World No Tobacco Day 2021: ధూమపానం.. పోవును ప్రాణం

31 May, 2021 10:33 IST|Sakshi

మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం  

సంవత్సర కాలం పైగా మృత్యు ఘంటికలు మోగిస్తూ అందరినీ కలిచి వేస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతోంది కరోనా. కరోనాకు బలై ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తో ఆక్సిజన్‌ అందక మరణించేవారే ఎక్కువ. ఊపిరితిత్తుల ఊపిరి తీస్తున్న అనేక కారకాలలో  పొగాకు ముఖ్యమైనది. పొగాకు హుక్కా, చుట్ట,బీడీ, సిగరెట్, ఖైనీ తదితర రూపాలలో మార్కెట్‌లో అందరికీ చేరువలో లభ్యమయ్యే గొప్ప మత్తు పదార్థం. పొగ తాగడం వల్ల నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్‌ లాంటివెన్నో రోగాలు వస్తాయి. 

సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్‌ 7ను ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్‌ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి విజృంభిస్తున్న పొగాకు మహమ్మారి నుండి ప్రజలను చైతన్య పరచడంకోసం 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.  పొగాకు వాడకంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయి.  

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి మరిచి సిగరెట్‌ ఈజ్‌ మై సీక్రెట్‌ అంటూ బాధలో, సంతోషంలో, విందులో, వినోదాల్లో, టీ తాగాక ఒకటి, భోంచేశాక ఒకటి ,ఏం తోచట్లేదని ఒకటి అంటూ టైంపాస్‌కి గుటగుట నాలుగు గుటకలు మింగి ఊపిరితిత్తుల్లో పొగను నింపి ఆరోగ్యం క్షీణించాక ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. మత్తును,ఉద్రేకాన్ని కలిగించే స్వభావం కల నికోటిన్, ఏడువేల రకాల విషతుల్యమైన క్యాన్సర్‌ కారకాలు గల పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. కాబట్టి ఇప్పటికైనా యువత పొగాకు సేవనం వల్ల కలిగే నష్టాలపై జాగరూకులై, దీని బారిన పడకుండా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 

- కమలేకర్‌ నాగేశ్వర్‌ రావు
అచ్చంపేట, 98484 93223  

పొగాకుపై సమగ్ర వ్యూహమేది?
మారుతున్న కాలానుగుణంగా నేటి యువతకు ధూమపానం అలవాటుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, అనారోగ్య కారకాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వేలో తెలిపింది. భారత్‌లో 5,500 మంది ఏటా ఈ వ్యసనానికి దాసోహం అవుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ ఏడాది ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం‘ను ’పొగాకు త్యజించు – జీవితాన్ని జయించు’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. 


ప్రభుత్వం 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై చట్టం చేయగా, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని 2008లో నిషేధించింది. ఐనప్పటికీ పొగాకు వినియోగం, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానం ఆక్రమించింది. పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో మొత్తం 81 లక్షల మంది పొగరాయుళ్ళు తగ్గారని సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 30 కోట్ల మంది బాధితులుగా మారుతున్నారు. ఏటా 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పొగాకుతో మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాల కేన్సర్లు వస్తాయని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది.

ధూమపానాన్ని వదిలేసినా దాని దుష్ప్రభావం మూడు దశాబ్దాల పాటు ఉంటుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు.. మూడు శాతం మంది పొగరాయుళ్ళు మాత్రమే ఆ అలవాటును మానుకోగలరన్న పార్లమెంటరీ స్థాయీసంఘం అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కిరాణా షాపులలో, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. వాటి ప్రకటనలు, బహిరంగ ధూమపాన నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ధూమపానం అరికట్ట కలిగితే ఆరోగ్య భారతాన్ని నిర్మించగలుగుతాం. పొగాకును పూర్తిగా నిషేధించేలా పటిష్ట వ్యూహం పట్టాలకెక్కితేనే ప్రజారోగ్యానికి భరోసా!
            
- గుమ్మడి లక్ష్మీనారాయణ
కొత్తగూడెం, మహబూబాబాద్, మొబైల్‌: 94913 18409

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు