చంద్రబాబుకు బోయీలుగా...

30 Dec, 2021 12:56 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజలు తిరస్కరించిన ‘అమరావతియే ఏకైక రాజధాని’ అనే నినాదాన్ని అడ్డుగా పెట్టుకొని మరోసారి సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలు తెలుగుదేశంకు తోకగా మారడానికి తహతహలాడు తున్నాయి. ఆశ్చర్యమేమంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మళ్లీ తెలుగుదేశం వైపు చూడటం. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు, విశ్వాసాలకు పాతర వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేతులు కలపడం కంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదని తెలిసినప్పటికీ... చంద్రబాబు ఆడే రాజకీయ జూదంలో పావులవడానికి ఈ పార్టీల నేతలు సిద్ధపడటమే విశేషం!

చంద్రబాబు చెప్పిన మాటలు, చూపించిన గ్రాఫిక్స్‌ నమ్మి భూములిచ్చి మోసపోయిన అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యం. పైగా, గత రెండేళ్లుగా ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తూ అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని పంతం పట్టి దీక్షలు చేశారు. అందులో భాగంగా టీడీపీ ‘అన్నీతానై నడిపించిన అమరావతి రైతుల ఐక్యవేదిక’ తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుకు కుడిఎడమలలో ఘనత వహించిన కామ్రేడ్‌లు, కాషాయధారులు, కాంగీయులు ఆసీనులై భవిష్యత్తులో తాము వేయబోయే రాజకీయపు అడుగులేమిటో చెప్పకనే చెప్పారు. (చదవండి: వితండవాదం ఆపండి... ప్లీజ్‌!)

బీజేపీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో అంతుపట్టదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తించమని కూడా పార్లమెంటులో స్పష్టంగా చెప్పింది. ఇదంతా రికార్డుల్లో పదిలంగా ఉంది. పైగా, ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉండి రాజకీయ కారణాల వల్ల బయటకొచ్చాక ఆనాడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ‘విలన్‌’గా చిత్రీకరించి లబ్ధి పొందడానికి ఎంతగా దిగజారాడో బీజేపీ నేతలకు తెలియనిది కాదు. వంద మంది నరేంద్ర మోదీలు కలిసి వచ్చినా తాను ఎదుర్కోగలనని సవాల్‌ విసిరారు. పాపం రాష్ట్ర బీజేపీ నేతలకు మతిమరుపు కాబోలు, ఆ అవమానాలను మరచిపోయి చంద్రబాబు పల్లకీకి బోయీలుగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు.

ఇక, రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ పోషిస్తున్న పాత్ర దారితప్పిన బాటసారి వ్యవహారాన్ని తలపిస్తుంది. కమ్యూనిజం పనైపోయింది... టూరిజం ఒక్కటే మిగిలిందన్న చంద్రబాబు వద్దకు కమ్యూనిస్టులు నిజంగానే టూరిస్టుల్లా ‘క్యూ’ కట్టారు. అలాగే కాంగ్రెస్‌ వ్యవహార శైలి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం గమనించదగింది. ఒకవైపు బీజేపీతో చెలిమికట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు గేలం వేయడం చంద్రబాబు చాణక్య నీతిలో మరో కోణం. (చదవండి: ‘రియల్‌’ ప్రయోజనాలకే అమరావతి)

తెలుగు సినిమాల్లో హీరో పాత్రలు పోషించే పవన్‌ కళ్యాణ్‌... రాజకీయాల్లో మాత్రం గొప్ప కామెడీ పండిస్తున్నారు. ‘‘నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కును అమ్మేయదలుచుకొంటే... 5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి అమ్మాలి జగన్‌ రెడ్డి గారు?’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనన్న స్పృహ లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమేనని గత ఏడేళ్ల నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం 126 లక్షల కోట్లకు పెరిగిన విషయం ఆయనకు ఎవరు చెప్పాలి? ఒకప్పుడు తను ఆదర్శంగా తీసుకొన్న (ఇప్పుడు కాదనుకొంటా) తరిమెల నాగిరెడ్డి ఏనాడో ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాశారని పవన్‌కు ఎవరైనా చెబితే బాగుంటుంది. ఆయనతో వచ్చిన సమస్య ఏమిటంటే తను నిద్రలేచినప్పుడే సూర్యుడు ఉదయించాడని అనుకొంటారు.

అమరావతి అంశాన్ని సెంటిమెంట్‌గా మార్చి ప్రయోజనం పొందడానికి చంద్రబాబు గత ఎన్నికలలోనే పాచికలు విసిరారు. కానీ, అమరావతి చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజలు తెలుగుదేశంను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేశ్‌ను మట్టికరిపించారు. ‘‘ఈ ప్రాంతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే అమరావతిని రాసిచ్చేసినట్లే’’ అంటూ గుంటూరు, విజయవాడలలో ప్రజలను రెచ్చ గొట్టారు చంద్రబాబు. కానీ, ఆయనకు లభించిన ఫలితం శూన్యం. (చదవండి: ‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!)

అమరావతి ఉద్యమం పేరుతో ప్రవాసాంధ్రుల నుంచి టీడీపీకి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధాని అయితే... అక్కడి రియల్‌ ఎస్టేట్‌కు రెక్కలొస్తాయన్న ఆశ కలిగినవారు ఎటూ ఆ పార్టీకి  వెన్నుదన్నుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని ప్రజల రాజధాని చేయకుండా... ఆ ప్రాంతంలో బడుగుబలహీన వర్గాల వారు కాలు మోపకుండా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో... సంపన్న వర్గాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ గ్రహించినందునే రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తెలుగుదేశంకు బుద్ధి చెప్పారు. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు)

ప్రజా తీర్పుకు అనుగుణంగా, అమరావతి కుంభకోణాన్ని అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి జగన్‌ అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు ‘రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి నమూనా’ను పేదలు హర్షించలేదు. మధ్యతరగతి వారు సమ్మతించలేదు. సామాన్యుల కోసం వైఎస్‌ జగన్‌... సంపన్నుల వైపు బాబు ఉన్నారని ప్రజలు గ్రహించారు. ఆ మేరకు పదేపదే ఎన్నికలలో విస్పష్టమైన తీర్పునిచ్చారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ... జగన్‌కు ప్రజలలో లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలవారు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పేరుతో అందరూ జతకట్టి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పల్లకీకి బోయీలుగా మారుతున్నారు. ఇంతకంటే రాజకీయ దివాళాకోరుతనం మరొకటి ఉంటుందా!  (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...)


- సి. రామచంద్రయ్య 

శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌

మరిన్ని వార్తలు