World Egg Day 2021: పోషకాహారానికి ఓ సంజీవని

8 Oct, 2021 13:01 IST|Sakshi

నేడు అంతర్జాతీయ ఎగ్‌ డే

గుడ్డు అంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్‌తో నిండిన సూపర్‌ ఫుడ్డు. గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్‌–ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు, 78 కాలరీల శక్తి ఉంటాయి. 


శరీరానికి అవసరమైన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు దీనిద్వారా లభిస్తాయి. తెల్ల సొనలో అల్బుమిన్‌ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, చాలా సహాయపడుతుంది. (ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్‌ ‘డి’ అందుతుంది?)

ఒక సర్వే ప్రకారం, 80 శాతం భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉన్నది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్‌ను ఆహారంలో తీసుకోవాలి. మరొక సర్వే ప్రకారం, 70–90 శాతం భారతీయులలో విటమిన్‌ డి లోపం ఉంది. ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినా, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికీ లభించటం లేదు. (బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?)

ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని జాతీయ పోషణ సంస్థ సూచించినది. కాని, మన  దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉన్నది. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. 


గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. దీన్ని గుర్తించిన మన ప్రభుత్వాలు కూడా, విద్యార్థులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి,  పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్‌ కమిషన్‌ ధ్యేయం గుడ్డు వినియోగంతోనే పోషకాల లోపాలను భర్తీచేసి, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించటం. 

– సురేష్‌ చిట్టూరి, చైర్మన్, అంతర్జాతీయ ఎగ్‌ కమిషన్‌

మరిన్ని వార్తలు