దశాబ్ది ఆవిష్కరణగా కరోనా వ్యాక్సిన్‌

19 Dec, 2020 00:57 IST|Sakshi

విశ్లేషణ

వైరస్‌కి కారణమైన వ్యాధిని కనుగొని దాని జన్యుపరమైన సమాచారాన్నిపూర్తిగా డీకోడ్‌ చేసి దాంతో పోరాడేందుకు కొత్త చికిత్సా పద్ధతులను రూపొందించుకుంటూ సమర్థవంతమైన వ్యాక్సిన్‌లను త్వరితంగా వృద్ధి చేయడం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అతి పెద్ద పరీక్ష. అందుకే 2020లో అతిపెద్ద విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌నే ప్రముఖ సైన్స్‌ మ్యాగజైన్లు పేర్కొన్నాయి. కోవిడ్‌–19 వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ సంవత్సరంలోపే తయారై ఉపయోగంలోకి వచ్చింది. సాంక్రమిక వైరస్‌ల గురించిన హెచ్చరిక రాగానే ప్రపంచమంతటా దాని వ్యాప్తిని నిరోధించేందుకు వేగంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని తాజా వైరస్‌ మనకు గుణపాఠంగా అందించింది.

పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ఆగమిస్తున్న సందర్భంగా ఈ ఏడాది శాస్త్ర సాంకేతిక రంగంలో అతిపెద్ద ఆవిష్కరణ కోవిడ్‌ వ్యాక్సిన్‌కే దక్కుతుంది. 2020 సంవత్సరం మొత్తంగా సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను అర్థం చేసుకోవడం అది కోవిడ్‌–19 మహమ్మారిగా ఎలా మారుతోందో కనుగొనడం, తర్వాత అనేక వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం వైపుగా ప్రపంచం ముందుకెళడం క్రమంలోనే సాగిపోయింది.శ్వాస సంబంధమైన అస్వస్థతకు దారితీసే కోవిడ్‌–19 మహమ్మారికి కారణమైన సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ సోకినవారిలో ఇంతవరకు 2.2 శాతం మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఆధునిక వైద్యం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం తోడు లేకుంటే పరిస్థితి మరింత దిగజారేది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ నూరు సంవత్సరాలకు ముందు 1918లో దాడి చేసింది. ఇంటర్నెట్‌ కానీ, సుదూర ప్రాంతాల నుంచి సమాచారాన్ని వేగంగా పంచుకోవడానికి టెలిఫోన్లు కానీ లేని ఆ రోజుల్లో 5 కోట్లమంది ప్రజలు ఆ మహమ్మారికి బలైపోయారు. ఆరోజుల్లో సైన్స్‌ ప్రభావం పరిమితంగా ఉండేది. దీంతో రోగకారణాన్ని గుర్తించి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడానికి సాధ్యం కాకపోయింది. వందేళ్లకంటే ప్రస్తుతం కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం 100 శాతం సన్నద్ధతతో సిద్ధమైంది. అయితే ఈ వైరస్‌ సంవత్సరం దాటిన తర్వాత కూడా మానవ జీవితాలపై ప్రభావం చూపుతూనే ఉంది.

వైరస్‌కి కారణమైన వ్యాధిని కనుగొని దాని జన్యుపరమైన సమాచారాన్ని పూర్తిగా డీకోడ్‌ చేసి దాంతో పోరాడేందుకు కొత్త చికిత్సా పద్ధతులను రూపొందించుకుంటూ సమర్థవంతమైన వ్యాక్సిన్‌లను సంవత్సరంలోపే వృద్ధి చేయడం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అతిపెద్ద పరీక్ష. అందుకే 2020లో అతిపెద్ద విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌నే ప్రముఖ సైన్స్‌ మ్యాగజైన్లు పేర్కొన్నాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ని వృద్ధి చేయాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. 
ఇప్పటివరకు మంప్స్‌ వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ రూపొందించడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. చరిత్రలో అత్యంత వేగంగా కనుగొన్న వ్యాక్సిన్‌ ఇది. ఆ రికార్డును బద్దలు గొట్టిన కోవిడ్‌–19 వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ సంవత్సరంలోపే తయారై బ్రిటన్, అమెరికాలో ఈ వారం నుంచి అధికారికంగానే ఉపయోగిస్తున్నారు. ఇతర వ్యాక్సిన్‌ లను కూడా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయబోతున్నారు.

వేగంగా స్పందించిన విజ్ఞాన శాస్త్రం
కోవిడ్‌–19 మహమ్మారి సైన్స్‌ని ముందుపీటికి తేవడమే కాదు. దాన్ని కేంద్ర స్థానంలో నిలబెట్టింది. గత 15 సంవత్సరాలలో అత్యంత కీలకమైన శాస్త్రపరమైన ముందంజ ఏమిటంటే, వైరస్‌ గుట్టును వెల్లడించగల జన్యుపరమైన సూచనలను (జెనోమ్‌) అధ్యయనం చేయడమే. ఒక వైరస్‌ జెనోమ్‌ పరిణామాన్ని అంచనా వేసే ప్రక్రియ సైన్స్‌ని విప్లవీకరించడమే కాకుండా వైరస్‌ లేక బాక్టీరియా జెనోమ్‌ని వేగంగా తక్కువ వ్యయంతో డీకోడ్‌ చేయడానికి పరిశోధకులకు అనుమతిస్తోంది. సార్స్‌–కోవ్‌–2 పరిణామ క్రమాన్ని నిర్దేశించేందుకు ఉపయోగించే వ్యూహాన్ని, ప్రపంచవ్యాప్తంగా అది విస్తరిస్తోందని గుర్తించకముందే అంటే 2020 జనవరి ప్రారంభంలోనే పరిశోధకులు అంచనా వేశారు. సార్స్‌–కోవ్‌ కరోనా వైరస్‌ 2002–2004 మధ్య కాలంలోనే మహమ్మారి చెలరేగడానికి కారణమైంది. అయితే అది కచ్చితమైన సాంక్రమిక వ్యాధిగా కాకుండా ఆగ్నేయాసియాకు మాత్రమే పరిమితమైంది. అయితే సార్స్‌–కోవ్‌–2 రెండు వేరువేరు పరిమాణాల్లో రూపొందింది. దీంతో ఇది చాలా వేగంగా విస్తరించిపోయింది.

మొదటిది లక్షణాలు బయటపడని ఇన్‌ఫ్లెక్షన్లను ప్రేరేపించడానికి ఈ వైరస్‌ అపారమైన శక్తిని కలిగి ఉంది. రెండు, ఈ కొత్త వైరస్‌ గాలిలో కలిసిపోయిన కణాల ద్వారా వ్యాప్తి చెందగలదు. ఈ వైరస్‌లలో చాలావరకు శ్వాస ద్వారా వ్యాపిస్తుంటాయి. వీటిని చూడవచ్చు, 3 నుంచి 6 అడుగుల లోపు గాలిలో ఇవి వ్యాపిస్తుంటాయి. కానీ సార్స్‌–కోవ్‌–2 అనేక గంటలపాటు గాలిలో ఉండే చిన్న చిన్న కణాలుగా వ్యాపిస్తూ ఎక్కువమందిని ప్రభావితం  చేస్తుంటుంది. మాస్క్‌ వేసుకుంటే వైరస్‌ వ్యాప్తిని అరికడుతుందనే గుడ్డి విశ్వాసం 1918లో ప్రజల్లో ఉండేది. కానీ ఈ సారి మాత్రం విజ్ఞానశాస్త్రం అత్యంత నిర్దిష్ట సమాధానాలను అందించింది.  మాస్క్‌ ధరించడం ఎంతో సమర్థవంతమైన వైరస్‌ నిరోధక సాధనం అని  చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. మాస్క్‌ ధరిం చడం, బౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, జనాలు గుంపులుగా గుమికూడకపోవడం అనేవి వైరస్‌ వ్యాప్తిని అరికడతాయని ఈ రకంగా ఆసుపత్రుల పాలుకావడం, మరణాలను తగ్గిం చవచ్చని ఈ అధ్యయనాలు ప్రజలకు వివరంగా తెలియపర్చాయి. ఇంతకు మించి ఈ అధ్యయనాలు కొత్త విషయాలను చెప్పకపోయినప్పటికీ మహమ్మారి గురించిన అత్యంత కీలకమైన ఆవిష్కరణలను ముందుకు తీసుకువచ్చాయి.

చికిత్సకు సైన్స్‌ దోహదం
వైరస్‌ కోసం చేస్తున్న అనేక పరీక్షలు పీసీఆర్‌ని (పోలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌) ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో ప్రత్యేక ప్రొటీన్లను, వైరస్‌తో సరిపోలే డీఎన్‌ఎ పరిణామ ప్రక్రియలను ఉపయోగిస్తుంటారు. ఈ రెండూ కలిసి వైరస్‌ మరిన్ని నమూనాలను సృష్టిస్తుంటాయి. ఈ అదనపు నమూనాలు వైరస్‌ ఉనికిని కనుగొనడంలో పీసీఆర్‌ మెషన్లకు వీలుకల్పిస్తుంటాయి. దీన్ని బట్టే వైద్యులు మీకు వైరస్‌ సంక్రమించిందీ లేనిదీ చెబుతుంటారు. వైరస్‌ జెనోమ్‌ అనుక్రమాల లభ్యత కారణంగానే ఏ పరిశోధకులైనా డయాగ్నస్టిక్‌ పరీక్షలను అభివృద్ది చేయడానికి వైరస్‌తో సరిపోలే ప్రైమర్‌లను డిజైన్‌ చేస్తుంటారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పీసీఆర్‌ పరీక్షను వృద్ధి చేసి వైరస్‌ను కనుగొనడమే కాకుండా, దాన్ని నిర్మూలించే సూచనలను పరిశీలకులు, వైద్యనిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించింది. ఇది గణనీయమైన విజయాలను సాధించిపెట్టింది. దీని తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలు ఈ నమూనాను ఉపయోగించి శరవేగంగా డయాగ్నస్టిక్‌ పరీక్షలను అభివృద్ధి చేసుకున్నాయి. ఈ నమూనా పంపిణీ అయిన తర్వాతే అనేక దేశాల్లో మహమ్మారిని నిరోధించే క్రమం గణనీయంగా మారిపోయింది.

మరణాలను తగ్గించిన చికిత్స
సాంక్రమిక వ్యాధులకు చికిత్స అనేది కాలానుగుణంగా మాత్రమే పరిణమిస్తుంటుంది. అందుకే హెపటైటిస్‌ సి కి ఇంతవరకు వ్యాక్సిన్‌ లేదు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో రోగులకు కొన్ని దుష్పరిణామాలు కలిగిస్తూనే అత్యంత సమర్థవంతంగా పనిచేసిన చికిత్సా పద్ధతులను వైద్యనిపుణులు కనిపెడుతూ వచ్చారు. సార్స్‌–కోవ్‌–2 సాంక్రమిక వ్యాధి విషయంలోనూ ఇదే పరిణామాలను మనం చూస్తున్నాం. క్లినికల్‌ అధ్యయనాల సహాయంతో మనం ఇప్పుడు స్టెరాయిడ్స్,
రెమ్‌ డెసివిర్‌ వంటి యాంటీ వైరల్‌ మెడిసిన్స్, యాంటీబాడీస్‌ వంటి వాటితో కరోనా వైరస్‌కు చికిత్స చేయగలుగుతున్నారు. అలాగే వైద్యులు కూడా రోగులు బతికి బట్టకట్టడానికి రోగి పరిస్థితిని మార్చడం ఎలాగో కూడా తెలుసుకున్నారు.

నేర్చుకోవలసిన పాఠాలు
చైనాలోని హుబై ప్రావిన్స్‌లోని ఊహాన్‌ నగరంలో ప్రారంభమైన కోవిడ్‌–19 వైరస్‌ని 2019 నవంబర్‌ లేక డిసెంబర్‌ మొదట్లోనే మొదటిసారి పరీక్షించారు. ఆ తర్వాత శరవేగంగా వ్యాపించిన ఈ వైరస్‌ నిత్యం అనుసంధానమై ఉన్న ప్రపంచంలో వైరస్‌లు ఎలా వేగంగా వ్యాప్తిస్తాయనేందుకు ఒక అద్భుతమైన చిత్రణగా నిలుస్తుంది. గతంలో ఎబోలా, జికా వైరస్‌ ఉధృతి సమయంలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. కానీ సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ వ్యాప్తి మాత్రం పూర్తిగా భిన్నంగా సాగింది. సాంక్రమిక వైరస్‌ల గురించిన హెచ్చరిక రాగానే ప్రపంచమంతటా దాని వ్యాప్తిని నిరోధించేందుకు వేగంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని తాజా వైరస్‌ మనకు గుణపాఠంగా అందించింది.
ఎక్కడైతే ప్రజారోగ్య విధానాలు అత్యంత పటిష్టంగా అమలువుతున్నాయో అక్కడే వైరస్‌ వ్యాప్తి చాలావరకు తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఇలాంటి పరిణామం జరగడానికి పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అందుకే విజ్ఞాన శాస్త్రం సాధించిన అద్భుత విజయాల్లో కోవిడ్‌–19 వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ఆవిష్కరణగా చరిత్ర నమోదు చేయనుంది.


అసోసియేట్‌ డైరెక్టర్, మైక్రోబయాలజీ
కాలిఫోర్నియా యూనివర్శిటీ, శాన్‌ డియాగో
డేవిడ్‌ ప్రైడ్‌

 

Poll
Loading...
మరిన్ని వార్తలు