ప్రజాస్వామ్యంలో రాజరికమా?

19 Sep, 2022 00:20 IST|Sakshi

‘బ్రిటన్‌ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. మరి ఇంకా అక్కడ రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయారయ్యాడు– అని ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళబెడతారు.

అరవై ఏళ్ళ పాటు బ్రిటన్‌ ‘రాణి’ పదవిలో వున్న ఎలిజెబెత్, 96 ఏళ్ళ వయసులో ఈ మధ్య పోయింది. ఆ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు కొన్ని. ‘బ్రిటన్‌ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. ఫ్రాన్స్‌ కంటే ఎన్నో ఏళ్ళ ముందే ‘రాజరికానికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారి బ్రిటన్‌లోనే విప్లవం’ జరిగింది అంటారు. మరి ఇంకా రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? నిన్నటి దాకా, రాణీ రూపంలో వుంది. ఇప్పుడేమో ఆమె కొడుకు రాజయ్యాడు. మనుమలు యువ రాజులయ్యారు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించడానికి మార్క్స్‌ బ్రిటన్‌లో భాగమైన ఇంగ్లండునే ఉదాహరణగా తీసు కున్నాడు. అందరూ బ్రిటన్‌ని ‘గొప్ప ప్రజాస్వామ్య దేశం’ అంటారు. మరి అక్కడ ఇంకా రాజకుటుంబం వాళ్ళు పరిపాలనలో వున్నారే? అంతా వింతగా వుంది! దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి?’అని అనేక ప్రశ్నలు గతంలోవే మళ్ళీ మళ్ళీ లేస్తున్నాయి.

ఇవన్నీ మంచి సందేహాలే. కానీ, ఈ సందేహాలు, బయటి దేశాల ప్రజలలో కంటే, బ్రిటన్‌ ప్రజలలోనే సహజంగా రావాలి. కానీ, అక్కడి ప్రజలకి, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఈ ప్రశ్నలు రానేలేదు. అక్కడ కొన్ని కమ్యూనిస్టు గ్రూపులవాళ్ళు ‘రాజరికం నశించాలి, కార్మికవర్గ రిపబ్లిక్‌ రావాలి’ అనే నినాదాలు ఇస్తూనే వుంటారు. ఇప్పటికీ ఇస్తూనే వున్నారు. కానీ, అక్కడ దాదాపు 400 ఏళ్ళ కిందట రాజరికానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి, ఒక రాజుని ఉరితీసి, కొన్నాళ్ళ తర్వాత ఇంకో రాజుని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారో వివరించే పని జరగలేదు. అందుకే, అక్కడి ప్రజలకి చిన్నప్పటినించీ చూస్తూవున్న విషయాలను చూడడానికి మించి ఏ కొత్త ఆలోచనా పుట్టలేదా?

అక్కడ చిన్నతనం నించీ, స్కూళ్ళల్లో జాతీయ గీతంలోనే రాజు పట్లా, రాణీ పట్లా గౌరవాన్ని బోధిస్తారని చదివాం. ‘‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’’ (దేవుడు రాజుని రక్షించుగాక!) అని మొదలవుతుంది వాళ్ళ జాతీయ గీతం. రాజు పోయాక, అతని కూతురు రాణీగా సింహాసనం ఎక్కాక, ‘గాడ్‌ సేవ్‌ ది క్వీన్‌’ అనడం మొదలెట్టారట. స్కూలు పిల్లల్ని రాజప్రాసాదాలకూ; విహార యాత్రలలో రాణీ కుటుంబీకులు విడిది చేసే భవనాలకూ తీసికెళ్ళి చూపించడం చేస్తారు. రాజసం ఉట్టిపడేలా, రాణీ ధరించే నగలూ, రకరకాలైన టోపీలూ, ధగ ధగ మెరిసే పెద్ద గౌనులూ... ఇలా రాణీ గారి ఆడంబరాలన్నిటినీ అక్కడి పత్రికలూ, టీవీలూ, నిరంతరం చూపిస్తూనే వుంటాయి. 

లండన్‌లోని ఒక కార్మిక నాయకురాలు 4 ఏళ్ళ కిందట రాసిన ఒక వ్యాసంలో, శ్రామిక వర్గ స్త్రీలలో కూడా రాణీ అంటే, ఎంత గ్లామరో (ఆకర్షణో) చెప్పడానికి ఒక సంఘటన చెప్పింది. కార్మికురాలైన తన తల్లి, రాణీని ఒక పెరేడ్‌లో చాలా దగ్గరగా చూసి, ‘‘రాణీ గారు ఎంత అందంగా, ఎంత గొప్పగా వుంటుందో?’’ అని అన్నదట. తల్లి మెచ్చు కోళ్ళకి జవాబుగా, మన కార్మిక నాయకురాలు తల్లితో ఇలా అన్నదట: ‘‘అవును అమ్మా! 24 గంటలూ, వైద్యులూ, బ్యూటీషియన్లూ, సేవ కులూ, వంటవాళ్ళూ అందుబాటులో వుంటే, అలా వుండక ఎలా వుంటారులే’’ అని. పనీ, పాటా వుండదు రాణీ గారికి, రిబ్బన్లు కత్తిరిం చడం తప్ప– అని కూడా అందట. దానికి వాళ్ళమ్మ ‘ఏమిటా మొరటు మాటలు?’ అనేదట. ‘వాళ్ళ రాజసాలూ, ఠీవీలూ, విలాసాలూ అన్నీ ప్రభుత్వానికి ప్రజలు కట్టే పన్నుల నించే గదా తగలేసేది’ అని కూడా కూతురు అనేదట. ఇవన్నీ నిజమే. అంతే కాదు, రాణీ ఆస్తుల విలువ 3 వేల కోట్ల పైనే అని పత్రికలు రాశాయి. అనేక భవనాలూ, అనేక వ్యాపార సంస్థలూ, వ్యవసాయ ఎస్టేట్లూ, షేర్లూ, ఇదనీ అదనీ లేదు. ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేని రాణీకి కుప్పలు కుప్పల ఆస్తులు! 

రాజరికం ఇప్పటికీ ఎందుకు వుందో అర్థం కావాలంటే, చరిత్రలో రెండు, మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అదంతా క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1625లో ఇంగ్లండుకు రాజు మొదటి ఛార్లెస్‌ అనేవాడు. రాజూ, మతాధిపతులూ, ఫ్యూడల్‌ భూస్వాములూ, ఒక వర్గం. జీతం పద్ధతి మీద కూలీలను పెట్టుకుని, తయారు చేయించిన సరుకులను పట్టణాలలో అమ్మించే వర్తక భూస్వాములు ఒక వర్గం. వీళ్ళలో చిన్న చిన్న కర్మాగారాల (ఫ్యాక్టరీలకు మొదటి రూపాలు) యజమానులు కూడా వున్నారు. కౌలు రైతులూ, చేతి వృత్తుల వాళ్ళూ, సొంత శ్రమల మీద బ్రతికే ఇతర శ్రామికులూ, ఒక వర్గం.

రాజూ, మతాధికారులూ, ఫ్యూడల్‌ ప్రభువులూ చేసే పనులు శ్రామిక వర్గాల మీద పెత్తనం చెయ్యడం! రాజు ఏర్పర్చిన పార్లమెంటులో, భూమి మీదేగాక వర్తక సరుకుల మీద లాభాలు తినే వర్తక భూస్వాములు ఎక్కువ సంఖ్యలో వున్నారు. (అప్పటి కొత్త రకం ప్రభువర్గం వాళ్ళే. వీళ్ళలో ముఖ్యుడు క్రాంవెల్‌ అనే పార్లమెంటు సభ్యుడు.) పెత్తనం అంతా రాజుదే. అందుకని, ఆ పెత్తనానికి వ్యతి రేకంగా, మెజారిటీగా వున్న రైతుల్నీ, చేతి వృత్తుల వారినీ కలుపుకొని, సరుకుల ద్వారా లాభాల్ని పొందే వర్తక భూస్వాములూ, పెట్టుబడి దారులూ, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఎన్నో జరిగాక రాజుని ఓడించి, రాజుని బహిరంగంగా ఉరితీశారు. కానీ, రాజు లేనంత మాత్రాన ప్రజల సమస్యలు తీరతాయా? ప్రజల వైపు నించీ ఉద్యమాలు మొదలయ్యాయి. అలాంటి ఉద్యమాలలో, ‘లెవెలర్లు’ (సమానత్వవాదులు) నడిపిన ఉద్యమం ఒకటి. 

అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభువర్గమూ, వర్తక భూస్వా ములూ, ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడం మొదలు పెట్టారు. అంతేకాదు. ప్రజల ఉద్యమాన్ని మరింతగా అణచడానికి మళ్ళీ ఇంకో రాజుని (విలియం) తీసుకొచ్చి కూర్చోపెట్టారు.

బ్రిటన్‌లో అధికారం అంతా, పెట్టుబడిదారులతో నిండిన పార్ల మెంటుదే అయినా, పేరుకి మాత్రం రాజే దేశాధినేత. అందుకే మార్క్స్, 1855లో, ‘బ్రిటన్‌ రాజ్యాంగం’ అనే వ్యాసంలో, ఆ రాజ్యాంగం అధికారికంగా (అధికారం అనే పేరుకి) పాలించే భూస్వామ్య ప్రభువులకూ (లాండెడ్‌ అరిస్టోక్రసీ), అసలు (యాక్చు వల్లీ) పాలించే బూర్జువా వర్గానికీ మధ్య, ఒక రాజీ– అని అంటాడు. రాజు అనేవాడు కూడా ఒక పెద్ద భూస్వామే. భూస్వామ్య వర్గానికి ప్రతినిధి కూడా. ఆ రాజుని ఒక పెద్ద దేవుణ్ణి చేసి పారేశారు. అందుకే, ఏంగెల్స్‌ ఇంగ్లండ్‌ గురించి 1844లో రాసిన ఒక వ్యాసంలో, రాజు పట్ల ఆరాధన పరమ అసహ్యకరంగా (డిస్‌గస్టింగ్‌ కల్ట్‌) ఉంది – అని అన్నాడు. ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే, అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయార య్యాడు– అని కూడా ఏంగెల్సు అన్నాడు.

శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళ బెడతారు. ఒక పక్క రాజో, రాణీయో ఉంటే, ఇంకో పక్క ‘ప్రజా స్వామ్యబద్ధంగా’ ప్రజలు ఓట్లువేసి పంపిన ‘ప్రజా ప్రతినిధులు’ ఉంటారు. ఆ రకంగా బ్రిటన్‌లో ఈనాడు కూడా ఉన్నది, రాజరికపు ప్రజాస్వామ్యం. 

భారత రాజ్యాంగాన్ని చూస్తే, రాజుతో పోల్చదగ్గ భారత రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించడానికి వచ్చేటప్పుడు, రాష్ట్రపతి అంగరక్షక దళంలో అన్నీ గుర్రాలే! అంతా పాత రాజరిక సంస్కృతే! రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో కూచుని వుంటే, ఆ బగ్గీకి ముందూ, వెనకా, రెండు పక్కలా, ఎనభై ఆరు గుర్రాలూ, వాటిని నడిపే సైనికులూ వుంటారు. ఆ దృశ్యాల్ని చూస్తే జనానికి మతి పోతుంది. అంత రాజరిక ఆర్భాటం లేకపోతే, ఆ పదవి మీద జనాలకి లక్ష్యం వుండదని పాలకులకు భయం! శ్రామిక వర్గపు అమాయకత్వాలూ, అజ్ఞానాలూ ఇవన్నీ! ఈ శ్రామికవర్గం ఇలా వుంటే, ధనిక పాలకవర్గం అలా వుండదా? 

రంగనాయకమ్మ (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి)

మరిన్ని వార్తలు