తెలుగు కవితా దండోరా ఎండ్లూరి

29 Jan, 2022 01:00 IST|Sakshi

గొప్ప కవి, దళిత కవితాత్మ బంధువు ఎండ్లూరి సుధాకర్‌ (1959–2022) దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో 80ల తర్వాత వచ్చిన కవులలో ముందు వరుసలో నిలుస్తాడు సుధాకర్‌. దళితుల్లో తన జాతి హక్కును సాధికారికంగా ప్రశ్నించే కవితను ఆయుధంగా సంధించి తలవంచని వీరుడిగా నిలిచినవాడు. ఎంత సున్నిత మనస్కుడో, అంత తీవ్ర ఉద్వేగం ఉన్నవాడు. ఎంత ప్రాచీన గ్రంథాలతో, ఉర్దూ వంటి ఇతర భాషా సాహితీ పరిజ్ఞానంతో పరిఢవిల్లినవాడో, అంత నవ్యమైన సరళమైన కవి. మంచునిప్పు అతని శైలి.

ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం రెండు కళ్లుగా ఎండ్లూరి రాసిన ఆత్మకథ కవిత ఒక మేగ్నకార్టాగా నిలిచింది. ‘‘బహిరంగ వేదిక మీద నా సన్మానం  మొదలైంది/ ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే/ నిన్నటి నా గాయాలు వులిక్కి పడు తున్నాయి’’ అంటూ మొదలు పెట్టి, ‘‘ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో/ కాలం నా ఆత్మకథను/ పాఠ్యగ్రంథంగా చదువుకుం టుంది’’ అన్న ముగింపుతో ఎండ్లూరి చేసిన ఆత్మగౌరవ ప్రకటన దళిత కవులకు నిజంగానే పాఠ్యగ్రంథమైంది.     

ఆవేదనతో కూడిన విమర్శనాత్మక చమత్కారం, కళాత్మకంగా వ్యక్తం కావడం ఎండ్లూరి కవిత్వ లక్షణం. ఉద్యమావసరాల తర్వాత కూడా అలాంటి కవిత నిలబడిపోతుంది. దళితాగ్రహ ప్రకటనలో నగేష్‌ బాబుని మించిన వాడు లేడు. దళితాత్మ ప్రకటనలో ఎండ్లూరిని కొట్టిన వాడు లేడు. ‘‘ఓనా చండాలికా/... నీ బంతిపూల కొప్పు మీదనే ఒట్టు/ నిన్ను ఊరి బయటనే నిలబెట్టిన/ ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను.’’ దళిత కవుల శిల్పంలో కూడా అంబే డ్కరిస్టు చూపు ఉందని లక్ష్మీనరసయ్య అన్న మాటకు అర్థం ఎండ్లూరి రాసిన అనేక కవితల్లో  దొరుకుతుంది. 

ఎండ్లూరి నాకు అత్యంత సన్నిహితుడు. నేను తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి శాఖలో దళిత కవిత్వం మీద పరిశోధన చేస్తున్న కాలంలో నాకెంతో దగ్గరయ్యాడు. ఎండ్లూరి సున్నిత హృదయాన్నీ, కవిత్వం పట్ల ఆయనకున్న అవ్యాజమైన అను రాగాన్నీ, పదునైన వాక్యాలను పట్టుకునే శక్తినీ కళ్ళారా చెవులారా చూశాను. ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ కోర్సులో ఆధునిక కవిత పెట్టాలి, ఒక పేరు సూచించండని ఏపీ విద్యాశాఖ వారు అడిగితే... ‘ఇంకెవరు ప్రసాదమూర్తి వున్నాడుగా’ అన్నది ఎండ్లూరే. ఆ విధంగా నా కవిత డిగ్రీ కోర్సుకి ఎక్కింది. అంతటి ప్రేమశీలి. అన్నిటినీ మించి కుల ప్రాంత మతాలకు అతీతంగా మంచి కవిత్వం రాసేవారిని అక్కున చేర్చుకునే గొప్ప మనసున్నవాడు.

ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అనే నా పరిశోధన గ్రంథంలో ఎండ్లూరి కవిత్వాన్ని ఎంతో ఇష్టంగా ఉటంకించాను. తన మాదిగ జాతి హక్కు కోసం ఆయన చేసిన అక్షర పోరాటం సాహిత్య చరిత్రలో ఎవరూ మరచి పోలేనిది. ఎస్సీ రిజర్వేషన్‌లో ఏబీసీడీ యుద్ధం రాజుకున్నప్పుడు ఎండ్లూరి రాసిన కొత్త గబ్బిలం ఒక సంచలనం. దండోరా సందేశాన్ని కొత్తగబ్బిలం రెక్కల్లో పొదిగి దాన్ని ఆయన భాగ్య నగరానికి సాగనంపుతాడు. తాత జాషువా చూస్తే మనవణ్ణి చూసి మురిసిపోయేవాడే. దండోరాకి దన్నుగా రాశాడే తప్ప అన్న దమ్ముల మధ్య అగ్గి రాజెయ్యడం ఆయన లక్ష్యం కాదు. రాజ మండ్రి నుండి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి రావడమే సహచరి హేమలత మరణంతో ఆయన్ని దుఃఖం చుట్టేసింది. సగభాగం హేమలత తీసుకుపోయింది. సగభాగం అనారోగ్యం కొరికేసింది. ఎండ్లూరి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

– డా. ప్రసాదమూర్తి, ప్రముఖ కవి
మొబైల్‌: 84998 66699

మరిన్ని వార్తలు