మా ట్రంప్‌ ప్రపంచానికే ప్రమాదకరం!

11 Aug, 2020 04:21 IST|Sakshi

కొత్త పుస్తకంతో కొంతసేపు

‘మా ట్రంప్‌ వంశం డొనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ప్రపంచానికి అత్యంత ప్రమాదకర మైన వ్యక్తిని సృష్టించిపెట్టింది. సమాజ మను గడకు అవసరమైన నిబంధనలు, సూత్రాలు ఏవీ తనకు వర్తించవన్నది ట్రంప్‌ విశ్వాసం. అత్యుక్తులతో కూడిన సొంత డబ్బాతో కొంత మందిని తనవైపు ఆకర్షించుకున్నాడు. ఈయన అసలు నైజం తెలియని పెక్కుమంది ట్రంప్‌ తెచ్చిపెట్టుకున్న అహంకారం, పొగరుబోతు తనాన్ని చూసి అదంతా అతని బలమని భ్రమించారు. ఈ మా డొనాల్డ్‌ ట్రంప్‌ అసలు గుణగుణాల్ని పసికట్టలేని వారికి ట్రంప్‌ ప్రవర్తన ముందు ముందు తెలిసొస్తుంది.’

–అమెరికా అధ్యక్షునిగా 2016 నవంబర్‌లో ఎన్నిక కాబోయే ముందు ట్రంప్‌ కుటుంబ సభ్యురాలైన మేరీ ఎల్‌. ట్రంప్‌ ఉవాచ: ఈమె ట్రంప్‌ ఎన్నిక అయిపోయి పాలన ప్రారంభమైన తర్వాత ట్రంప్‌ అసలు నైజాన్ని బయటపెడుతూ రాసిన పుస్తకం: ‘the world's most dangerous man'' (2020)

ఇంట్లో ‘దాయాది (ఆస్తిమీద కన్నేసిన వాళ్లు) ఉంటే వేరే నిప్పెం దుకు’ అని తెలుగు సామెత. పోనీలే జ్ఞాతి కూడా మన ఇంటి మనిషే కదా, మన రక్తం పంచుకున్నవాడే కదా అని భావించి ఇంటి దీపమే కదా అని ముద్దెట్టుకుంటే అది మీసాలన్నీ కాల్చేసిందట! అలా తయా రైంది డోనాల్డ్‌ ట్రంప్‌ సహా అయిదుగురు సంతానం ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పెదనాన్న, బాబాయిల వంశం. ప్రస్తుత సమీక్షా గ్రంథమైన మేరీ ఎల్‌ ట్రంప్‌ రచన తన జ్ఞాతి వర్గం పుట్టుపూర్వోత్తరాలను, ఎదు గుదలలో వారివారి సలక్షణాలతోపాటు దుర్లక్షణాలను, మనస్తత్వా లను, బాధలను, బాదరబందీలను తమకుపడని వారిని పట్టి పల్లార్చే కసితనాన్ని, ఉన్మాద లక్షణాలను చర్యలను తూర్పారబడుతూ కదం తొక్కిన కలం! ధనికవర్గ వ్యవస్థలో కుటుంబ కలహాలకు, కక్షలకు, కార్పణ్యాలకు ప్రధాన కారణమైన ఆస్తి తగాదాలలో కూలిపోయిన ఆత్మీయతలు, అందులో భాగంగా పెద్దవాడైన మన కథానాయకుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తికోసం పడిన తపనలో ఉమ్మడి కుటుంబాన్ని చీల్చి నట్టేట ముంచి, సొంత ట్రంప్‌ ఎస్టేట్ల కోసం, వ్యాపార లావాదేవీల కోసం యావత్తు కుటుంబీకుల్ని బికారుల్ని చేసి శంకరగిరిమాన్యాలు పట్టించడానికి చేసిన కుట్రల్ని మేరీ ఎల్‌ ట్రంప్‌ పూసగుచ్చినట్లు ఇందులో వివరించింది.

చివరికి ‘ట్రంప్‌’ల ఉమ్మడి కుటుంబం కాస్తా ఆర్థికంగా ఎదుగుదామనుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మూలంగా దారిద్య్రానికి చేరువయినంత పనయిందట. ఉమ్మడి కుటుంబ ఆస్తిని చేతికి అందినంత చేజిక్కించుకుని మరీ మహా కోటీశ్వరుడిగా అవతరిద్దామనుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మొత్తం అమెరికానే మింగటానికి ఎలాంటి ఎత్తుగడలు వేసి, ఒక ఉన్మాదిగా మారుతూ వచ్చాడో మేరీ ట్రంప్‌ వివరించింది. కుటుంబ సంక్షేమాన్ని చూడలేనివాడు దేశ ప్రజల సంక్షేమాన్ని, దేశ విదేశాల ప్రయోజనాల్ని మాత్రం ఎలా కాపాడగల్గుతాడు, అవసర మైతే సొంత జేబుకు చిల్లుపడితే దాన్ని కాపాడుకోవడానికి దేశం బొక్కసానికే ‘ఏతాం’ ఎత్తుతాడు. బహుశా అందుకే కరోనా మహ మ్మారి, ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, నుమోనియా లాంటి మహమ్మారుల మాదిరే ప్రపం చాన్ని చుట్టబెట్టిన వేళ కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ కేంద్రీ కరణ అంతా గుత్తవ్యాపారాల మీద, లాభాల లావాదేవీల మీదనే ఉండి, కరోనా కట్టడికి నెలల తరబడి చర్యలు తీసుకోలేదు. లాక్‌ డౌన్‌లను వ్యతిరేకించాడు. కొన్నాళ్లపాటు నిషేధించాడు. మళ్లీ లౌక్‌డౌన్‌ ప్రకటించాడు. మాస్క్‌లను వ్యతిరేకించాడు. ఆ తర్వాత తానూ మాస్క్‌ ధరించాడు. మళ్లీ తీసేశాడు. సర్వత్రా విచ్చల విడిగా జనాలు గుమి కూడడాన్ని నిషేధించడానికి నిరాకరించాడు.

ఇంతకూ రోజుకొక నిర్ణయాన్ని ప్రకటించుకుంటూ కరోనా కట్ట డిపై శ్రద్ధవహించడానికి ఎందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు.. అంటే కేవలం సొంత వ్యాపారాలు కొనసాగించుకోడానికి, రేపు నవంబర్‌ (2020)లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఓట్లు పొంది మరో అయిదేళ్లపాటు అమెరికాను పీడించడానికే! ఈ విషయం ఎవరి కన్నా ఎక్కువగా తన జ్ఞాతి బిడ్డ అయిన మేరీ ఎల్‌. ట్రంప్‌కి తెలిసి పోయింది కనుకనే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్‌ పాలన ఎలా ఉండబోతోందన్న విలేకరుల ప్రశ్నకు మేరీ ట్రంప్‌ ఇచ్చిన జవాబు.. ‘మీరు చూస్తారుగా ఎలాంటి పాలనో చూడబోతూనే రుచి అడగడం దేనికి’ అని ప్రశ్నార్థకంలోనే అన్యాపదేశంగా ఉప్పు అందించింది! ‘తన కోపమే తన శత్రువు’ అన్న నానుడికి డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద ఉదా హరణ. సంతోష ఘడియలంటూ మనం చూడని ట్రంప్‌కు ఉగ్ర కోపం లోనే, వినాశనంలోనే ఉత్సాహం అంటుంది మేరీ. ఈ అదుపులేని ఉన్మాదంలోనే ట్రంప్‌ తన వంశాన్ని ఛిన్నాభిన్నం చేశాడంటుంది మేరీ. ఈ ఉన్మాదంలోనే ఇంతింతై వర్తక వ్యాపారాల్లోనూ, ఎస్టేట్లలోనూ అంత వేగంగానే దెబ్బలు తిన్నాడు. ఆ ఉన్మాదంతోనే ఇప్పుడు ఏ ఘడి యల్లో అమెరికాను వినాశనంవైపు నెడతాడో తెలియదు.

ఇందుకు తాజా ఉదాహరణగా రేపు జరగబోయే ‘చిత్రాన్ని’ మీరే వెండితెరపై చూస్తారన్నట్టుగా మేరీ ‘నా నోటితో చెప్పడం దేనికి మీరే చూడండి’ అని తనను ప్రశ్నించిన విలేకరులతో అన్నది. ‘పేదలన్నా, రోగగ్రస్తులన్నా ట్రంప్‌కి పడదు, వాళ్లంటే అసహ్యమేగానీ అతనికి ఆర్ద్రత లేదని’ అంటుంది. అతని అబద్ధపు ప్రచారాలకు ఆసరా ట్విట్టర్, ‘ఫాక్స్‌న్యూస్‌’ అన్న ప్రసార మాధ్యమాలే. ఆ మాటకొస్తే చైనాలో వచ్చిన కరోనా వైరస్‌.. కావాలని అమెరికా మీడియా పని గట్టుకుని చైనా వదిలిన విషక్రిమేనని ప్రచారం ప్రారంభించి చైనా మీదికి కాలు దువ్వాలని చూసినప్పుడు వూహాన్‌లో అంతకుముందు నెలరోజుల నాడు జరిగిన ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలకు హాజరైన ‘అమెరికా సైనికులు అంటించి వెళ్లిన రోగమే కరోనా’ అని చైనా ఎత్తి పొడిచింది. యావత్తు ట్రంప్‌ వంశాన్నే తన పాదాక్రాంతం చేసుకోవాలని ఆ వంశాన్ని నానా హింసకు గురిచేసిన డోనాల్డ్‌ ట్రంప్‌కు స్వార్థంతో ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం లోకి దించడానికి కూడా వెనుదీయడన్న భావన మేరీ విశ్లేషణ ద్వారా మనకు కలిగినా కలగవచ్చు. ఎందుకీ ఉన్మాదానికి ట్రంప్‌ లోనుకా వాల్సి వస్తోందన్న ప్రశ్నకు మేరీ– ‘దారుణమైన మనో వైకల్య వ్యాధితో తీసుకుంటున్నందుననే’ అని ఈ గ్రంథంలో సమాధానమిస్తుంది. ఇందుకు కారణం ‘తల్లిదండ్రుల పెంపకంలో వచ్చిన లోపమని, వార సత్వ లక్షణమని’ మనస్తత్వ శాస్త్రంలో అగ్రశ్రేణి పరిశోధకురాలైన మేరీ ఎల్‌ ట్రంప్‌ నిర్ధారించింది. అలాంటి ఈ ‘మనో వైకల్య వ్యాధిగ్రస్తుౖడైన ట్రంప్‌ నేడు ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల భద్రతకు, సామాజిక వ్యవస్థ మను గడకు ప్రమాదకరం’ అని మేరీ హెచ్చరిస్తోంది.

ఈ హెచ్చరికలోని నిజానిజాలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండ దేశాల మధ్య, దేశాలలోనూ, వలస–సామ్రాజ్యవాద వారసత్వం ఆధారంగా ట్రంప్‌ పెడుతున్న జాతివివక్షాపూరిత మైన ‘కుంపట్ల’ దృష్ట్యా అంచనా వేసుకోవచ్చు. ఈ వివక్ష అనేది నల్లజాతుల పైకి తెల్ల జాతీయుల్ని, అనేక ప్రపంచ సంక్షోభాల సృష్టికి ‘పుట్టిల్లు’గా రూపమెత్తిన ఒకనాటి ప్రజాస్వామ్య అమెరికాను రెచ్చగొడుతోంది. చివరికి ఆసియాలోనేగాక ప్రపంచంలోనే రెండు పెద్ద దేశాలైన భారత్‌ –చైనాల మధ్య తాత్కాలిక సరిహద్దు వివాదాల చాటున యుద్ధబీజాలు నాటి పెంచి యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి ట్రంప్‌ ఉన్మాదం తోడునీడవు తోంది. దైన్య జీవుల్ని గురించిన తలపోతలలో మహా రచయిత విక్టర్‌ హ్యూగో నమోదు చేసిన వాక్యాల్ని మేరీ ట్రంప్‌ గుర్తు చేసింది: ‘మాన వుడి ఆత్మ చీకటిలో తడుములాడుతున్నప్పుడు వివేచనా శక్తి నశించి నేరాలు జరుగుతాయి. కానీ నేరం(పాపం) చేసే వాడు నేరగాడు కాదు, అతడు నేరం చేయడానికి అవకాశం కల్పించిన వాడే నేరస్తుడు’. 

ట్రంప్‌ ప్రాథమిక పాఠశాలలో ‘తప్పొప్పుల’ మధ్య విచక్షణ గురించి ఏర్పరచుకున్న అవగాహనకు నేటి అతని ఆచరణకు మధ్య ఎలాంటి పొత్తు, పొంతనా లేదని మేరీ ట్రంప్‌ విశ్లేషించింది. అతనిలో ఎదుటివారిపట్ల ఆర్ద్రత, అనురాగం అంటూ ఉండదు. ఎక్కడికక్కడ ‘విభజించే మనస్తత్వం తప్ప ఐక్యతాస్పృహ అతనికి ఉండద’నీ ఈ విభజన మనస్తత్వంతోనే కొంపకు చిచ్చుపెట్టాడు, ఇప్పుడు ప్రపంచా నికి చిచ్చు పెడుతున్నాడనీ మేరీ ట్రంప్‌ అంటుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అస్థిమిత లక్షణం వల్లనే విస్తరిస్తున్న కరోనాకు ముకుదాడు వేయడా నికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఐక్యరాజ్యసమితి) ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్‌ సహాయకారిగా నిలబడేదానికన్నా, కరోనా కొత్త వైరస్‌ క్రిమి లక్షణాలను మొదట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా తెలియజేసేదన్న సంస్థ అధిపతిపైన ఆగ్రహించిన ట్రంప్‌ ప్రపంచ సంస్థకు నిధుల్ని రద్దుచేశాడు. చివరికి కరోనా గురించిన సలహాలను, కొత్త రకం వ్యాధి నిరోధానికి అనువైన మందులు, మాకుల విషయంలో సొంత నిర్ణయాలను ప్రకటించిన ట్రంప్‌ను సవరించబోయిన సొంత అధ్యక్ష కార్యాలయం అగ్రశ్రేణి వైద్య నిపు ణుల్ని కూడా ట్రంప్‌ తోసిపుచ్చడం మేరీ ట్రంప్‌ వర్ణించిన ‘మనో వైకల్య వ్యాధి’ లక్షణం ఫలితమే కావచ్చు. అంతేగాదు, ట్రంప్‌ ఉన్నత సలహాదార్లు పలువురు సంవత్సరం, రెండేళ్ల వ్యవధిలోనే కొలువులు చాలించుకోవడం కూడా ట్రంప్‌ ‘వ్యాధి’ ఫలితమే కావొచ్చు! బహుశా ఈ ‘వ్యాధి కారణంగానే’ డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నిక కావడం గురించి మేరీ ట్రంప్‌ తన అనుమానం వెలిబుచ్చుతూ పాఠకుల, ప్రేక్షకుల ఊహకు వదిలేసింది!!

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా