ఏరువాకకు స్వాగతం పలుకుతున్న ఇక్కట్లు!

14 Jun, 2022 16:14 IST|Sakshi

వానాకాలం పంటల సాగు ప్రారంభం అవుతోంది. సాగుకు ముందు రైతులకు అవసరమైన మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ఏమాత్రం అలస్యం జరిగినా పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో ఉపకరణాలు లబించక పంటలు దెబ్బతినడం, ఉత్పాదకత తగ్గడం చూస్తున్నాం. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల రైతు కమతాలు సాగుకు సన్నద్ధం అయ్యాయి. కానీ ఇంత వరకు ఉపకరణాల సేకరణ జరగలేదు. సాగుకు ముందే కొన్ని సమస్యలు పరిష్కరిస్తే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుతుంది. ముఖ్యమంత్రీ, వ్యవసాయ మంత్రీ నెల రోజుల క్రితమే ఏఏ పంట ఎన్ని ఎకరాల్లో పండించాలనే విషయంపై ఒక ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన ఆధారంగా ప్రణాళిక తయారు కాలేదు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నా పరిష్కరించాల్సిన సమస్యలు అలాగే ఉన్నాయి.

కల్తీ విత్తనాల బెడద రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ళ కల్తీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. విత్తనాలు ఎగుమతి చేసే రాష్ట్రంలో రైతులకు ఈ బెడద ఏంటి? నెల రోజుల క్రితం ఉజ్జాయింపుగా వ్యవసాయ శాఖ మంత్రి పంట రుణాల మొత్తాన్ని ప్రకటించారు. 2022–23 సంవత్సరానికి రూ. 67,863 కోట్లుగా చెప్పారు. ఇచ్చిన పంట రుణాలలో 50 శాతానికి పైగా ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌’ చేసినవే. రైతులు రూ. 20 వేల కోట్ల ప్రైవేట్‌ రుణాలను 24 నుంచి 36 శాతానికి వడ్డీ తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఆ బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత వరకు యాసంగి పంటలో 35 శాతం వడ్లు అనగా 30 లక్షల టన్నులు అమ్మకాలు జరిగాయి. మొక్కజొన్నలు, కందులు, పసుపు, మిరప పంటల అమ్మకాలు పూర్తికాలేదు. మార్కెట్‌కు తెచ్చిన పంటలు తడిచి లక్ష క్వింటాళ్ళ వడ్లు దెబ్బ తిన్నాయి. అలాగే తూకాలలో మోసం, ధరల నిర్ణయంలో తగ్గింపు వలన రైతులు సుమారుగా రూ. 500 కోట్లకు నష్టపోయారు. మార్కెటింగ్‌ వ్యవస్థనూ, సివిల్‌ సప్లై సంస్థనూ ప్రక్షాళనం చేయాలి. 

తమ భూములపై హక్కులు కల్పించాలని 15 లక్షల మంది రైతులు అనేక ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ‘ధరణి’ వలన సమస్యలు తీరతాయనుకుంటే మరిన్ని పెరిగాయి. ‘ధరణి’లో 20 లోపాలు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. ఇందులో 11 లోపాలను ఒక మాడ్యూల్‌గా రూపొందించి రైతు రూ. 1,000 చెల్లించి, రికార్డు సరి చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. మరో రూ. 650 ‘మీసేవా కేంద్రం’ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆధికారులు తప్పులు రాసినందుకు శిక్ష రైతులకా?  కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికీ భూ కమతాలతో సంబంధం లేకుండా ఏడాదికి రూ. 6 వేలు ఇస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం నుండి 38,68,211 మంది రైతులకు మాత్రమే ఈ సహాయం అందుతున్నది. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులున్నారు. అంటే ప్రస్తుతం 55 శాతం మందికి మాత్రమే ఈ పథకం అందుతోందన్న మాట. ఆర్‌బీఐ చట్ట ప్రకారం, గత రాష్ట్ర ప్రభుత్వాల జీవోల ప్రకారం... జూన్, జూలైల్లో వసూళ్ళ పేరుతో జప్తులు చేయరాదు. రైతును ఏమాత్రం అలజడికి గురి చేయరాదు. అలా జరిగినప్పుడు ‘రుణ విమోచన కమిషన్‌’ (ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది)కు రిపోర్టు చేసి వారి సహాయంతో రైతులు డబ్బులు తీసుకోవాలి. 

18–59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎలాంటి మరణానికి గురైనా వారికి బీమా కంపెనీ రూ. 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. 2018లో ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియంలో 70–80 శాతం మాత్రమే క్లెయిమ్‌ల కింద ఇస్తున్నారు. మిగిలిన డబ్బు వారు లాభంగా పొందుతున్నారు. పై 8 సమస్యలను సాగు ప్రారంభానికి ముందే పరిష్కరిస్తేనే రైతులకు ప్రయోజనముంటుంది. (క్లిక్‌: ఆదివాసీ అస్తిత్వాలకు గొడ్డలిపెట్టు)


- సారంపల్లి మల్లారెడ్డి 
ఏఐకెఎస్‌ ఉపాధ్యక్షులు

మరిన్ని వార్తలు