ధరిత్రికి ప్రాణవాయువు పర్యావరణమే

5 Jun, 2021 02:09 IST|Sakshi

విశ్లేషణ

పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్నవనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు  నిర్వహిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. భూమికి చెందిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అత్యవసర అవసరాలపై ప్రజలు, ప్రభుత్వాలు, వివిధ ప్రజా సంఘాల దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించడమే ఈ సారి ఐక్యరాజ్యసమితి ముఖ్యఉద్దేశం.  


జీవ వైవిధ్యాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నాడు  మహాకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కానీ ఆ మానవులే నేడు చెట్లను తమ స్వార్థం కోసం అభివృద్ధి, సాంకేతికత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం.. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. భూతాపాన్ని తగ్గించే విషయంలో అడవులది కీలక పాత్ర. విస్తారమైన అడవులు భూగోళానికి ఊపిరి తిత్తులవంటివి. మన దేశంలో జాతీయ సగటు అడవుల శాతం 24.06%గా ఉంటోంది.  దక్షిణ భారత దేశంలో అత్యధికంగా కేరళలో 54.42 శాతం ఉండగా, తమిళనాడు 20.17, కర్ణాటక 20.11, తెలం గాణ 18.36, ఆంధ్రప్రదేశ్‌ 17.88 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా హిమాచల్‌ ప్రదేశ్‌ 66.52%తో ఉంది.  


గత దశాబ్ద కాలం (2009–2019)లో భారత దేశ పట్టణీకరణ దాదాపు 34.47% మేర పెరిగింది. పట్టణాల విస్తీర్ణం వేగంగా పెరుగుతుండటంతో అడవులు తీవ్రంగా నరికివేతకు గురవుతున్నాయి. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ దశాబ్దం చివరినాటికి వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్పుడు ఋతుపరివర్తన జరిగి అకాల వర్షాలు, వరదలు, అధిక ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడి అపార నష్టం సంభవిస్తుంది. దీనివల్ల సమస్త మానవజాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.  


ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్‌ వాతావరణ ఒప్పందానికి ప్రపంచ దేశాలు కట్టుబడాల్సిన అవసరం  ఎంతైనా ఉంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్‌ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా కర్బన ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. 

మానవ నాగరికత నది తీరాల్లోనే మొదలైందనేది కాదనలేని సత్యం. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభిం చాల్సి ఉంది. ఆయా నదులు వాటి తీరాలు ఆక్రమణకు గురి కాకుండా వాటిల్లో చెత్తా చెదారాలు వేయకుండా శుభ్రంగా చూసుకోవడం మనందరి కనీస బాధ్యత. నది తీరాల వెంబడి కాలుష్య పరిశ్రమలను స్థాపించి వాటి చెత్తా చెదారం అంతా నదుల్లోకి పారబోస్తున్నారు. ఉదాహరణకి గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమై పోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. పైగా గంగా నదిలో శవాల విసిరివేత మనందరికీ సిగ్గుచేటు. సరస్సులు, చెరువుల ఆక్రమణను అరికట్టాల్సి ఉంది.  

 
కేంద్ర ప్రభుత్వం  పర్యావరణ పరిరక్షణకై తగు చర్యలు చేపడుతుండడం ఎంతో ముదావహం. కేంద్రం 20 వేల కోట్ల రూపాయలతో ‘నమామి గంగే’ పేరు తో గంగానది తీర ప్రక్షాళనకు పూనుకోవడం బృహత్తర చర్య. అలాగే ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ‘టాయిలెట్స్‌ బిఫోర్‌ టెంపుల్స్‌’ పేరుతో దేశంలో ఇప్పటివరకు కొత్తగా 9  కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం ఎంతో గొప్ప చర్య. అలాగే ‘గ్రీన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గత మూడేళ్లలో దాదాపు 6,778 చదరపు కిలోమీటర్ల మేర కొత్త అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే  కేంద్ర ప్రభుత్వం దాదాపు 36.73 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందుబాటులోకి తెచ్చి, పెద్దఎత్తున వాటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో దాదాపు 38 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తెచ్చినట్లైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్‌ ఎనర్జీ కార్యక్రమమని చెప్పవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌ ‘నగర్‌ వన్‌ ఉద్యాన్‌‘ పేరుతో అన్ని పట్టణాలలో కృతిమ ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తోంది. అలాగే ‘మోడల్‌ ఎకో విలేజ్‌ ‘పేరుతో ఉత్తమ పర్యావరణ గ్రామాలను ఎంపిక చేసి వాటికీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. 


అయితే పర్యావరణాన్ని పరిరక్షించటానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా అరి కట్టాలి. ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అదే మానవాళికి ఒక గుణపాఠం కూడా నేర్పింది. ప్రకృతి, పర్యావరణం, వాతావరణ సమతుల్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు మానవ మనుగడకు ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి నొక్కి చెప్పింది. దేశీయ ఆహారపు అలవాట్లు ఐన కొర్రలు, రాగులు, సజ్జలు లాంటి చిరు, తృణ ధాన్యాల వాడకం విరి విగా పెరిగింది. అలాగే శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, వాతావరణ పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పింది.


‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల హెచ్చరిక. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే దానిని ప్రేమిస్తే చాలు దానిని కాపాడుకోవాలనే తపన ఉంటే చాలు. మనందరి దైనందిన జీవనంలో ప్రకృతి పరిరక్షణ ఒక అలవాటుగా చేసుకుందాం.
‘సుజలాం సుఫలాం మలయజ శీతలామ్‌’
‘సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’


బండారు దత్తాత్రేయ 
వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ ప్రదేశ్‌
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)

మరిన్ని వార్తలు