది.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలనీ, పరాయి పాలన పీడన తొలగిపోవాలనీ కోరుకుంది. సంపద తరలింపు గురించి మాట్లాడిన నౌరోజీయే ‘‘బ్రిటిషేతర పాలన’’ అన్నాడు. అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం వంటి నినాదాల పుట్టుకకు కారణమైన పెట్టుబడిదారీ విధానం వలస వాదంగా, సామ్రాజ్యవాదంగా మారి, ఆ నినాదాల స్ఫూర్తిని వదిలేసి, తమ వలస ప్రజలకు స్వేచ్ఛ లేని స్థితి కల్పించిందని అర్థం. ఆర్థికాభివృద్ధి కన్నా ముఖ్యం స్వాతంత్య్రం అని సాగిన జాతీయోద్యమం 1947 ఆగస్ట్‌ 15న ఆ స్వాతంత్య్రాన్ని సాధించానని భావించింది. 

కానీ, ఆ తరువాతి ఇన్నేళ్ళ చరిత్రను అవలోకిస్తే, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే విశాల భావనను ఐదు సంవత్సరాలకు ఒకసారి మొక్కుబడిగా జరిగే ఎన్నికలకు కుదించారు. ఆ ఎన్నికలు అక్రమాలకు నిలయాలయ్యాయి. ఒకసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఐదేళ్ళలో ఏమైనా చేసే అధికారం చేజిక్కుతున్నది. ప్రభుత్వాధికారం వ్యక్తిగత సంపదలు పెంచుకునే సాధనంగా మారిపోయింది. ఉదాత్తంగా రాసుకున్న రాజ్యాంగ ఆదేశాల అమలు కన్నా ఉల్లంఘన ఎక్కువ జరుగుతున్నది. ప్రజా భాగస్వామ్యంతో నడవవలసిన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌన సాక్షులుగా మిగిలి పోయారు. బహుళత్వానికి నిలయమైన దేశంలో నెలకొనవలసిన, బలపడవలసిన పరస్పర సహాయ సహకార సంఘీభావాల స్థానంలో కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాల రాజకీయాలు చెలరేగి సమాజ అస్తిత్వమూ, భవిష్యత్తూ ప్రమాదకర స్థితికి చేరాయి. వలస పాలకులు తయారు చేసిన న్యాయవ్యవస్థ, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి స్వల్పమైన మార్పులతో కొనసాగుతున్నాయి.

వలస పాలకులు సృష్టించిన రాజద్రోహ నేరం ఇప్పటికీ అట్లాగే ఉంది. జాతీయోద్యమం తీవ్రంగా వ్యతిరేకించిన రౌలట్‌ చట్టాన్ని మించిన దుర్మార్గమైన ప్రజావ్యతిరేక చట్టాలు లెక్కలేనన్ని స్వతంత్ర భారత పాలనలో అమలులోకి వచ్చాయి. ‘దేశమనియెడు దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి/ నరుల చమటను తడిసి మూలం/ ధనం పంటలు పండవలెనోయి’ అని గురజాడ అప్పారావు ‘దేశభక్తి’ గీతంలో రాసి నప్పుడు మొదటి రెండు పంక్తులు ప్రజాస్వామ్యానికీ, బహుళత్వ సామరస్యానికీ , చివరి రెండు పంక్తులు సంపద అభివృద్ధికీ, సమాన పంపిణీకీ సూచనలు. ఈ 75 ఏళ్లలో భారతదేశం అనే దొడ్డ వృక్షం ఎన్నో పూలు పూసింది, ఫలాలూ ఇచ్చింది, నరుల చెమటతో ధనం పంటలూ పండించింది. కానీ ఆ ప్రగతి ఫలాలు దక్కిందెవరికి? ఆ ధనం నింపిన బొక్కసాలెవరివి అనే ప్రశ్నలు ఇంకా భారత సమాజం ముందు నిలిచే ఉన్నాయి.


ఎన్‌. వేణుగోపాల్‌
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు