మా వాటా మాకిచ్చారా?

16 Aug, 2022 01:03 IST|Sakshi

భారత జాతీయోద్యమంలో స్త్రీల ఉనికి, వారి భాగస్వామ్యం, దక్కిన ఫలితాలను గమనిస్తే మహిళల క్రియాశీలతకు జోహార్లు. కానీ, భారత రాజకీయాల్లో వారికి దక్కిన వాటా, గుర్తింపు... అప్పుడూ, ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడూ... అంతంత మాత్రమే. స్వాతంత్య్రానంతరం పాలనా రాజకీయాలలో మహిళలకు దక్కినదానికీ, జాతీయోద్యమంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్‌లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేకపోయారు. స్వతంత్ర భారతంలో పితృస్వామ్యం కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ క్షీణిస్తుండడం విచారకరం.

► ఇవాళ స్వాతంత్య్రోద్యమ పునర్మూల్యాంక నంలో స్త్రీల పాత్ర గురించి ఆలోచించడమంటే ఉద్యమ అజెండాలో స్త్రీలను ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు, స్త్రీలు ఆ పరిధులలోనే ఉన్నారా, వాటిని ఛేదించుకొని మార్పు కోసం తమ స్వతంత్రం కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారా? స్వాతంత్య్రో ద్యమ నాయకత్వం ఏ మేరకు ఆమోదించింది? ఏ పరిమితులు విధించింది? మొత్తంగా జాతి సాంస్కృతిక అస్తిత్వంగా భావించిన దానిలో తమ ఉనికి, స్థానాలలో మార్పును స్త్రీలు సాధించుకో గలిగారా? ఈ ప్రశ్నలకు 75 ఏళ్ళ తర్వాతనైనా మనం సమాధానాలు చెప్పుకోలేకపోతే, కనీసం వాటి కోసం అన్వేషించకపోతే స్త్రీల స్థితి గతులలో గుణాత్మకమైన మార్పులు రాలేదని అర్థం.

► ఒక దేశంగా, జాతిగా భారతదేశం, భారతీయులు వెనుకబడి ఉన్నారనీ, తమను తాము పరిశీలించుకునే అర్హత లేని అనాగరి కులుగా ఉన్నారనీ బ్రిటిష్‌ పాలకులు చేసిన వాదనలకు వారు చూపించిన ఉదాహరణ– స్త్రీలు. సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, విద్యాలేమి, విడాకుల అవకాశం లేకపోవడం, పరదా పద్ధతి... ఇలాంటివి చూసి వలస పాలకులు భారతీయులను అనాగరికులంటూ ముద్ర వేశారు. అప్పుడు భారతీయుల ముందున్న కర్తవ్యం– ఆ ముద్రను తొలగించుకోవడం! దానికి రెండు దారులున్నాయి. ఒకటి– ఆ అనాగరికత నుంచి స్త్రీలను తప్పించడం. రెండు– ‘అది అనాగరికత కాదు, అదే మా నాగరికత వైభవం’ అని సమర్థించుకోవడం! ఆ వాదన మీద జాతి నిర్మాణాన్ని చేయడం! స్వాతంత్య్రోద్యమ నాయకత్వం ఆనాటి ఉద్యమ అవసరా లకు అనుగుణంగా రెండు దారులలోనూ ప్రయాణించింది. స్త్రీలూ వారి వెంబడి నడిచారు. నడుస్తూ, నడుస్తూ తమ స్వతంత్ర మార్గాన్ని తాము వేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కొన్ని మార్పులను తీసుకురాగలిగారు.

► వలస పాలకులు ‘భారతీయ స్త్రీలు, స్త్రీత్వము’ అంటూ ప్రవేశ పెట్టిన భావనలను సవాలు చేయవలసిన అవసరం ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల మీద పడింది. దానివల్ల కింది వర్గపు స్త్రీల నుండి వేరుపడి కొత్త ఆదర్శాలతో, కొత్త బాధ్యతలతో కొత్త మధ్యతరగతి మహిళ రూపొందింది. పాశ్చాత్య వలస పాలకులు ఆధునికతకు ఇచ్చిన నిర్వచనాలకు అనుగుణంగా దేశాన్ని ఆధునికీకరించడం జాతీయోద్యమానికి కీలక సమస్యగా ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక – భౌతిక విషయాలను వేరుచేయగలగడం, లోపలి ప్రాంతాన్నీ – వెలుపలి ప్రాంతాన్నీ వేరు చేయడం అనే పనిని వారు తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచానికీ, లోపలి ప్రైవేట్‌ ప్రపంచానికీ స్త్రీలను ప్రతినిధులుగా చేసి, భౌతిక, బాహ్యప్రపంచం లోకి పురుష నాయకులు ప్రతినిధులుగా నిలబడడంలో వింత లేదు. అది పితృస్వామ్యబద్ధ ప్రణాళిక ప్రకారం జరిగింది. అందువల్ల మనకు స్త్రీల నాయకత్వం అతి తక్కువగా కనిపిస్తుంది.

► తొలి తరంలో స్త్రీవిద్య, వితంతు వివాహాల వంటి సంస్కరణలకు కూడా ఇదే పరిస్థితి. స్త్రీవిద్య గురించి స్త్రీలు కన్న కలలేమిటి? తమ జీవితాలలో వారు కోరుకున్న మార్పులేమిటి అనేది మనకంతగా తెలియదు. వీరేశలింగం పంతులుగారి కంఠస్వరమే వినిపించి, రాజ్యలక్ష్మి చాలాకాలం పాటు ఇంటికే పరిమితమైంది. వీరేశలింగం గారు తన ఆత్మకథలో ఆమె క్రియాశీలక పాత్ర గురించి రాస్తేనే, అది చదివినవారికే ఆమె నాయకత్వ పటిమ తెలిసింది. సంస్కరణోద్య మాల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాలలో స్త్రీల పరిస్థితి మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. అయితే, స్త్రీలు తమ కార్యాచరణతో చరిత్రను తమ చేతులలోకి తీసుకోవాలని ప్రయత్నిం చడం స్వాతంత్య్రోద్యమ కాలమంతా కనిపిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వ భావనలు స్త్రీల జీవితాలలోకి అనివార్యంగా ప్రవేశించి, వారిని ముందుకు నడిపించాయి.

► 1917లో మార్గరెట్‌ కజిన్సు, సరోజినీ నాయుడుల నాయకత్వంలో పట్టభద్రులైన మహిళలు మాంటేగ్‌ను కలిసి తమకు ఓటుహక్కు కావాలని అడగడంతో మొదటిసారి స్త్రీలు తమ రాజకీయ అవసరాలను గుర్తించారు. 1917లో జరిగిన కలకత్తా కాంగ్రెస్‌ మహాసభలలో మహిళా చైతన్యం పెరిగింది. 1921లో ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జరిగిన ‘చీరాల – పేరాల సత్యాగ్రహం’లో రావూరి అలివేలు మంగతాయా రమ్మ అరెస్టయింది. రాజకీయ నేరస్థురాలిగా జైలుకు వెళ్ళిన మొదటి స్త్రీ ఆమె. నాలుగు నెలలపాటు జరిగిన ‘చీరాల–పేరాల’ ఉద్యమంలో గ్రామాలనూ, ఇళ్ళనూ వదిలి నాలుగు నెలలపాటు వేరేచోట ఉండ వలసిన పరిస్థితుల్లో స్త్రీలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, వారి జీవితాలలో వచ్చిన మార్పులేమిటి అని రికార్డు చేసినవారు లేరు. అప్పటి స్త్రీల అనుభవాలు చరిత్రకెక్కి ఉంటే భవిష్యత్తు మరొక విధంగా ఉండేది. పల్నాడులో పుల్లరి ఉద్యమంలో పోలీసుల లాఠీలకు ఎదురు నిల్చి తీవ్ర గాయాలపాలైన గంగమ్మ, అచ్చమ్మల నాయకత్వ పటిమ ఎలాంటిది? ఆ నాయకత్వ స్ఫూర్తిని తర్వాత తరాలకు ఎందుకు అందనివ్వలేదనే ప్రశ్నలు కూడా రాలేదు చాలాకాలం పాటు!

► 1923లో కాకినాడలో కాంగ్రెస్‌ మహాసభ జరిగింది. ఆ మహాసభకు దేశమంతటి నుంచీ స్త్రీలు వచ్చారు. వాలంటీర్లుగా వందలమంది స్త్రీలు పనిచేశారు. స్త్రీలు ఇళ్ళను వదిలి, తమ ఊళ్ళను వదిలి కొత్త వాతావరణంలో తమపై కుటుంబ పెత్తనం లేకుండా జీవించడం, అతి కొద్దికాలమైనా సరే వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. వారిలో అనేక విధాలైన స్వేచ్ఛాకాంక్షలను మేల్కొలిపింది. అయితే ఆ స్త్రీలను నియంత్రించే విధానం కూడా ఇంకోపక్క తయారై పోతూనే ఉంది. స్వేచ్ఛాకాంక్షకూ, నియంత్రణకూ మధ్య నలిగి పోయిన స్త్రీల జీవిత పోరాటాలను గుర్తించినవారు లేరు. ఆ సమయం లోనే దువ్వూరి సుబ్బమ్మ, పొణకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ అశేష ప్రజానీకాన్ని తమ ఉపన్యాసాలతో ఆకర్షించి జాతీయో ద్యమాన్ని ప్రచారం చేశారు. 1922లో ఏర్పడిన మహిళా కాంగ్రెస్‌ మహిళల నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా, వారికి ఖద్దరు ప్రచారోద్యమ బాధ్యతలు తప్ప మరే కీలక రాజకీయ బాధ్యతలూ దక్కలేదు. ఆ స్త్రీల ప్రవర్తన గురించి అటు వలస పాలకులూ, ఇటు స్వదేశీయులు విమర్శలు గుప్పించారు. స్వదేశీయులు వెలి వంటి వాటిని ఉపయోగిస్తే, వలస పాలకులు జైలుశిక్షలు విధించారు. 

► ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ ఆ సత్యాగ్రహానికి స్త్రీలు దూరంగా ఉండాలని ఎన్ని విజ్ఞప్తులు  చేసినా స్త్రీలు పట్టించుకోలేదు. దండి యాత్ర మార్గమధ్యంలోనే గాంధీని కలిసిన సరోజినీ నాయుడు దండిలో గాంధీతో పాటు ఉప్పు తయారు చేశారు. దుర్గాబాయమ్మ, కొండా పార్వతమ్మ మరెంతమందో వేలాదిగా స్త్రీలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఇంట్లోని పాలకులనూ, బయటి వలస పాలకులనూ ఎదిరించి స్వేచ్ఛగా జైలు జీవితాన్ని కోరుకున్నారు. అఖిల భారత మహాసభను నిర్వహించుకొని కొనసాగారు. తెలంగా ణాలో నవజీవన మహిళా మండలితో మొదలై బ్రిజ్‌రాణి గౌడ్, ప్రేమాతాయి, సర్జూబెన్‌ వంటివారు వామపక్ష ఉద్యమాలలోకి నడిచారు. గిరిజన పోరాటాలలో కొమురం సోంబాయి నాయకురాలై నిలబడింది. చిట్యాల ఐలమ్మ తన భూమి సాగు చేసుకోవడానికి చేసిన పోరాటంతో తెలంగాణలో జాతీయోద్యమం, రైతాంగ విముక్తి ఉద్యమం – రెండింటికీ రెండు మార్గాలేర్పడ్డాయి. రైతాంగ ఉద్య మంలో మల్లు స్వరాజ్యం వంటి ఎందరో నాయకులు తయార  య్యారు. స్త్రీల పోరాట వ్యూహాలు కొత్తగా రూపొందాయి. స్త్రీలు చేసిన త్యాగాలతో సరిసమానమైనవి లేవన్నంతగా స్త్రీలు ఆ ఉద్యమంలో మమేకమయ్యారు.

► ఎంతగా స్త్రీలను ఇంటికి పరిమితం చేయాలనుకున్నా, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా నిలబెట్టాలన్నా... జాతీయోద్య మంలో అది కుదరలేదు. పోరాటయోధులుగా వారు తమను తాము నిర్వచించుకోగలిగారు. రూపుదిద్దుకోగలిగారు. కానీ స్వాతంత్య్రానం తరం పాలనా రాజకీయాలలో వారికి దక్కినదానికీ, జాతీయోద్య మంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్‌లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేక పోయారు. పితృస్వామ్యం స్వతంత్ర భారతదేశంలో కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. ఇప్పటికీ ఈ 75 ఏళ్ళ ఉత్సవాల సందర్భంలో కూడా స్త్రీలకు దక్కవలసిన రాజకీయ భాగస్వామ్యం సాధించుకోవలసిన విషయంగానే మిగిలింది.

► 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ రోజురోజుకీ క్షీణించిపోతోంది. ఇక స్త్రీలపై హింస పెరగడం, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా స్త్రీలను తీర్చి దిద్దే ప్రయత్నాలు ఒకవైపు, మార్కెట్‌ అవసరాలకు తగిన కొనుగోలు దారులుగా చేసే ప్రయత్నాలు మరొకవైపు వారిని గందరగోళంలోకి నెడుతున్నాయి. కొత్త కొత్త రూపాలలో స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఇప్పుడు స్త్రీలు తమ అస్తిత్వాన్ని కొత్తగా నిర్వచించుకుని, కుల, మత, జాతి వివక్షలను దాటి, రాజ్యాంగ ఆశయాలను మరింత విస్తృత పరుచుకుంటూ కొనసాగే మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ మార్గం చిన్నదిగా, ఆటంకాలతో కూడినదిగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో స్త్రీల మార్గమే స్వతంత్ర పోరాట, ఉద్యమ ఆశయాలను సామాన్య ప్రజల జీవితాల్లో సాకారం చేయగలుగుతుంది. ఆ ఆలోచనలకు ఈ స్వతంత్ర భారత 75 వసంతాల సందర్భం ఒక ప్రారంభమైతే బాగుంటుంది! 


ఓల్గా, వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి,
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత

మరిన్ని వార్తలు